రేప‌టి నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు

– మహిళా బిల్లు, డీలిమిటేషన్‌పై చర్చ
– ప్రభుత్వ తీరుపై విపక్షాల అసహనం
– వాడీవేడిగా సాగనున్న సమావేశాలు

న్యూదిల్లీ, ఏప్రిల్ 15: పార్లమెంట్ మరో చారిత్రక నిర్ణయానికి వేదిక కాబోతున్నది. మహిళా బిల్లు, డీ లిమిటేషన్ బిల్లు ఆమోదం కోసం ఉభయ సభలు గురువారం నుంచి మూడ్రోజులు సమావేశం కాబోతున్నాయి. మహిళా బిల్లును ఇప్పటికే ఆమోదంచారు. 2026 జనాభా లెక్కల మేరకు సీట్లు కేటాయిస్తామని ప్రకటించారు. అయితే ఇప్పుడు 2011 జనాభా లెక్కల మేరకే దీనిని మోదించే అవకాశం కనిపిస్తోంది. ఈ క్రమంలో పార్లమెంట్ ఉభయ సభలు వాడీవేడిగా సాగే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న బిల్లు స్వరూపాన్ని విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. అందువల్ల నేటి నుంచి సాగే సమావేశాలపై ఉత్కంఠత కొరసాగుతోంది. ఉభయ సభల్లోనూ బిల్లుల ఆవశ్యకతపై ప్రధాని మోదీ మాట్లాడతారు. ఇప్పటికే కాంగ్రెస్ తన వ్యూహం ఖరారు చేసుకుంది. తృణమూల్ సహా అనేక పార్టీలు అధికార బీజేపీ తీరును తప్పుపడుతున్నాయి. ఇక దేశంలో అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన కోసం ఇప్పటివరకూ నాలుగు డీలిమిటేషన్ కమిషన్లు పని చేశాయి. ఇప్పుడు అయిదవది ఏర్పాటవుతోంది. ఇందులో రాష్ట్రాల నుంచి ఎన్నికయ్యే వారి సంఖ్యను 815గా, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి 35గా పేర్కొంది. ఇందుకోసం రాజ్యాంగంలోని ఆర్టికల్ 81ని సవరించాలని నిర్ణయించింది. దీని ప్రకారం లోక్‌సభ స్థానాలు 54.54శాతం మేర పెరిగే అవకాశముంది. ఇప్పటివరకూ ఆర్టికల్ 81(1) కింద రాష్ట్రాల నుంచి ఎన్నికయ్యే గరిష్ఠ లోక్‌సభ సభ్యుల సంఖ్య 530, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి ఎన్నికయ్యే వారి గరిష్ఠ సంఖ్య 20గా ఉన్నాయి. ప్రస్తుతం 543 లోక్‌సభ స్థానాలకే ఎన్నికలు జరుగుతున్నాయి. మహిళా రిజర్వేషన్లను 2029 నుంచి అమలు చేయడానికి వీలుగా 131వ రాజ్యాంగ సవరణ బిల్లు-2026ను కేంద్రం తీసుకొస్తోంది. ఇందులో 2026 జనాభా లెక్కలకు ముందే నియోజకవర్గాలను పునర్విభజించడానికి వీలు కల్పిస్తూ ఆర్టికల్ 55, 81, 82, 170, 330, 332, 334ఏలకు సవరణలు ప్రతిపాదించింది.  కేంద్రం కొత్త స్థానాల సంఖ్యను 840దాకా ఖరారు చేసే సూచనలున్నాయి. అయితే ఇదివరకు వివిధ పార్టీల నాయకులతో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు చర్చలు జరిపినప్పుడు మొత్తం స్థానాలను గంపగుత్తగా 50శాతం పెంచుతామని చెప్పారు. ఆ ప్రకారం చూస్తే ఇప్పుడున్న 543 స్థానాలు 816కి చేరే అవకాశం ఉంటుంది. ఆర్టికల్ 81(3)లో 2026 తర్వాత ప్రచురించే తొలి జనాభా లెక్కల ఆధారంగానే లోక్‌సభ నియోజకవర్గాలను పునర్విభజించాలని ఉంది. ఇప్పుడు దాన్ని సవరించి గతంలోని జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాలను పునర్విభజించడానికి తాజా బిల్లును కేంద్రం ప్రతిపాదించింది. ఆర్టికల్ 82 అసెంబ్లీ స్థానాల పునర్విభజన, ఆర్టికల్ 170 అసెంబ్లీ స్థానాల గరిష్ఠ సంఖ్య గురించి చెబుతున్నాయి. ఇప్పటివరకూ ఉన్న నిబంధనల ప్రకారం అసెంబ్లీ స్థానాలను పునర్విభజించాలంటే 2026 తర్వాత ప్రచురించే తొలి జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఆ నిబంధనను సవరించి ప్రతి జనాభా లెక్కల తర్వాత అసెంబ్లీ స్థానాలను పునర్విభజించడానికి అవకాశం కల్పించారు. ఆర్టికల్ 334ఏలో ఇదివరకు 106వ రాజ్యాంగ సవరణ చట్టం-2023 (మహిళా రిజర్వేషన్ల చట్టం) ఆమోదం పొందిన తర్వాత చేపట్టే తొలి జనాభా లెక్కల ప్రాతిపదికన నిర్వహించే నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే మహిళా రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. ఇప్పుడు దాన్ని సవరించి డీలిమిటేషన్ పక్రియ పూర్తయిన వెంటనే ఇవి అమల్లోకి వస్తాయని స్పష్టత ఇచ్చారు. 84వ రాజ్యాంగ సవరణ చట్టం-2001లో ఆర్టికల్ 55, 81, 82, 170, 330, 332లను సవరించి 1971 జనాభా లెక్కల ప్రకారమే పార్లమెంటు, అసెంబ్లీల సీట్లను కేటాయించాలని పేర్కొన్నారు. 2026 తర్వాత తొలి జనాభా లెక్కలు చేపట్టేంతవరకూ వాటిని పునర్విభజించకూడదని షరతు విధించారు. 2003లో చేసిన 87వ రాజ్యాంగ సవరణ చట్టంలో ఆర్టికల్ 81, 82, 170, 330లను సవరించి అసెంబ్లీ, లోక్‌సభ సీట్లను పెంచకుండా 2001 జనాభా లెక్కల ప్రకారం ఆయా రాష్ట్రాల్లోని స్థానాలను పునర్విభజించు కోవడానికి అవకాశం కల్పించారు. దీని ప్రకారం 2008లో నియోజకవర్గాల పునర్విభజన చేయగా 2009 ఎన్నికల్లో అవి అమల్లోకి వచ్చాయి. మహిళా రిజర్వేషన్లకు అనుగుణంగా దేశవ్యాప్తంగా లోక్‌సభ, అసెంబ్లీ సీట్ల పునర్విభజన కోసం సుప్రీంకోర్టు ప్రస్తుత/మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు కానుంది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌గానీ, ఆయన నామినీగానీ ఎక్సఅఫీషియో సభ్యుడిగా ఉంటారు. అలాగే రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులు ఎక్స్ అఫీషియో సభ్యులుగా నియమితులవుతారు. బిల్లు పార్లమెంటు ఉభయ సభల ఆమోదం పొంది చట్ట రూపం దాల్చిన తర్వాత కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసిన నాటినుంచి కమిషన్ అమల్లోకి వస్తుంది. ఇది దేశవ్యాప్తంగా ఉన్న పార్లమెంటు, అసెంబ్లీలతోపాటు, పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతంలోని అసెంబ్లీ స్థానాల పునర్విభజననూ చేపడుతుంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *