మీరు 60 ప్లస్సా ..

– మునుపటి లా ఆకలి వేయడం లేదా ..
– ఆహారం మీద ఆసక్తి తగ్గిందా ..
– అయితే ఈ కథనం మీ కోసమే

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 7 : వయసు పెరుగుతున్న కొద్దీ చాలా మంది పెద్దలు “ఇంతకు ముందులా ఆకలి వేయడం లేదు”, “కొద్దిగా తిన్నా కడుపు నిండినట్టే అనిపిస్తోంది”, “తిండి మీద ఆసక్తి తగ్గిపోయింది” అని చెబుతుంటారు. ఇది కేవలం అలవాటు మార్పు మాత్రమే కాదు. వృద్ధాప్యంలో శరీరంలో జరిగే సహజ మార్పులు, హార్మోన్ల హెచ్చుతగ్గులు, వాసన–రుచి గ్రహించే శక్తి తగ్గడం, కండరాల క్షీణత, మందుల ప్రభావం, ఒంటరితనం వంటి అనేక అంశాలు కలిసి ఆకలిని తగ్గిస్తాయి. వైద్యశాస్త్రంలో దీనిని “అనొరెక్సియా ఆఫ్ ఏజింగ్ష‌  అని కూడా వ్యవహరిస్తారు. ఇది సాధారణ వృద్ధాప్య లక్షణమే అయినప్పటికీ, నిర్లక్ష్యం చేస్తే పోషకాహార లోపం, బలహీనత, రోగనిరోధక శక్తి తగ్గడం, ఎముకల బలహీనత వంటి సమస్యలకు దారితీస్తుంది.

హార్మోన్ల మార్పుల ప్రభావం

మనకు ఆకలి వేయాలా వొద్దా అన్న విషయాన్ని మెదడు, జీర్ణవ్యవస్థ కలిసి నియంత్రిస్తాయి. దీనిలో అనేక హార్మోన్లు కీలక పాత్ర పోషిస్తాయి. వయసు పెరుగుతున్న కొద్దీ ఈ హార్మోన్ల పనితీరులో మార్పులు వస్తాయి. ఆకలిని పెంచే ఘ్రెలిన్ అనే హార్మోన్ ప్రభావం తగ్గుతుండగా, కడుపు నిండిందనే సంకేతాన్ని ఇచ్చే లెప్టిన్ , కోలెసిస్టోకైనిన్ వంటి హార్మోన్ల ప్రభావం ఎక్కువసేపు ఉంటుంది. దీంతో కొద్దిగా తిన్నా చాలు అన్న భావన కలుగుతుంది. అంతేకాక జీర్ణక్రియ కూడా నెమ్మదించడంతో ఆహారం ఎక్కువసేపు కడుపులోనే ఉండి ఆకలి మరింత ఆలస్యంగా వేస్తుంది.

వాసన, రుచి తగ్గిపోవడం

ఆహారం పట్ల ఆసక్తి కలగడానికి రుచి, వాసన ప్రధాన కారణాలు. కానీ వృద్ధాప్యంలో ముక్కులోని వాసన గ్రహించే కణాలు, నాలుకపైని రుచి గ్రాహకాలు క్రమంగా బలహీనపడతాయి. దీనివల్ల ఒకప్పుడు ఎంతో ఇష్టంగా తిన్న వంటకాలు కూడా ఇప్పుడు సాధారణంగా అనిపిస్తాయి. కొన్ని మందులు, మధుమేహం, ధూమపానం, దంత సమస్యలు కూడా రుచి–వాసనను మరింత తగ్గిస్తాయి. ఆహారం రుచిగా అనిపించకపోతే సహజంగానే తినే పరిమాణం తగ్గిపోతుంది.

కండరాల క్షీణత కూడా ఒక కారణమే

వయసు పెరిగే కొద్దీ శరీరంలోని కండరాల పరిమాణం తగ్గే పరిస్థితిని సార్కోపీనియా అంటారు. కండరాలు తగ్గడంతో శరీరానికి అవసరమయ్యే శక్తి కూడా తగ్గుతుంది. దీంతో ఆకలి కూడా తగ్గుతుంది. అయితే ఇదే సమయంలో తక్కువగా తినడం వల్ల కండరాలు మరింత క్షీణించే ప్రమాదం ఉంది. ఇది ఒక దుష్పరిణామ చక్రంలా మారుతుంది. అందుకే 60 పై బడిన వారు  తగిన మోతాదులో ప్రోటీన్ తీసుకోవడం అత్యంత అవసరం.

మందుల ప్రభావం

వృద్ధులు సాధారణంగా రక్తపోటు, మధుమేహం, గుండెజబ్బులు, థైరాయిడ్ సమస్యలు, కీళ్ల నొప్పులు వంటి అనేక వ్యాధులకు మందులు వాడుతుంటారు. కొన్ని మందులు నోరు ఎండిపోవడం, వికారం, రుచి మారిపోవడం, కడుపు నిండిన భావన వంటి దుష్ప్రభావాలను కలిగిస్తాయి. ఫలితంగా తినాలనే ఆసక్తి తగ్గుతుంది. ఒకవేళ మందులు ప్రారంభించిన తర్వాతే ఆకలి తగ్గితే వైద్యుడిని సంప్రదించి ప్రత్యామ్నాయ మందులు ఉన్నాయా అని తెలుసుకోవాలి. స్వయంగా మందులు ఆపేయడం మాత్రం ప్రమాదకరం.

దంతాలు, నోటి ఆరోగ్యం

పళ్ళు ఊడిపోవడం, చిగుళ్ల సమస్యలు, కృత్రిమ దంతాలు సరిగ్గా అమరకపోవడం, నోరు ఎండిపోవడం వంటి సమస్యలు ఆహారం నమలడాన్ని కష్టతరం చేస్తాయి. గట్టిగా ఉండే కూరలు, పండ్లు, మాంసాహారం తినలేక చాలామంది మృదువైన, కానీ పోషకాలు తక్కువగా ఉండే ఆహారాన్ని ఎంచుకుంటారు. దీంతో శరీరానికి అవసరమైన ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు తగ్గిపోతాయి.

ఒంటరితనం, మానసిక ఆరోగ్యం

ఆకలి అనేది కేవలం శారీరక ప్రక్రియ మాత్రమే కాదు; భావోద్వేగాలతో కూడా ముడిపడి ఉంటుంది. జీవిత భాగస్వామిని కోల్పోవడం, పిల్లలు దూరంగా ఉండడం, ఒంటరిగా జీవించడం, నిరాశ, ఆందోళన వంటి పరిస్థితులు కూడా ఆకలిని తగ్గిస్తాయి. చాలా మంది పెద్దలు “ఒక్కరి  కోసం వండి తినాలనిపించడం లేదు” అని చెబుతుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసే అవకాశం ఉంటే తినే పరిమాణం కూడా పెరుగుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి.

పోషకాహార లోపం వల్ల కలిగే ప్రమాదాలు

ఆకలి తగ్గడం వల్ల తక్కువగా తింటే శరీరానికి అవసరమైన పోషకాలు అందవు. దీని వల్ల బరువు తగ్గడం, కండరాల బలహీనత, తరచూ పడిపోవడం, ఎముకలు బలహీనపడడం, రోగ నిరోధక శక్తి తగ్గడం, గాయాలు ఆలస్యంగా మానడం, జ్ఞాపకశక్తిపై ప్రభావం, హాస్పిటల్ లో చేరే అవకాశాలు పెరగడం వంటి సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది.

Health news

ఏమి చేయాలి?

60 ప్లస్ వారు  ఒకేసారి ఎక్కువగా తినలేకపోతే రోజుకు మూడు పెద్ద భోజనాల బదులు ఐదు లేదా ఆరు చిన్నపాటి భోజనాలు తీసుకోవడం మంచిది. ప్రతి భోజనంలో ప్రోటీన్ ఉండేలా చూడాలి. పాలు, పెరుగు, పనీర్, గుడ్లు, చేపలు, చికెన్, పప్పుధాన్యాలు, శనగలు వంటి ఆహారాలు కండరాలను కాపాడడంలో ఉపయోగపడతాయి. రంగురంగుల కూరగాయలు, పండ్లు, తగినంత నీరు, తేలికపాటి వ్యాయామం, నడక, శక్తి పెంచే వ్యాయామాలు కూడా ఆకలిని పెంచడంలో సహాయపడతాయి. భోజన సమయంలో కుటుంబీకులతో కలిసి కూర్చోవడం, ఆహారాన్ని ఆకర్షణీయంగా వడ్డించడం కూడా ప్రయోజనకరం. ఆకలి అకస్మాత్తుగా పూర్తిగా తగ్గిపోవడం, వేగంగా బరువు తగ్గడం, మింగడంలో ఇబ్బంది, నిరంతర వికారం వంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఇవి ఇతర వ్యాధుల సంకేతాలు కూడా కావచ్చు. వయసు పెరిగేకొద్దీ ఆకలి తగ్గడం సహజమైన శారీరక మార్పే అయినప్పటికీ దానిని వయసు వచ్చింది కాబట్టి  సహజం అని నిర్లక్ష్యం చేయరాదు. సరైన పోషకాహారం, క్రమమైన ఆరోగ్య పరీక్షలు, శారీరక చురుకుదనం, మానసిక ఉల్లాసం, కుటుంబ సభ్యుల సహకారం ఉంటే వృద్ధాప్యంలో కూడా మంచి ఆరోగ్యాన్ని, జీవన నాణ్యతను కాపాడుకోవచ్చు. పెద్దలు తక్కువగా తింటున్నారనే విషయాన్ని కుటుంబీకులు గమనించి దానికి గల కారణాలను గుర్తించి తగిన చర్యలు తీసుకోవడం అత్యంత అవసరం. ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి సరైన ఆహారం మొదటి మెట్టు అని గుర్తుంచు కోవాలి.

—————————————

“ఆకలిని నియంత్రించే హార్మోన్లలో మార్పులు, కడుపు నెమ్మదిగా ఖాలీ  కావడం, రుచి–వాసన గ్రహించే శక్తి తగ్గడం వల్ల  వయసు పెరుగుతున్న కొద్దీ చాలామంది పెద్దలకు తినాలనే ఆసక్తి తగ్గుతుంది.దీనికి ప్రధాన కారణం వయస్సుతో శరీరంలో జరిగే సహజ మార్పులే.  అలాగే శారీరక శ్రమ తగ్గడం, కొన్ని దీర్ఘకాలిక వ్యాధులు మరియు మందుల ప్రభావం కూడా ఆకలిని తగ్గించవొచ్చు. అయితే ఆకలి తగ్గడంతో పాటు అనుకోకుండా బరువు తగ్గడం లేదా బలహీనత కనిపిస్తే వైద్యుడిని సంప్రదించడం మంచిది..”
akhila mitra
డాక్టర్ ఎం. అఖిల మిత్ర, 
ప్రకృతి వైద్య నిపుణురాలు మరియు ప్రజారోగ్య సలహాదారు
————–
 ఇది వయస్సు వల్ల శరీరంలో వచ్చే మార్పులు, మందుల ప్రభావం, రుచి, వాసన తగ్గడం లేదా ఇతర ఆరోగ్య సమస్యల వల్ల జరగవొచ్చు. అయితే, దీనిని సాధారణంగా తీసుకోకూడదు. సరైన ఆహారం తీసుకోకపోతే పోషకాహార లోపం, కండరాల బలహీనత, రోగనిరోధక శక్తి తగ్గడం వంటి సమస్యలు రావొచ్చు. పెద్దవారు తక్కువ మోతాదులో తరచుగా, ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. ఆకలి తగ్గడం లేదా బరువు తగ్గడం కొనసాగితే తప్పకుండా వైద్యుడు లేదా డైటీషియన్‌ను సంప్రదించాలి..
Shavva Swathi
 -షవ్వా స్వాతి,  
చీఫ్ క్లినికల్ డైటీషియన్, క్లినికల్ న్యూట్రిషన్ మరియు డైటెటిక్స్ విభాగం, మెడికోవర్ హాస్పిటల్స్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్.
—————-
ఆకలి తగ్గిందని ఆహారం తగ్గించడం సరికాదు…
వృద్ధాప్యంలో ఆకలి తగ్గడం అనేది చాలామందిలో కనిపించే సహజమైన శారీరక మార్పు.  ఆకలి తగ్గిందని ఆహారాన్ని పూర్తిగా తగ్గించడం మంచిది కాదు. అలా చేస్తే శరీరానికి అవసరమైన ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు అందక కండరాల బలహీనత, బరువు తగ్గడం, రోగనిరోధక శక్తి తగ్గడం, ఎముకలు బలహీనపడడం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే 60 ప్లస్ వారు  రోజుకు మూడు పెద్ద భోజనాల కంటే ఐదు లేదా ఆరు చిన్న మోతాదుల్లో పోషకాహారం తీసుకోవాలి. పప్పులు, పాలు, పెరుగు, గుడ్లు, తాజా పండ్లు, ఆకుకూరలు, కూరగాయలను ఆహారంలో భాగం చేసుకోవాలి. తగినంత నీరు తాగడం, రోజూ కొద్దిసేపు నడక లేదా తేలికపాటి వ్యాయామం చేయడం కూడా అవసరం. రెండు మూడు వారాల పాటు ఆకలి లేకపోవడం, వేగంగా బరువు తగ్గడం లేదా మింగడంలో ఇబ్బంది వంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించుకోవాలి.
డాక్టర్ వంశీధర్ , 
జనరల్ ఫిజీషియన్.
===========================

రోజూవారీ డైట్ నియమాలు..
ఉదయం పరగడుపున గోరువెచ్చని నీరు లేదా నానబెట్టిన బాదం పప్పులు పొట్టు తీసినవి,  బ్రేక్‌ఫాస్ట్ ఇడ్లీ సాంబార్‌తో లేదా రాగి జావ/ఓట్స్ గంజి, మధ్యాహ్నం ముందు ఒక కప్పు తాజా పండ్ల ముక్కలు బొప్పాయి/అరటి లేదా కొబ్బరినీళ్లు,

లంచ్​ లో మెత్తటి అన్నం, ఎక్కువ పప్పు, ఆకుకూర లేదా పెరుగు, సాయంత్రం పాలు హార్లిక్స్/ప్రొటీన్ పౌడర్‌తో లేదా వెజిటబుల్ సూప్. రాత్రి తేలికగా జీర్ణమయ్యే కిచిడీ లేదా మెత్తటి ఫుల్కా
కూరతో పెద్దవారు ఒంటరిగా తింటున్నప్పుడు కన్నా, కుటుంబ సభ్యులతో కలిసి కూర్చుని, మాట్లాడు కుంటూ తింటే వారిలో ఆహారంపై ఆసక్తి చాలా వరకు పెరుగుతుందని పరిశోధనల్లో తేలింది. వీలైతే వారితో కలిసి భోజనం చేయడానికి ప్రయత్నించండి. ఈ నియమాలు పాటించడం ద్వారా పెద్ద వయసు వారిలో ఆకలి పెంచి తేలికగా జీర్ణం కావడం వల్ల వారు ఆరోగ్యంగా ఉండగలుగుతారు

Dr Vamshidhar

బి.వినాయక్
వివాన్స్ వెల్ నెస్ సెంటర్ డైటిషన్


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *