– మూడేళ్లలో రూ.34.20 కోట్ల నికర లాభం
– 2025-26లోనే రికార్డుస్థాయిలో రూ.23.33 కోట్ల లాభాలు
– మూసివేత అంచుల నుంచి జాతీయస్థాయి సంస్థ దిశగా..
– సింగరేణి నిర్వహణ.. రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో కొత్త ఉత్సాహం
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబరు 22 : దాదాపు మూడు దశాబ్దాల క్రితం రూ.21 కోట్లకు పేరుకుపోయిన నష్టాలు.. మూతపడే పరిస్థితి.. కానీ సింగరేణి అధీనంలోకి వచ్చిన తర్వాత నుంచి ఇప్పటివరకు రూ.60.85 కోట్ల లాభాలు (సంచిత లాభాలు). అందులోనూ గత మూడేళ్లలోనే రూ.34.20 కోట్ల నికర లాభాలు ఆర్జించడం విశేషం. ఒకప్పుడు ఉమ్మడి ఏపీలో ప్రభుత్వరంగ సంస్థగా మనుగడే ప్రశ్నార్థకంగా మారిన ఆంధ్రప్రదేశ్ హెవీ మెషినరీ అండ్ ఇంజినీరింగ్ లిమిటెడ్ (ఏపీహెచ్‌ఎంఈఎల్(అఫ్మెల్) ఇప్పుడు సింగరేణి అనుబంధ సంస్థగా మారి ప్రజా ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత లాభాల బాటలో దూసుకుపోతోంది. ముఖ్యంగా గత మూడేళ్లుగా సంస్థ ఆర్థిక పనితీరు గణనీయంగా మెరుగుపడింది. 2023 డిసెంబరులో రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సింగరేణి విస్తరణతోపాటు దాని అనుబంధ సంస్థ అఫ్మెల్ ను జాతీయస్థాయి సంస్థగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో చేపట్టిన చర్యలు సంస్థకు నూతన జవసత్వాలను అందించాయి. సింగరేణితోపాటు ఇతర భారీ పరిశ్రమలకు యంత్రాలు, వాటి విడిభాగాలను తయారు చేసి సరఫరా చేస్తున్న తన 50 ఏళ్ల చరిత్రలో 2025-26 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో రూ.23.33 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది.
మూడేళ్లుగా వరుస లాభాలు
ఒకప్పుడు తీవ్ర నష్టాలతో మూసివేత అంచులకు చేరిన అఫ్మెల్ ఇప్పుడు వరుసగా లాభాలను నమోదు చేస్తోంది. 2023-24లో రూ.1.05 కోట్లు, 2024-25లో రూ.9.87 కోట్లు, 2025-26లో రూ.23.33 కోట్ల నికర లాభాలను సాధించడం విశేషం. దీంతో 1998-99లో సింగరేణి అధీనంలోకి వచ్చిన తర్వాత నుంచి ఇప్పటి వరకు(2025-26) సంస్థ ఆర్జించిన మొత్తం లాభాలు రూ.60.85 కోట్లకు చేరాయి.
జాతీయ స్థాయికి అఫ్మెల్
ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క ప్రత్యేక చొరవ, దిశానిర్దేశంతో సింగరేణి నాయకత్వంలో అఫ్మెల్‌ను జాతీయస్థాయిలో పోటీపడే సంస్థగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టారు. గత ఏడాది ఆగస్టులో ఉప ముఖ్యమంత్రి స్వయంగా ఆ ప్లాంటును సందర్శించి సంస్థ పనితీరు, అభివృద్ధి ప్రణాళికలపై సమీక్ష నిర్వహించారు. సంస్థ కేవలం తెలుగు రాష్ట్రాల్లోని పరిశ్రమలకు మాత్రమే పరిమితం కాక దేశవ్యాప్తంగా వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. మారుతున్న పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా కొత్త తరహా యంత్రాలు, యంత్ర విడి భాగాలను తయారు చేయడంతోపాటు ఉత్పత్తులను విస్తరించి కొత్త మార్కెట్లను సాధించాలని దిశానిర్దేశం చేశారు. ప్లాంటులో పలు సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించి కార్మికులతో మాట్లాడి వారిని ప్రోత్సహించారు.
సింగరేణి నుంచి.. దేశంలోని దిగ్గజ సంస్థల వరకు
గతంలో ప్రధానంగా సింగరేణి వంటి సంస్థలకు యంత్రాలు, విడిభాగాలను సరఫరా చేసిన అఫ్మెల్ ఇప్పుడు తన మార్కెట్‌ను దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. బీహెచ్‌ఈఎల్, జెన్‌కో, ఎన్‌ఎండీసీ, ఆర్‌ఐఎన్‌ఎల్ వంటి ప్రముఖ సంస్థలకు కూడా యంత్రాలు, విడిభాగాలను సరఫరా చేస్తూ జాతీయస్థాయిలో తన వ్యాపారాన్ని విస్తరిస్తోంది. కొత్త సంస్థల నుంచి ఆర్డర్లు సాధించడం, ఉత్పత్తుల్లో వైవిధ్యం తీసుకురావడం, వ్యయ నియంత్రణ చర్యలు చేపట్టడం సంస్థ ఆర్థిక పనితీరు మెరుగుపడటానికి దోహదపడుతున్నాయి.
మూసివేత అంచుల నుంచి విజయ ప్రస్థానం
పరిశ్రమలకు యంత్ర విడిభాగాలు, చిన్నతరహా యంత్రాలను తయారు చేసి సరఫరా చేయడంతోపాటు స్థానికులకు ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో 1976లో విజయవాడకు సమీపంలోని కొండపల్లి వద్ద 209 ఎకరాల్లో అఫ్మెల్ ను ఏర్పాటు చేశారు. ఇందులో మొదట అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు(ఏపీఐడీసీ) 62.35 శాతం వాటా ఉండగా పబ్లిక్ షేర్ హోల్డర్సుకు 35.08 శాతం, ఉమ్మడి ఏపీ ప్రభుత్వానికి 2.56 శాతం వాటా ఉండేది. ప్రారంభ దశలో ఆశించిన స్థాయిలో ఆర్డర్లు రాకపోవడం, అవసరానికి మించి సిబ్బందిని నియమించుకోవడం తదితర కారణాలతో సంస్థ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. ఒక దశలో ఉద్యోగుల సంఖ్య సుమారు 800కు చేరింది. నష్టాలు పెరగడంతో 1992లో సంస్థను బీఐఎఫ్ఆర్‌కు నివేదించగా 1993 నాటికి ఆర్థికంగా తీవ్ర సంక్షోభంలోకి వెళ్లింది. 1997-98 నాటికి రూ.21 కోట్ల నికర నష్టాలతో సతమతవుతోంది. పరిస్థితి మరింత దిగజారడంతో 2002 నవంబరు 28న సంస్థ మూసివేతకు సంబంధించి బీఐఎఫ్ఆర్ ఉత్తర్వులు జారీ చేసే స్థితికి చేరింది.
కొత్త ఊపిరి పోసిన సింగరేణి
ఏపీహెచఎంఈఎల్ సంక్షోభంలో ఉన్న సమయంలో దానిని ఆదుకునేందుకు సింగరేణి ముందుకొచ్చింది. 1994 నుంచి సింగరేణికి అవసరమైన కొన్ని యంత్రాలు, విడిభాగాల కొనుగోలుకు ఆర్డర్లు ఇవ్వడం ప్రారంభించింది. భూగర్భ గనుల్లో కార్మికుల రవాణాకు ఉపయోగించే మ్యాన్ రైడింగ్ సిస్టమ్స్, భారీ షావెల్స్‌కు అవసరమైన బకెట్లు, రూఫ్ బోల్టింగ్ రాడ్లు తదితర ఉత్పత్తులకు ఆర్డర్లు ఇచ్చి సంస్థకు అండగా నిలిచింది. అయితే కేవలం ఆర్డర్లు ఇవ్వడం ద్వారా సంస్థను పూర్తిస్థాయిలో గట్టెక్కించడం సాధ్యం కాకపోవడంతో ఏపీహెచఎంఈఎల్‌లో పెట్టుబడులు పెట్టి నిర్వహణ బాధ్యతలు చేపట్టేందుకు సింగరేణి ముందుకొచ్చింది. 1997-98లో రూ.9.18 కోట్ల ఈక్విటీ పెట్టుబడితో ఈ ప్రక్రియను ప్రారంభించింది. అనంతరం సింగరేణి మొత్తం రూ.14.08 కోట్ల పెట్టుబడితో 81.54 శాతం వాటాను కలిగి ప్రధాన భాగస్వామిగా మారింది. ప్రస్తుతం పబ్లిక్ షేర్ హోల్డర్లకు 11.81 శాతం, ఏపీ ఐడీసీకి 5.79 శాతం వాటా, అప్పటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వం 0.86 శాతం వాటా కలిగి ఉంది.
సింగరేణి నిర్వహణతో మారిన దశ
సంస్థను లాభాల బాట పట్టించేందుకు ఆర్డర్లు ఇవ్వడమే కాక నిర్వహణలోనూ సింగరేణి కీలక పాత్ర పోషించింది. సింగరేణి నుంచి జనరల్ మేనేజర్ స్థాయి అధికారిని అఫ్మెల్ ఎండీగా నియమించడంతోపాటు పర్సనల్, ఇతర కీలక విభాగాల నిర్వహణకు అధికారులను నియమించింది. ప్రజా ప్రభుత్వం కొలువు దీరిన తర్వాత అప్మెల్‌లో సింగరేణి నిర్వహణ పద్ధతులు, వ్యయ నియంత్రణ, ఉత్పాదకత పెంపు, కొత్త ఆర్డర్ల సాధన వంటి చర్యలతో క్రమంగా ఆర్థికంగా బలోపేతమైంది. ఒకప్పుడు నష్టాల్లో ఉన్న సంస్థ గణనీయమైన లాభాలు ఆర్జించే స్థాయికి చేరింది.
విద్యుత్ ఖర్చు తగ్గించేందుకు 300 కిలోవాట్ల సోలార్ ప్లాంట్
అఫ్మెల్‌ను మరింత లాభదాయకంగా మార్చేందుకు వ్యయ నియంత్రణపైనా ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా ప్లాంట్ ప్రాంగణంలో 300 కిలోవాట్ల సామర్థ్యంతో సోలార్ విద్యుత్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం తన ప్లాంట్ విద్యుత్ అవసరాలకు ఏటా సుమారు రూ.60 లక్షలు ఖర్చు చేస్తోంది. కొత్త సోలార్ ప్లాంట్‌తో విద్యుత్ వ్యయం గణనీయంగా తగ్గనుంది. 300 కిలోవాట్ల సోలార్ ప్లాంట్ ద్వారా రోజుకు సుమారు 1,200 కిలోవాట్ అవర్‌ల విద్యుత్ ఉత్పత్తి కానుంది. దీనివల్ల నెలకు సుమారు రూ.2 లక్షల వరకు విద్యుత్ ఖర్చు ఆదా అయ్యే అవకాశం ఉంది. సోలార్ ప్లాంట్ నిర్మాణానికి సుమారు రూ.1.24 కోట్లు ఖర్చు చేస్తున్నప్పటికీ విద్యుత్ బిల్లుల రూపంలో వచ్చే ఆదాతో దాదాపు ఐదేళ్లలో ఈ పెట్టుబడిని తిరిగి పొందే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత ప్రతి ఏడాది విద్యుత్ వ్యయం తగ్గడం ద్వారా సంస్థకు అదనపు ఆర్థిక ప్రయోజనం చేకూరనుంది. విద్యుత్ ఖర్చుల ఆదాతోపాటు క్లీన్ ఎనర్జీ దిశగా వేసిన ఒక గొప్ప ముందడుగుగా భావించవచ్చు.
మరింత విస్తరణ దిశగా..
అఫ్మెల్ ను జాతీయస్థాయి భారీ ఇంజినీరింగ్ సంస్థగా తీర్చిదిద్దేందుకు చేపడుతున్న చర్యలపై ప్లాంట్ అధికారులు, ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క స్వయంగా ప్లాంటును సందర్శించి అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించడం, ఉద్యోగులు, కార్మికులతో మాట్లాడటం, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వడం తమకు మరింత ప్రోత్సాహాన్ని ఇచ్చిందని వారు పేర్కొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





