27న బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం

– తెలంగాణ భవన్‌లోనే సమావేశాలు
– తాజా రాజకీయ పరిణాలపై చర్చించే అవకాశం

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 21: భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఆవిర్భావ దినోత్సవం, రజతోత్సవాల ముగింపు కార్యక్రమాలకు సిద్దం అవుతోంది. ఇందులో భాగంగా ఈ నెల 27న పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో కీలక సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు పార్టీ హైకమాండ్ భారీ ఏర్పాట్లు చేస్తోంది. 27వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్‌లో రజతోత్సవ సంబరాల ముగింపు సమావేశం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. సమావేశంలో పార్టీ భవిష్యత్తు వ్యూహాలు, సంస్థాగతంగా పార్టీని బలపరిచే అంశాలపై గులాబీ బాస్ మార్గనిర్దేశం చేయనున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం కొత్త సమీకరణలు ఏర్పడుతున్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. గత ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ తన వ్యూహాన్ని పునర్నిర్మించుకునే దిశగా అడుగులు వేస్తోంది. పార్టీ అధినేత కేసీఆర్ నాయకత్వంలో జరిగే ఈ సమావేశం భవిష్యత్తు ఎన్నికల వ్యూహాలు, ప్రజల్లో తిరిగి బలాన్ని పెంపొందించుకోవడం, పార్టీ కార్యక్రమాలను వేగవంతం చేయడంపై దృష్టి సారించనుంది. సంస్థాగత నిర్మాణాన్ని మరింత పటిష్టం చేయడానికి ప్రయత్నిస్తోంది. గ్రామస్థాయి నాయకత్వం నుంచి రాష్ట్రస్థాయి వరకు సమన్వయం పెంచడం, యువతను ఆకర్షించడం, పాత సభ్యత్వాలను తిరిగి క్రియాశీలకం చేయడం వంటి అంశాలు ప్రధానంగా చర్చకు రానున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ రజతోత్సవ ముగింపు సమావేశం పార్టీ భవిష్యత్తు, దిశను నిర్ణయించే కీలక ఘట్టమని కేడర్ భావిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ యంత్రాంగాన్ని మరింత బలోపేతం చేయడం, కొత్త కమిటీల ఏర్పాటు, నాయకత్వ బాధ్యతల పునర్వ్యవస్థీకరణపై చర్చ జరిగే అవకాశం ఉంది. అలాగే సభ్యత్వాల పునరుద్ధరణ కార్యక్రమంపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది. పార్టీని గ్రామస్థాయిలో మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా కొత్త వ్యూహాలు రూపొందించనున్నట్లు సమాచారం. పార్టీ అంతర్గత సమన్వయాన్ని బలోపేతం చేయడమే కాక రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై కేసీఆర్ సమగ్ర సమీక్ష చేయనున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *