దళితులు, గిరిజనులకు భరోసా

– ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల్లో పెద్ద పీట
– ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ బాధితులకు సత్వర న్యాయం
– గ్రీన్ ఛానెల్ ద్వారా నిధుల విడుదల 
– హైలెవెల్ కమిటీ సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
– రాష్ట్రం ఏర్పడిన తర్వాత సమావేశం ఇదే తొలిసారి

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 22 : దళితులు, గిరిజనులు, ఆదివాసీల అభివృద్ధే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. విద్య, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి ద్వారానే సమాజంలో మార్పు వస్తుందని, ఎస్సీ, ఎస్టీలపై అణచివేతను అధిగమించేందుకు రాజకీయాలకతీతంగా అందరూ కలిసి పనిచేయాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం-1989 అమలుపై రాష్ట్రస్థాయి ఉన్నత నిఘా, పర్యవేక్షణ కమిటీ సమావేశం జరిగింది. చట్టం అమలు, నమోదైన కేసులు, దర్యాప్తు పురోగతి, న్యాయస్థానాల్లో విచారణ, కేసుల పరిష్కారం, బాధితులకు అందుతున్న ఆర్థిక సహాయం, పునరావాస చర్యలను సమీక్షించారు. కేసుల విచారణ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక న్యాయస్థానాలు, మొబైల్ కోర్టుల పనితీరు, చట్టంపై చేపడుతున్న అవగాహన కార్యక్రమాలపైనా చర్చించారు. ఉమ్మడి ఏపీలో 2013 ఫిబ్రవరి 11న ముఖ్యమంత్రి అధ్యక్షతన రాష్ట్రస్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరగగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ సమావేశం జరగడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా రాష్ట్రంలో క్రమంగా అయిదేండ్లలో ఎస్సీ, ఎస్టీలపై అట్రాసిటీ కేసులు తగ్గుముఖం పట్టాయని అధికారులు వివరించారు. కొన్ని జిల్లాల్లో ప్రధానంగా 73 గ్రామాల్లో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయని నివేదించారు. అక్కడ పోలీసు విభాగం ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన అవసరముందన్నారు. జిల్లాస్థాయి విజిలెన్స్ కమిటీల మీటింగ్‌లు క్రమం తప్పకుండా జరిగేలా చూడాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ నిరోధక చట్టం కింద బాధితులకు చెల్లించాల్సిన నష్ట పరిహారాన్ని వెంటనే చెల్లించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. బడ్జెట్ కేటాయింపులతో ముడిపెట్టకుండా గ్రీన్ ఛానెల్ ద్వారా నిధులు విడుదల చేయాలన్నారు. అట్రాసిటీ ఘటనల్లో బాధితుల పట్ల ప్రభుత్వం మానవీయ కోణంలో స్పందించాలని, వారికి సకాలంలో నష్టపరిహారం, సహాయం, పునరావాసం అందేలా చూడాలని స్పష్టం చేశారు. ఇటీవల షాబాద్ హత్యల కేసు, తుక్కుగూడలో నర్సుపై హత్యాచారం కేసులను ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించి బాధిత కుటుబాలకు సత్వర న్యాయం చేయాలని ఆదేశించారు. ప్రతి ప్రభుత్వ పథకం, కార్యక్రమంలో దళితులు, గిరిజనులు, ఆదివాసీలకు తగినంత ప్రాధాన్యమిస్తున్నట్లు చెప్పారు. దళితులు, గిరిజనులను కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటినుంచో సొంత బిడ్డల్లా ఆదరించిందని, అందుకే పల్లెపల్లెనా ఇప్పటికీ ఇందిరమ్మను తలుచుకుంటున్నారని చెప్పారు. పేదలకు 25 లక్షల ఎకరాల అసైన్డ్ భూములకు పట్టాలు అందించిన ఘనత మాజీ ప్రధాని ఇందిరాగాంధీదని గుర్తు చేశారు. ఆమె స్ఫూర్తితోనే రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. రాష్ట్ర బడ్జెట్‌లో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు జనాభా దామాషా ప్రకారం నిధులు కేటాయిస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. రాష్ట్రంలో ఎస్సీ జనాభా దాదాపు 16 శాతం ఉంటే ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో 31 శాతం మంది లబ్దిదారులు ఎస్సీలే ఉన్నారని, ఎస్టీల జనాభా 10 శాతం ఉంటే వారికి 17 శాతం ఇండ్లను మంజూరు చేశామని వివరించారు. రాష్ట్రంలోని 27.5 లక్షల మంది విద్యార్థులకు నర్సరీ నుంచి 12వ తరగతి వరకు అల్పాహారం అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో 3.48 కోట్ల మందికి సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని, దీనివల్ల దళితులు, గిరిజనులు, ఆదివాసీలు సహా పేద కుటుంబాలకు నాణ్యమైన భోజనం అందుతోందని చెప్పారు. దళితులు, గిరిజనులు, ఆదివాసీల అవసరాలను దృష్టిలో ఉంచుకునే ప్రభుత్వం సంక్షేమ పథకాలను రూపొందించి అమలు చేస్తోందన్నారు. చదువు ఒక్కటే జీవితాలను మారుస్తుందని, విద్యతోనే సమాజంలో అసమానతలకు, అణచివేత రుగ్మతలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. పిల్లలను చదువుతోపాటు క్రీడల వైపు ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎంపీలు మల్లు రవి, బలరాం నాయక్, కడియం కావ్య, ఎమ్మెల్యేలు తోట లక్ష్మీకాంతరావు, మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ, వేముల వీరేశం, మందుల సామేల్, మట్టా రాగమయి, వెడ్మ బొజ్జు, మురళీనాయక్, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, డీజీపీ సీవీ ఆనంద్, రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, జాతీయ ఎస్సీ కమిషన్ డైరెక్టర్ సునీల్ బాబు, ఎస్సీ కమిషన్ సభ్యులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *