– అయినా ఇందిరమ్మ ఇళ్లు ఆగవు
– వచ్చే దీపావళికి ‘క్యూర్’లో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణం పూర్తి
– రెవెన్యూ, హౌసింగ్ శాఖల మంత్రి పొంగులేటి
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 12 : గత బీఆర్ఎస్ ప్రభుత్వం లక్షల కోట్లు అప్పులు తమ నెత్తిన పెట్టిపోయినా, ఎల్‌నినో వంటి ప్రకృతి విపత్తులు వచ్చినా ఇందిరమ్మ ఇళ్ల పథకం ఆగదని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ఓ నిరంతర ప్రక్రియగా సాగుతుందన్నారు. నిరుపేదల ఆత్మగౌరవమే ఆలంబనగా ’క్యూర్’ పరిధిలోని కోట్ల విలువ చేసే ప్రాంతాల్లో శంకుస్ధాపనలు పూర్తి చేసుకున్న ఇందిరమ్మ టవర్స్ నిర్మాణాలను వచ్చే దీపావళికల్లా పూర్తి చేస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో లబ్దిదారులు ఆ ఇళ్లలో దీపావళి జరుపుకోవాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు రాజేంద్రనగర్, మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని లబ్దిదారుల కోసం మైలార్దేవుపల్లిలో నిర్మించనున్న ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి రంగారెడ్డి జిల్లా ఇన్చార్జి మంత్రి, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, స్దానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్‌తో కలిసి మంత్రి పొంగులేటి గురువారం శంకుస్ధాపన చేశారు. ఈ సందర్బంగా ఏర్పాటైన సభలో ఆయన మాట్లాడుతూ పేదవాడి జీవితాశయమైన సొంత ఇంటిని ప్రభుత్వం మంజూరు చేస్తున్నదని, మరో మూడు విడతలు ఇళ్లు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. ‘క్యూర్’ పరిధిలోని 23 నియోజకవర్గాలలో ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు పారదర్శకంగా, కులమతాలు, పార్టీల భేదాలు లేకుండా కేటాయింపు జరుగుతోందని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఇళ్లు పొందిన లబ్దిదారులు కంట ఆనందభాష్పాలు చూస్తుంటే ఈ ప్రభుత్వానికి, తమకు ఇంతకంటే ఇంకేం కావాలి అని అనిపిస్తోందని, వారి స్పందన చూస్తే తమకు కూడా కళ్లు చెమరుస్తున్నాయని అన్నారు. వారి ఆనందభాష్పాలే తమకు ఆశీస్సులన్నారు. గత పాలకులు పేదల ఇళ్ల నిర్మాణం విషయంలో సొల్లుపురాణం చెప్పారని, ఇప్పుడు కూడా ఇళ్ల నిర్మాణం, ఫోర్త్ సిటీ(ఫ్యూచర్ సిటీ) విషయంలో అవాకులు చవాకులు పేలుతున్నారని ఆరోపించారు. ఏది ఏమైనా ప్రజాప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఆరు ప్రధాన హామీలను నెరవేరుస్తుందన్నారు. ఈనెల 19 నుంచి నాణ్యమైన చిలకాకుపచ్చ రంగు బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు. కార్యక్రమంలో భాగంగా ఇక్కడ నిర్మించే ఇందిరమ్మ టవర్స్ లబ్దిదారుల ఎంపిక కోసం లక్కీడ్రా నిర్వహించారు. తొలుత కవిత రాథోడ్ అనే మహిళకు ‘సి’ బ్లాక్‌లో 603 ఫ్లాట్ మంజూరు కాగా మంత్రులు పొంగులేటి, శ్రీధర్‌బాబు కలిసి ఆమెకు సర్టిఫికెట్‌ను అందజేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, గృహ నిర్మాణ శాఖ ఎండీ వి.పి. గౌతమ్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, మాజీ మేయర్ పారిజాతం, ఇతర అధికారులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





