నీటి కష్టాలకు బీఆర్ఎస్ పాలనే కారణం

– ఎల్‌నినో ప్రకృతి సహజం.. జల వనరుల విధ్వంసం బీఆర్ఎస్ పాపం
– పాలమూరు-రంగారెడ్డిని శ్రీశైలానికి మార్చి రైతుల గొంతు కోశారు
– పెరిగిన‌ అంచనాలు, కమీషన్లు .. పొలాలకు చేరని నీరు
– రూ.1.81 లక్షల కోట్లు ఖర్చు.. ఒక్క ప్రాజెక్టూ పూర్తి కాలేదు
– మీడియాతో మంత్రి ఉత్తమ్ చిట్ చాట్
– నారాయణపూర్ నుంచి నీరు ఇవ్వాలని కర్ణాటకకు విజ్ఞప్తి

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 22: రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న తీవ్ర నీటి సంక్షోభానికి కేవలం ‘ఎల్‌నినో’ మాత్రమే కారణం కాదని, గత పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రణాళికా లోపాలు, అసమర్థ నిర్ణయాలు, పెండింగ్ ప్రాజెక్టుల పట్ల నిర్లక్ష్యమే ప్రధాన కారణమని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.మంగ‌ళ‌వారం సచివాలయంలో మీడియాతో నిర్వహించిన చిట్ చాట్ లో ఆయన గత ప్రభుత్వ వైఫల్యాలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆకాశంలో ఎల్‌నినో వర్షాలను తగ్గిస్తే.. భూమిపై నీటి నిల్వలు లేకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందని మండిపడ్డారు. తక్కువ ఖర్చుతో జూరాల నుంచి చేపట్టాల్సిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని శ్రీశైలానికి మార్చి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా రైతుల గొంతు కోశారని మంత్రి విమర్శించారు. దీనివల్ల నీటిని ఎత్తిపోసే ఎత్తు, నిర్మాణ వ్యయం, శాశ్వత విద్యుత్ భారం పెరిగాయన్నారు. అంచనాలు పెంచి కమీషన్లు దండుకోవడానికే ప్రాజెక్టును మార్చారని, ఫలితంగా ప్రాజెక్టు వ్యయం పెరిగినా రైతుల పొలాలకు మాత్రం నీరు చేరలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జూరాల వద్ద ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ రిజర్వాయర్లు నిర్మించి ఉంటే వరద నీటిని నిల్వ చేసి కరవు సమయంలో వాడుకునే అవకాశం ఉండేదన్నారు. పదేళ్లలో సాగునీటి రంగంపై రూ. 1.81 లక్షల కోట్లు ఖర్చు చేసినా ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేకపోయారని దుయ్యబట్టారు.

కృష్ణా జలాల వినియోగంలో కాంగ్రెస్‌దే రికార్డు

కృష్ణా జలాల్లో ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు కేవలం 299 టీఎంసీలు సరిపోతాయంటూ అప్పట్లో అంగీకరించి కాగితాలపై సంతకాలు చేసిన బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు జల హక్కుల గురించి మొసలి కన్నీరు కారుస్తున్నారని ఉత్తమ్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రికార్డు స్థాయిలో 280.7 టీఎంసీల కృష్ణా జలాలను వినియోగించుకున్నామని తెలిపారు. గత ప్రభుత్వం పదేళ్లుగా నిర్లక్ష్యం చేసిన ఉమ్మడి నల్లగొండ జిల్లా కష్టాలు తీర్చే ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పనులను 2028 జూన్ నాటికి పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. కృష్ణా బేసిన్‌లో సాగు విస్తీర్ణం, వరి పంట, ధాన్యం సేకరణలోనూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే గణనీయమైన పురోగతి నమోదైందన్నారు. “మేము నీటి గురించి నినాదాలు చేయడం లేదు-నీటిని వినియోగించి చూపిస్తున్నాం. వారు ప్రచారం కోసం ప్రాజెక్టులు కట్టారు. మేము రైతు పొలానికి నీరు చేరేలా వ్యవస్థలను పూర్తి చేస్తున్నాం అని స్పష్టం చేశారు.

ఎస్‌ఎల్‌బీసీని పూర్తి చేసి నల్లగొండకు న్యాయం

ఎస్‌ఎల్‌బీసీ సొరంగాన్ని గత ప్రభుత్వం పదేళ్లపాటు నిర్లక్ష్యం చేసిందని మంత్రి విమర్శించారు. ఈ సొరంగం పూర్తయి ఉంటే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రస్తుతం నెలకొన్న నీటి ఇబ్బందులు చాలావరకు తగ్గేవన్నారు. జూన్ 2028 నాటికి ఎసఎల్‌బీసీని పూర్తి చేసి తీరుతామని ఆయన చెప్పారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఎసఎల్‌బీసీ పనులను అత్యంత ప్రాధాన్యంతో ముందుకు తీసుకెళ్తోందని చెప్పారు. ఈ సొరంగం పూర్తయితే శ్రీశైలం జలాశయంలో పోతిరెడ్డిపాడు కంటే తక్కువ నీటిమట్టం నుంచే తెలంగాణకు నీటిని తీసుకునే అవకాశం కలుగుతుందని వివరించారు.

రైతులను కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు

ప్రస్తుత నీటి కొరత నేపథ్యంలో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం అందుబాటులో ఉన్న అన్ని ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తోందని ఉత్తమ్ తెలిపారు. ప్రకృతి పరీక్ష పెడితే రైతుకు అండగా నిలబడటం మా బాధ్యత. గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల ఏర్పడిన గాయాలను కూడా మేమే మాన్పుతున్నాం. తెలంగాణ రైతును కాపాడేందుకు అవసరమైన ప్రతి చర్య తీసుకుంటాం” అని హామీ ఇచ్చారు. ప్రస్తుత కరువు పరిస్థితుల్లో ఎండిపోతున్న పంటలను కాపాడేందుకు నారాయణపూర్ జలాశయం నుంచి జూరాలకు కొంత నీటిని విడుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వాన్ని కోరామని మంత్రి వివరించారు. దీనిపై సానుకూల స్పందన వస్తుందని ఆశిస్తున్నామన్నారు. ముందుముందు తాగునీటికి ఇబ్బంది లేకుండా జలాశయాల్లో అందుబాటులో ఉన్న నీటిని అత్యంత పొదుపుగా, జాగ్రత్తగా వినియోగిస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *