రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
అమరవీరుల త్యాగాలను కెసిఆర్ గౌరవించలేదు : మంత్రి జూపల్లి
యువత త్యాగాలతోనే రాష్ట్రం సాధ్యమైంది : ఎమ్మెల్సీ ప్రొ.కోదండరామ్
హిమాయత్‌నగర్, ప్రజాతంత్ర, డిసెంబర్ 3 : మలిదశ తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతాచారి ఆశయాలను ప్రజా ప్రభుత్వం నెరవేర్చుతుందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో తెలంగాణ జన సమితి పార్టీ అనుబంధ యువజన విద్యార్థి జన సమితి ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమంలో యువత పోషించిన పాత్రను గుర్తు చేస్తూ ‘తెలంగాణ యూత్ డే’ సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ పదేళ్లలో భర్తీ చేయని ఉద్యోగాలను ఏడాదిలోనే భర్తీ చేసిన ఘనత ప్రజా ప్రభుత్వానిదేనని అన్నారు. తెలంగాణ ఉద్యమానికి ప్రాణం పోసిన వ్యక్తి శ్రీకాంతాచారి అని కొనియాడారు. తెలంగాణ తనతోనే వొచ్చిందన్న కెసిఆర్ ప్రగల్భాలు పటాపంచలు కావాలన్నారు. తెలంగాణ కోసం పోరాడుతుంటే, సోనియా గాంధీ మద్దతు ఇచ్చారని, తెలంగాణ డీఎన్‌ఏ ఉంటే కిషన్ రెడ్డి, ప్రధాని వ్యాఖ్యలను ఉపసంహరించుకోమని అడగాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఏర్పాటు కోసం పార్లమెంటులో ఎన్నో పోరాటాలు చేశామన్నారు. తెలంగాణ వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా సహించేదిలేదన్నారు ప్రధాని మోదీ తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించడాన్ని ఖండిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం అమరవీరుల త్యాగాలను గౌరవించకపోవడం అన్యాయం అని అన్నారు.
గత ప్రభుత్వంలో ప్రగతి భవన్‌కు మంత్రులకు కూడా ప్రవేశం లేదని, ప్రజల సమస్యలపై అక్కడ చర్చకు అవకాశం కరువని, గద్దర్ వంటి మహనీయులు కూడా ప్రగతి భవన్ గేటు వద్ద అపాయింట్ మెంట్ కోసం నిరీక్షించారన్నారు. తెలంగాణ జనసమితి అధ్యక్షులు, ఎమ్మెల్సీ ప్రొ.కోదండరామ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం యువత త్యాగాలతోనే సాధ్యమైందని అన్నారు. వారి ఆశయాలు, ఆకాంక్షలు నెరవేర్చడం మన బాధ్యత అని, తెలంగాణ వొస్తే ఉద్యోగాలు వొస్తాయనే నమ్మకంతో యువత త్యాగాలు చేసి ఉద్యమాన్ని ముందుకు నడిపించిందన్నారు. ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు మాట్లాడుతూ తెలంగాణ పితామహుడిగా ప్రొ.కోదండరాం పేరొందారని కొనియాడారు. తెలంగాణ కోసం మంత్రి, ఎమ్మెల్యే పదవికి జూపల్లి రాజీనామా చేశారని గుర్తు చేశారు. యువజన సమితి రాష్ట్ర అధ్యక్షులు సలీమ్ పాషా మాట్లాడుతూ మలిదశ ఉద్యమంలో తొలి అమరుడైన కాసోజు శ్రీకాంతాచారి వర్ధంతిని గత నాలుగు సంవత్సరాలుగా ‘తెలంగాణ యూత్ డే’గా నిర్వహిస్తున్నామన్నారు.
ఈ సదస్సులో విద్యార్థి జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు మాసంపల్లి అరుణ్ కుమార్ ప్రవేశపెట్టిన తీర్మానాలు, అమరుడు శ్రీకాంతాచారి వర్థంతి అయిన డిసెంబర్ 3వ తేదీని తెలంగాణ యూత్ డేగా ప్రకటించడం, స్కిల్ యూనివర్శిటీకి శ్రీకాంతాచారి పేరు పెట్టడం, ప్రైవేటు యూనివర్శిటీలలో రిజర్వేషన్లు అమలు చేయడం, జిల్లా కేంద్రాలలో స్కిల్ సెంటర్లు ఏర్పాటు చేయడం, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయడం, తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వ ఉద్యోగాలలో 5 శాతం రిజర్వేషన్లు కల్పించడం వంటి తీర్మానాలను ఆమోదించారు. ఈ తీర్మానాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి వాటి అమలుకు కృషి చేస్తామని మంత్రులు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో యువజన, విద్యార్థి జన సమితి నాయకులు కొత్త రవి, ఏర్ర వీరన్న, రవి నాయక్, పేరాల ప్రశాంత్, శేఖర్ యాదవ్, నరేందర్, మహమ్మద్ వసీమ్, డప్పు గోపి పాల్గొన్నారు.