– 23న పోలింగ్‌కు పకడ్బందీగా ఏర్పాట్లు
చెన్నై, ఏప్రిల్ 21 : తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచార గడువు ముగిసింది. పశ్చిమ బెంగాల్‌లోనూ మొదటి విడత ఎన్నికల ప్రచారానికి తెరపడింది. తమిళనాడులోని మొత్తం 234 స్థానాలకు, బెంగాల్‌లో తొలి విడతలో 152 సీట్లకు ఈ నెల 23న పోలింగ్ నిర్వహించనున్నారు. ఇందుకోసం ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. తమిళనాడులో తుది రోజు మంగళవారం అన్ని పార్టీల అగ్రనేతలు ముమ్మర ప్రచారం నిర్వహించారు. సీఎం ఎంకే స్టాలిన్ తన నియోజకవర్గం కొళత్తూరులో ప్రచారం నిర్వహించారు. రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగించే వారికి తానో ప్రమాదకారిని అని హెచ్చరించారు. అన్ని రంగాల్లో ఉత్తమ పనితీరు కనబరిచే తమిళనాడు వంటి రాష్ట్రాలను శిక్షించేందుకు డీలిమిటేషన్‌పై కేంద్రం తీవ్రంగా ఒత్తిడి తెచ్చిందని ఆరోపించారు. అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీ పళనిసామి పశ్చిమ తమిళనాడులో ముమ్మరంగా ప్రచారం చేశారు. అవినీతి డీఎంకే ప్రభుత్వ పాలనకు ముగింపు పలకాలని వోటర్లకు పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ, అమిత్ షా, విపక్ష నేత రాహుల్ గాంధీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్, రాజస్థాన్ సీఎం భజన్‌లాల్ శర్మ, దిల్లీ మాజీ సీఎం కేజీవ్రాల్‌లు ఆయా కూటముల తరపున ముమ్మర ప్రచారం నిర్వహించారు.
బెంగాల్‌లో తొలిదశ ప్రచారానికి తెర.. 152 నియోజకవర్గాల్లో 23న పోలింగ్
కోల్‌కతా : అసెంబ్లీ ఎన్నికల పోరుకు పశ్చిమ బెంగాల్ సిద్ధమైంది. తొలిదశ పోలింగ్ ప్రచారపర్వం మంగళవారం ముగిసింది. గురువారం జరగనున్న తొలిదశ పోలింగ్‌కు ఎన్నికల సంఘం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. 152 నియోజకవర్గాల్లో తొలి దశ పోలింగ్ జరగనుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా కఠిన చర్యలకు ఉపక్రమించింది. బైక్ ర్యాలీలను పూర్తిగా నిషేధించింది. రాత్రిపూట రాకపోకలను నియంత్రించడం, బైక్‌లపై ఇద్దరు వెళ్లడంపైనా ఆంక్షలు విధించింది. మంగళవారం నుంచే ఆ ఆంక్షలను అమలు చేయాలని ఎన్నికల విధుల్లో ఉండే ఆయా విభాగాలకు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఆదేశాలు జారీ చేశారు. పోలింగ్ నేపథ్యంలో సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు బైకులు, స్కూటర్లను రోడ్లపైకి అనుమతించరు. వైద్య సేవలు, కుటుంబ వేడుకలు, తదితర అత్యవసర కార్యక్రమాలకు హాజరయ్యే వారిని మాత్రమే అనుమతిస్తారు. పగటిపూట బైక్‌లపై ఇద్దరు వెళ్లడంపై ఆంక్షలు విధించారు. పాఠశాలలు, కాలేజీ విద్యార్థులను తీసుకెళ్లే వారికి మినహాయింపు ఇచ్చారు. పోలింగ్ రోజు కూడా ఈ ఆంక్షలు కొనసాగుతాయన్నారు. ఎన్నికల వేళ వోటర్లను బెదిరించడం, పోలింగ్‌కు వెళ్లే వారికి ఆటంకం కలిగించడం, జామింగ్‌లను నివారించేందుకే ఈ చర్యలు తీసుకున్నట్లు ఎన్నికల సంఘం అధికారులు పేర్కొన్నారు. మినహాయింపు కోరుకునే వ్యక్తులు స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని సూచించారు. ఇరుకుగా ఉండే వీధుల్లో నగదు, మద్యం తరలించేందుకు కొన్ని పార్టీలు బైక్‌లను ఉపయోగించే అవకాశం ఉందని ఓ అధికారి పేర్కొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





