హైదరాబాద్, ప్రజాతంత్ర,నవంబర్ 3 : తెలంగాణ మలిదశ ఉద్యమంలో తొలి అమరుడు కాసోజు శ్రీకాంతాచారి 15వ వర్ధంతి సందర్భంగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు నివాళులర్పించారు. అగ్నికి ఆహుతి అవుతూ ‘జై తెలంగాణ’ అంటూ దిక్కులు పెక్కటిల్లేలా నినదించిన పోరాట యోధుడు శ్రీకాంతాచారి అని చెప్పారు. కేసీఆర్ అరెస్టును, ఉద్యమకారులపై ప్రభుత్వ అణచివేతను సహించలేక ఆత్మబలిదానం చేసుకున్న తెలంగాణ అమరుడని తెలిపారు. జోహార్ శ్రీకాంతాచారి అంటూ ట్వీట్ చేశారు. 2009, నవంబర్ 29న ఉద్యమ నాయకుడు కేసీఆర్ ఆమరణ దీక్షకు పూనుకున్నారు. కరీంనగర్ నుంచి సిద్దిపేట దీక్ష స్థలికి వెళ్తుండగా పోలీసులు అరెస్టు చేశారు. దీంతో తెలంగాణ అంతటా ఆందోళనలు, ఉద్యమాలు, నినాదాలతో రాష్ట్రం అట్టుడికిపోయింది.
తెలంగాణ ఉద్యమకారులపై ప్రభుత్వం అణచివేతలు ప్రారంభించింది. ఉద్యమకారులపై లాఠీ దెబ్బలు, అరెస్టులు చూసి తట్టుకోలేకపోయిన శ్రీకాంతా చారి.. కేసీఆర్ అరెస్టు నిరసనగా హైదరాబాద్ ఎల్బీనగర్ చౌరస్తాలో జరిగిన ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నారు. అగ్నికి ఆహుతి అవుతూనే జై తెలంగాణ అంటూ దిక్కులు పెక్కటిల్లేలా నినాదాలు చేశారు. 80 శాతానికిపైగా కాలిపోయిన ఆయనను పోలీసులు, ఉద్యమకారులు సమీపంలోని దవాఖానకు తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం యశోదకు తీసుకెళ్లారు. రెండు రోజుల తర్వాత ఉస్మానియా దవాఖాను తరలించారు. అక్కడి నుంచి అపోలో హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ డిసెంబర్ 3న శ్రీకాంతా చారి అమరుడయ్యారు.