– సివిల్స్ తుది ఇంటర్వ్యూకు 31మంది ఎంపిక
– ఒక్కొక్కరికి రూ.లక్ష ఆర్థిక ప్రోత్సాహకం
– అభ్యర్థులకు ఉప ముఖ్యమంత్రి భట్టి అభినందనలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 12 : తెలంగాణ ప్రాంతం నుంచి అత్యధిక సంఖ్యలో అభ్యర్థులు సివిల్ సర్వీసెస్‌లో విజయం సాధించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థ సహకారంతో ప్రారంభించిన రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం పథకం మరోసారి మంచి ఫలితాలను సాధించింది. ఇటీవల విడుదలైన సివిల్స్ మెయిన్స్ ఫలితాల్లో ఉత్తీర్ణులై 31మంది అభ్యర్థులు తుది ఇంటర్వ్యూకు ఎంపికయ్యారు. సింగరేణి సంస్థ సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులైన తెలంగాణ ప్రాంత అభ్యర్థులకు ఆర్థిక ప్రోత్సాహకం అందించేందుకు రెండు నెలల క్రితం దరఖాస్తులను ఆహ్వానించింది. వాటిల్లో 158మంది అర్హులైన అభ్యర్థులను గుర్తించి ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున మొత్తం రూ.1.58 కోట్ల ఆర్థిక ప్రోత్సాహకాన్ని అందించింది. ఈ ఆర్థిక సహకారంతో అభ్యర్థులు మెయిన్స్‌కు మరింత ఉత్సాహంతో సిద్ధమయ్యారు. వారిలో 31మంది తుది ఇంటర్వ్యూకు ఎంపిక కావడం విశేషం.
ఇంటర్వ్యూకు ఎంపికైన వారికి మరో రూ.లక్ష ఆర్థిక ప్రోత్సాహకం
తుది ఇంటర్వ్యూకు ఎంపికైన 31మందికి కూడా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సింగరేణి సంస్థ త్వరలో ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున అదనపు ఆర్థిక ప్రోత్సాహకాన్ని అందించనుంది. సివిల్స్ మెయిన్స్ లో ఉత్తీర్ణులై తుది ఇంటర్వ్యూకు ఎంపికైన తెలంగాణ బిడ్డలందరికీ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అభినందనలు తెలిపారు. ఇంటర్వ్యూ దశకు చేరుకున్న అభ్యర్థులందరూ తుది పరీక్షలోనూ విజయం సాధించి రాష్ట్రానికి మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు.
ఇప్పటికే 27మంది సివిల్స్‌లో విజయం
రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకానికి సింగరేణి సంస్థ రెండేళ్లుగా తన కార్పొరేట్ సామాజిక బాధ్యత(సీఎస్ఆర్) నిధుల నుంచి ఆర్థిక సహకారం అందిస్తోంది. ఈ పథకం ద్వారా మొదటి ఏడాది ఏడుగురు, రెండో ఏడాది 20మంది చొప్పున మొత్తం 27మంది సివిల్ సర్వీసెస్‌లో విజయం సాధించడం విశేషం. ఈ ఏడాది కూడా అత్యధిక సంఖ్యలో అభ్యర్థులు తుది ఇంటర్వ్యూలో విజయం సాధించి సివిల్ సర్వీసెస్‌కు ఎంపిక కావాలని, వీరికి ప్రభుత్వం ఆధ్వర్యంలో మాక్ ఇంటర్వ్యూలు నిర్వహించబోతున్నట్లు, ఈ ఇంటర్వ్యూల నిర్వహణకు కూడా సింగరేణి సంస్థ తన సహకారాన్ని అందిస్తుందని సింగరేణి చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి తెలిపారు.
వరంగల్ నుంచి అత్యధికంగా ఆరుగురు
ఈసారి తుది ఇంటర్వ్యూకు ఎంపికైన 31మందిలో అత్యధికంగా వరంగల్ జిల్లా నుంచి ఆరుగురు ఉన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా నుంచి నలుగురు, హైదరాబాద్, జగిత్యాల జిల్లాల నుంచి ముగ్గురేసి, నల్గొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, సూర్యాపేట జిల్లాల నుంచి ఇద్దరేసి చొప్పున ఎంపికయ్యారు. అదిలాబాద్, నారాయణపేట, సిద్దిపేట, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, మంచిర్యాల జిల్లాల నుంచి ఒక్కొక్కరు చొప్పున తుది ఇంటర్వ్యూకు అర్హత సాధించారు. వీరిలో 18మంది ఓబీసీ వర్గాల వారు, ఎస్టీలు ఇద్దరు, ఎస్సీలు ముగ్గురు, 8మంది జనరల్ అభ్యర్థులు ఉన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





