బంగ్లాలో పౌరుల పడవ మునక

– 250 మంది గల్లంతు.. ముమ్మర గాలింపు

ఢాకా, ఏప్రిల్ 15 : అండమాన్ తీర సముద్రంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రోహింగ్యా శరణార్థులు, బంగ్లాదేశ్ పౌరులతో వెళ్తోన్న ఓ పడవ మునిగిపోయింది. ఘటనలో దాదాపు 250 మంది గల్లంతయ్యారు. వారి కోసం సముద్రంలో ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతైన వారిలో చిన్నారులు కూడా ఉన్నారు. ఈ ప్రమాదంపై ఐక్యరాజ్య సమితి శరణార్థుల హైకమిషనర్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ సంయుక్త ప్రకటన విడుదల చేసింది. ఈ పడవ దక్షిణ బంగ్లాదేశ్‌లో టేక్‌నాఫ్ ప్రాంతం నుంచి బయల్దేరినట్లు ఈ ప్రకటనలో ఐరాస అధికారులు పేర్కొన్నారు. మలేసియా వెళ్తుండగా బలమైన ఈదురుగాలులు, కెరటాల ఉధ తి కారణంగా మునిగినట్లు వెల్లడించారు. ఈ పడవలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించారని, అది కూడా ప్రమాదానికి కారణమై ఉండొచ్చని తెలిపారు. ఈ పడవ ఈనెల 4న బంగ్లాదేశ్ నుంచి బయల్దేరినట్లు తెలుస్తోంది. కాక్స్ బజార్‌లోని శరణార్థుల శిబిరాల్లో ఉన్న వీరు కనీస జీవన సదుపాయాల కోసం మలేసియాకు వలస వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకున్నట్లు ఐరాస అధికారులు వెల్లడించారు. వాస్తవానికి రోహింగ్యాలు మయన్మార్‌కు చెందినవారు. కానీ, 2017లో అక్కడి సైన్యం మారణహోమం నుంచి తప్పించుకునేందుకు లక్షలాది రోహింగ్యాలు బంగ్లాదేశ్‌కు తరలిపోయారు. దీంతో కాక్స్ బజార్‌లో శరణార్థి శిబిరాలు కిక్కిరిసిపోయాయి. అయితే, ఇటీవల ఇక్కడి పరిస్థితులూ క్షీణించడంతో వీరంతా ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయేందుకు వలసబాట పడుతున్నారు. ఈ క్రమంలోనే ప్రమాదకర సముద్ర ప్రయాణాలను ఎంచుకుంటున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *