మావోయిస్టులు లేకపోవడంతో గంజాయి పెరిగింది

– సరిహద్దు జిల్లాలపై గట్టి నిఘా
– ఈగల్ తరహాలో టీ-మాస్ బ్యూరో
– నేరస్తులకు శిక్ష పడే విధంగా చర్యలు
– అవినీతి పోలీసులను సహించం
– రాష్ట్ర  డీజీపీ  ఆనంద్

ఖమ్మం, ప్రజాతంత్ర, జూలై 7 : అడవుల్లో మావోయిస్టులు లేకపోవడంతో గంజాయి సాగు, రవాణా పెరిగిందని సరిహద్దు రాష్ట్రాల నుంచి తెలంగాణ జిల్లాల్లో ప్రవేశించకుండా గట్టి నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు పోలీస్ బాస్ సీవీ ఆనంద్ అన్నారు. అందుకే ఆదిలాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల పర్యటనలు చేపట్టినట్లు స్పష్టం చేశారు. ఖమ్మం పోలీస్  కమిషనరేట్ లో పోలీస్ అధికారులతో మంగళవారం సమీక్ష అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. గత మూడేళ్ళ లో జరిగిన నేరాలు వాటి నివారణ తదితర అంశాలపై ఎస్ఐ, ఆపై స్థాయి అధికారులతో జిల్లా పర్యటనలో నేరుగా సమీక్షిస్తున్నట్లు వివరించారు. లా అండ్ ఆర్డర్ ఎలాగూ ఉంటుందని, ప్రధానంగా మాదక ద్రవ్యాలు, సైబర్ నేరాలు, రహదారి ప్రమాదాలపై ప్రత్యేకంగా దృష్టి సారించామన్నారు. ప్రజలు కోరుకునే విధంగా ఇకనుంచి రాష్ట్రంలో బేసిక్ పోలీసింగ్ (చేతిలో లాఠీ, సాయుధ సిబ్బంది) ఉంటుందన్నారు. నేరస్తులతో ఎట్టి పరిస్థితుల్లో ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండదన్నారు. పోలీస్ స్టేషన్ లలో మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు ఎస్ హెచ్ ఓలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. నేరస్తులను అరెస్ట్ చేయడంతో పోలీసుల పని అయిపోలేదని, వారికి శిక్ష పడే విధంగా కేసు నడపాల్సిన బాధ్యత కూడా ఉందని అన్నారు. నిందితులకు శిక్షలు పడే విధంగా మేజిస్ట్రేట్లతో పోలీసు అధికారులు సత్సంబంధాలు ఏర్పరచుకుని, సరైన సాక్ష్యాధారాలు సమర్పించాలని, కోర్టుకు హాజరు కావాలని డీజీపీ సూచించారు. అవినీతి పోలీసులను సహించమని, ఒళ్ళు  దగ్గర పెట్టుకొని పని చేయాలని సూచించారు. మాదక ద్రవ్యాల కట్టడికి ఉన్న ఈగల్ టీం తరహాలో రహదారి సేఫ్టీ, ప్రమాదాల నివారణ కోసం టీ-మాస్ బ్యూరో త్వరలో ప్రారంభిస్తామన్నారు. డ్రైవింగ్ సీటు బెల్ట్ మాదిరిగా వెనుక కూర్చున్నవారు కూడా సీటు బెల్ట్ ధరిస్తే ప్రమాద మృతుల శాతం సగం తగ్గుతుందన్నారు. రాష్ట్రంలో 4.5 కోట్ల జనాభా ఉంటే  సుమారు 93 వేల మంది పోలీసులు ఉన్నారని, 0.16 శాతమని ఎంత అదృష్టం ఉంటే ఈ జాబ్ వస్తుందనే విషయాన్ని పోలీస్ అధికారులు, సిబ్బంది గుర్తించాలన్నారు. జీతాలతోనే సమాజంలో గౌరవంగా బతకాలన్నారు. మావోయిస్టులను లేరని, వారి కట్టడి కోసం ఉన్న 1100 మంది పోలీస్ దళాలను 500 మందిని మాత్రమే ఇతర విభాగాలకు వినియోగిస్తున్నామని చెప్పారు. మరి కొంత కాలం లొంగిపోయిన లేదా ఇతర మావోయిస్టులపై నిఘా కొనసాగుతుదన్నారు. పగలు , రాత్రి విజబుల్ పోలీసింగ్ పెంచుతామన్నారు. దొంగతనాలు, రౌడీయిజానికి పాల్పడే అసాంఘిక శక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

జిల్లా పోలీసులకు ప్రశంసలు

జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని డీజీపీ ఆనంద్ ప్రత్యేకంగా ప్రశంసించారు. మాదక ద్రవ్యాల నిరోధం, ముఖ్యంగా గంజాయి అక్రమ రవాణా, సైబర్ క్రైం నేరాల దర్యాప్తులో ఇక్కడి పోలీసుల పని తీరుకు కితాబిచ్చారు.మొత్తంగా అనేక అంశాల్లో ఖమ్మం పోలీసు తీరు ముందంజలోనే ఉందని డీజీపీ తెలిపారు. ఖమ్మంలో రాత్రి దొంగతనాలు పెరిగాయన్నారు. విలేకరుల సమావేశంలో ఐజీ చంద్రశేఖర్ రెడ్డి, పోలీస్ కమిషనర్ సునీల్ దత్, ఏసీపీ వసుంధర తదితరులు పాల్గొన్నారు.

మాద‌క‌ద్ర‌వ్యాల‌పై యుద్ధం చేయాలి…యువ‌త‌ను కాపాడాలి

జిల్లాల పర్యటనలో భాగంగా డీజీపీ ఆనంద్ మంగళవారం ఖమ్మం పోలీస్ కమిషనరేట్‌ను సందర్శించి నేరాల నియంత్రణ, శాంతిభద్రతలు, రోడ్డు భద్రత, సాంకేతికత ఆధారిత పోలీసింగ్‌పై సమగ్ర సమీక్ష నిర్వహించారు. బ్యాక్ టు బేసిక్స్ అనే సందేశాన్ని ఇస్తూ నిజాయతీ , ప్రజలకు కనిపించే పోలీసింగ్ , నిష్పాక్షికత , సాంకేతికత  ఆధారంగా బలమైన, సమర్థవంతమైన పోలీసింగ్ అందించాలని సూచించారు. డీజీపీ రోడ్ సేఫ్టీ పార్కును ప్రారంభించారు. జిల్లాలో ఏర్పాటు చేసిన 250 సీసీటీవీ కెమెరాలను కమాండ్ సెంటర్‌కు అనుసంధానించిన వ్యవస్థను ప్రారంభించారు. విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించిన పోలీసు సిబ్బందిని అభినందించారు. పోలీసు సిబ్బంది, ప్రజలకు హెల్మెట్లు పంపిణీ చేసి రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించాలని సూచించారు. వనమహోత్సవ కార్యక్రమంలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణలో పోలీసుల భాగస్వామ్యం ఉండాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లో సీసీటీవీ కెమెరాల ఏర్పాటులో సహకరించిన ప్రజలను ప్రత్యేకంగా అభినందించారు. గ్రామాలు, విద్యాసంస్థల్లో యువత మాదకద్రవ్యాలకు బానిస కాకుండా సమాజమంతా అప్రమత్తంగా ఉండాలని, డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారం బాధ్యతాయుతంగా పోలీసులకు అందించాలని కోరారు. మాదకద్రవ్యాలపై యుద్ధం చేయాలి.. భావితరాలను కాపాడాలి అని స్పష్టం చేశారు. రాత్రి గస్తీని మరింత బలోపేతం చేసి ఆస్తి నేరాలను అరికట్టాలని, సీసీటీఎన్ ఎస్ లో సమాచారాన్ని ఖచ్చితంగా నమోదు చేయాలని ఆదేశించారు. పేదలు, బలహీనవర్గాలకు చట్టప్రకారం న్యాయం చేయాలని, సివిల్, భూ వివాదాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ జోక్యం చేసుకోవద్దని, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (ఎస్ ఓపీలు)ను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. ఇసుక, మట్టి మాఫియా, రౌడీషీటర్లపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సీసీటీఎన్ ఎస్‌ 3.0, హాక్ ఐ 3.0, టీజీ కాప్స్ 3.0 వంటి సాంకేతిక వేదికలను సమర్థంగా వినియోగించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. అనంతరం పోలీస్ కమిషనర్ జిల్లా పోలీసింగ్, నేరాల ధోరణులు, సాంకేతిక ఆధారిత పోలీసింగ్, ట్రాఫిక్ నిర్వహణ, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల నియంత్రణ తదితర అంశాలపై ప్రజెంటేషన్ ఇచ్చారు. సమీక్షలో ఫైనాన్స్ ఫ్రాడ్ కేసులు 30 శాతం, ఉద్యోగ మోసాల కేసులు 36 శాతం పెరిగినట్లు వెల్లడించారు. నకిలీ పత్రాలు, జీఎస్టీ సంబంధిత నేరాలు కూడా పెరుగుతున్నాయని వివరించారు. సైబర్ నేరాల పరంగా జూన్ 2026 నాటికి 711 కేసులు నమోదయ్యాయని, బాధితులు రూ.9.48 కోట్లు కోల్పోయారని, అందులో రూ.1.41 కోట్లు తిరిగి అందించినట్లు తెలిపారు. మాదక ద్రవ్యాల నియంత్రణలో భాగంగా 2026లో 1,700 కిలోల గంజాయి, 2025లో సుమారు 4,000 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు కమిషనర్ వివరించారు. రాష్ట్రంలో అత్యధిక గంజాయి స్వాధీనం నమోదవుతున్న కమిషనరేట్లలో ఖమ్మం ఒకటిగా నిలిచిందన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *