– రేపు హన్మకొండ ‘యాది’ సభలో కాళోజీ పౌండేషన్ ప్రదానం
హన్మకొండ, ప్రజాతంత్ర, నవంబర్ 2: కాళోజీ సోదరుల పురస్కారాలను ప్రముఖ కవులు డాక్టర్ నారాయణ, ఎలిజబెత్ కురియన్ మోనా అందుకోనున్నారు. హన్మకొండ వడ్డెపల్లిలోని పిఆర్ రెడ్డి ఫంక్షన్‌హాల్‌లో గురువారం ఉదయం పదిగంటలకు నిర్వహించనున్న కాళోజీ సోదరుల ‘యాది’ సభలో కాళోజీ ఫౌండేషన్ వీరిరువురికి పురస్కారాలు ప్రదానం చేయనుంది. కాళోజీ జయంతిని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం ‘తెలంగాణ భాష దినోత్సవంగా’ సాహిత్య పురస్కారాన్ని 2015 నుండి అందజేస్తున్నది. కాగా కాళోజీ వర్ధంతిని పురస్కరించుకుని ఫౌండేషన్‌కూడా ప్రతీఏటా కాళోజీ జ్ఞాపకార్థం ప్రముఖ కవులకు పురస్కారాలను అందజేస్తోంది. కాళోజీ సోదరుడైన కాళోజీ రామేశ్వర్‌రావు ఉర్దూలో ఉద్దండకవిగా పేరుగాంచారు. సోదరుల ఇద్దరి దివంగత తేదీలు ఒకటిరెండు రోజుల తేడాలో వస్తుండడంతో ఒకే తేదీన నవంబర్ 13న ఇద్దరి పేరున ఈ అవార్డులను ప్రధానం చేస్తున్నారు. ఈసారి నారాయణరావు పురస్కారాన్ని డాక్టర్ ఉడారి నారాయణ అందుకోబోతున్నారు. అతి సామాన్యభాషలో తన రచనలద్వారా సమాజాన్ని ప్రభావితం చేసిన కవిగా ఆయనకు పేరుంది. ఆదిలాబాద్ జిల్లా తాంగీ మండలం బండల్ నాగపూర్ గ్రామానికి చెందిన నారాయణ గిరిజన సంక్షేమశాక ఆశ్రమ ఉన్నత పాఠశాలల్లో తెలుగుపండితులుగా పనిచేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ తెలుగు సాహిత్యంపై పిహెచ్‌డీ చేశారు. ఈయన రాసిన ‘మళ్ళీ మనిషిలోకి’ కవితకు తెలంగాణ సాహిత్యపరిషత్ పురస్కారానికి ఎంపికైంది. ఆకుపచ్చని యడారి, యాల్లైంది, మాగిపొద్దు లాంటి కవితా సంపుటాలు మొదలు, అరుగుమీద ముచ్చట్లు లాంటి రేడియో సంభాషణలు, ‘ఎల్లడి’ తెలంగాణ ఉద్యమ కవితలు చెప్పుకోదగ్గవి. ఈయన కవితలు ఆంగ్లంలో, హిందీలోకి కూడా అనువాదం జరిగాయి.
కాళోజీ రామేశ్వర్‌రావు ‘షాద్’ పురస్కారాన్ని అందుకోబోతున్న ఎలిజబెత్ కురియన్ మోనా బహుభాష కవియిత్రి. ఈమె మాతృభాష మలయాళం. ఆమె హైదరాబాద్‌లో స్థిరపడిన సైన్స్ గ్రాడ్యుయేట్. కాగా ఆమె ఉర్దూ, హిందీ, తెలుగు మలయాలం, మరాఠీ భాషల్లో రచనలు చేస్తున్నారు. రిజర్వ్‌బ్యాంక్ ఉద్యోగిగా ఉంటూనే పలు రచనలు చేశారు. ఎక్కుగా ఉర్దూ గజల్స్ రాస్తుండడంవల్ల ఈమెను ఉర్దూకవిగా పేరున్న రామేశ్వర్‌రావు పురస్కారానికి ఎంపిక చేశారు. హైదరాబాద్‌లోని మౌలానా-ఎ-గజల్ కోర్సు చేసి, ముంబాయికి చెందిన ఆర్‌పి శర్మ, కమల్ ప్రసాద్ ‘కమల్’ల వద్ద గజల్ మెలకువలను నేర్చుకున్నారు. ఈమె రచనలకుగాను తెలంగాణరాష్ట్ర ఉర్దూ అకాడమి(2024) అవార్డును ప్రధానం చేసింది. అలాగే యుపి, ఏపి ఉర్దూ అకాడమీలుకూడా అవార్డును ప్రధానంచేశాయి. ఆమె ఇంగ్లీషు రచనలకు 2017 రవీంద్రనాథ్ ఠాగూర్ అవార్డుతోపాటు అనేక ప్రశంసాపురస్కారాలను అందుకున్నారు. కాళోజీ ఫౌండేషన్ అధ్యక్షులు నాగిళ్ళ రామశాస్త్రి అధ్యక్షతన జరిగే ఈ సభలో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత డాక్టర్ అంపశయ్య నవీన్, కవులు డాక్టర్ ఎస్వఇఎన్ చారి, అర్జూ మోహక్, కార్యదర్శి విఆర్ విద్యార్థితో పాటు ప్రత్యేక అకర్షణగా ‘గ్లోబల్ సింఫనీ’ త్రైమాసిక పత్రిక ఎడిటర్ ఆర్‌జూమోహక్ రానున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కవులు, రచయితల కవితలు, గజల్స్, సాహిత్యవ్యాసాలు ఇందులో ప్రచురితమైతాయి.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




