– రాహుల్‌కు ఏం విజన్ ఉందని ప్రపంచానికి పరిచయం చేస్తారు
– కాంగ్రెస్‌పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 12 : కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ప్రభుత్వం సంయుక్తంగా ఈ నెల 13, 14 తేదీల్లో హైదరాబాద్‌లో నిర్వహించనున్న భారత్ సమ్మిట్‌పై కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ సదస్సును ఏ ప్రాతిపదికన, ప్రభుత్వ నిధులతో ఎలా నిర్వహిస్తారని విలేకరుల సమావేశంలో ప్రభుత్వాన్ని నిలదీశారు. దేశంపైన విషం చిమ్మే శక్తులకు, జార్జ్ సోరోస్ వంటి భారత వ్యతిరేక శక్తుల ఎజెండాకు తెలంగాణ వేదిక కావడం, భారత్ సమ్మిట్ పేరుతో ఆ శక్తులన్నీ హైదరాబాద్‌లో కలవడం దురదృష్టకరమన్నారు. ఇది భారత్ వ్యతిరేక సమ్మిట్.. దేశ అభివృద్ధిని అడ్డుకునే సమ్మిట్.. దేశ రాజ్యాంగ బద్ధ సంస్థలను బద్నాం చేసే సమ్మిట్ అని అభివర్ణించారు. మోదీపైన వ్యక్తిగతంగా తప్పుడు ఆరోపణలు చేసేందుకు పెట్టుకున్న వేదిక ఇది అని విమర్శించారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ అనేక సంవత్సరాలుగా ప్రజాబలం కోల్పోయి, ప్రజల మద్దతు లేక వరుస ఓటములను కప్పిపుచ్చుకునే సమ్మిట్ ఇదన్నారు. రాహుల్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఖాతాలో వంద ఓటములు చేరాయని ఎద్దేవా చేశారు. రాజకీయాల్లో పదేపదే విఫలమవుతున్న రాహుల్ గాంధీ విజన్‌ను ప్రపంచ దేశాల ముందుంచేందుకే ఈ సదస్సు నిర్వహిస్తున్నామని చెబుతున్నారని, అసలు ఆయనకు ఎలాంటి విజన్ ఉందని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. దేశంలో అభివృద్ధి కార్యక్రమాలను ఏనాడైనా ఆయన ప్రశంసించారా అని నిలదీశారు. సొంత ప్రభుత్వం చేసిన ఆర్డినెన్స్‌ను ‘కంప్లీట్ నాన్సెన్స్’ అని చించేసి నాటి ప్రధాని మన్మోహన్‌ను అవమానించిన చరిత్ర రాహుల్ గాంధీది. ఈ విజన్‌నే ప్రపంచానికి పరిచయం చేస్తారా అని ప్రశ్నించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో ఉగ్రవాదం తగ్గిందని, అవినీతి, కుటుంబ రాజకీయాలకు చోటు లేకుండా పోయిందని తెలిపారు. అలాంటి పురోగతిని పక్కనపెట్టి బంగ్లాదేశ్, శ్రీలంక వంటి పరిస్థితులు వస్తాయని ప్రచారం చేయడం ప్రజాస్వామ్యాన్ని అవమానించడమేనని అన్నారు. పార్టీకి, ప్రభుత్వానికి మధ్య ఒక లక్ష్మణ రేఖ ఉంటుందని, ప్రజల సొమ్ముతో పార్టీ కార్యక్రమాలను నిర్వహించడం ఎంతవరకు సమంజసమని కిషన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
తెలంగాణలో హామీల అమలుపై నిలదీత
ఇదే హైదరాబాద్ వేదికగా ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ నిర్వహిస్తున్నామని ఒకవైపు చెబుతూనే మరోవైపు దేశంలోకి పెట్టుబడులు రాకుండా కుట్ర పన్నుతున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. రాహుల్ గాంధీ హైదరాబాద్ వస్తున్న నేపథ్యంలో 2023 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన గ్యారెంటీలు, డిక్లరేషన్ల అమలుపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆరఎస్ అప్పులను కాంగ్రెస్ మరింత పెంచడంతో తెలంగాణ ఆర్థిక అత్యయిక పరిస్థితి వైపు వెళ్తోందని, రిటైరైన ఉద్యోగులకు రావాల్సిన బెనిఫిట్స్ కూడా అందడం లేదని విమర్శించారు. మహాలక్ష్మి పథకం ద్వారా నెలకు రూ.2,500 ఇస్తామన్న హామీ ప్రకారం ప్రతి ఆడబిడ్డకు రూ.85,000 బకాయి పడ్డారని, అలాగే రూ.4,000 పింఛను కింద ఒక్కొక్కరికి రూ.1,02,000 బకాయిలు ఉన్నాయని తెలిపారు. నిరుద్యోగ యువతకు రూ.4,000 చొప్పున భృతి ఇస్తామన్న హామీ అమలు కాలేదని, ఒక్కొక్కరికి రూ.1.36 లక్షల బకాయి పడ్డారని చెప్పారు. వ్యవసాయ కూలీలకు ఇస్తామన్న రూ.12,000, కౌలు రైతుల సహాయం, బీసీ డిక్లరేషన్, విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పూర్తిగా అటకెక్కాయని ఆరోపించారు.





