నిప్పుతో చెలగాటమాడుతున్న కేంద్రం

– తమిళనాడు సీఎం స్టాలిన్ తీవ్ర విమర్శలు
– నేడు రాష్ట్రవ్యాప్తంగా నల్ల జెండాల ప్రదర్శనకు పిలుపు

చెన్నై, ఏప్రిల్ 15: దేశ రాజకీయాల్లో నియోజకవర్గాల పునర్విభజన బిల్లు హాట్ టాపిక్ అయింది. లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం గురువారం ఈ బిల్లును ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాలు మిశ్రమ గళాన్ని వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎం.కె.స్టాలిన్ కేంద్ర తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డీలిమిటేషన్ పక్రియను దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న ’చారిత్రక అన్యాయం’గా అభివర్ణించారు. ’కేంద్ర ప్రభుత్వం నిప్పుతో చెలగాటం ఆడుతోంది. జనాభా నియంత్రణను సమర్థవంతంగా పాటించి అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న రాష్ట్రాలకు శిక్ష విధిస్తారా’ అని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఉత్తరాది రాష్ట్రాలకు రాజకీయంగా లబ్ది చేకూర్చి, దక్షిణాది ప్రాబల్యాన్ని తగ్గించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా తమిళనాడు వ్యాప్తంగా గురువారం నల్ల జెండాలతో నిరసన తెలపాలని డీఎంకే పిలుపునిచ్చింది. ఈ మేరకు ఇంటింటిపై నల్ల జెండాలు ఎగురవేయాలని ప్రజలను స్టాలిన్ కోరారు. ’తమిళనాడు పోరాడుతుంది.. తమిళనాడు గెలుస్తుంది’ అంటూ ప్రకటించారు. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల విభజన జరిగితే జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ట్రాల లోకసభ సీట్లు తగ్గి, ఉత్తరాది రాష్ట్రాల సీట్లు భారీగా పెరుగుతాయన్నది సీఎం స్టాలిన్ అభియోగం. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల గొంతు నొక్కడం సమాఖ్య వ్యవస్థకే ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే నిధుల పంపిణీలో అన్యాయం జరుగుతోందని, ఇప్పుడు రాజకీయంగా కూడా మొండిచేయి ఎదురవుతుందని వాదిస్తున్నారు. దక్షిణాది ఆత్మగౌరవం కోసం రాజీ లేని పోరాటం చేస్తామని స్టాలిన్ స్పష్టం చేశారు. ఒకవేళ కేంద్రం ఈ బిల్లును ఉపసంహరించుకోకపోతే భారీ మూల్యం తప్పదని హెచ్చరించారు. మరోవైపు, రేపు పార్లమెంటులో ఈ బిల్లు ప్రవేశపెట్టనున్న తరుణంలో విపక్షాలు ఐక్య పోరాటానికి సిద్ధమవుతున్నాయి. రాజ్యాంగ విలువలు, సమాఖ్య స్ఫూర్తిని కాపాడాలని కోరుతూ గళం ఎత్తేందుకు సిద్ధమయ్యాయి. ఈ పోరు సీట్ల కోసం మాత్రమే కాదు.. దక్షిణాది రాష్ట్రాల ఉనికి, గౌరవం కోసమని విపక్ష పార్టీలు చెబుతున్నాయి.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *