– ఇండియా బయల్దేరే ముందు ఫోన్ ద్వారా సమాచారం
– భారత్ సమ్మిట్ లో పాల్గొనేందుకు ఆహ్వానించిన తెలంగాణ ప్రభుత్వం
– ‘డాగ్సావిసెన్’ దినపత్రికలో పనిచేస్తున్న హెల్లెలింగ్ స్వెండ్సెన్
– 2026లో ఆమె ప్రధాని మోదీని ప్రశ్నించి వార్తల్లో నిలిచారు
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 12 : నార్వే జర్నలిస్ట్ హెల్లె లింగ్ స్వెండ్సెన్ భారత్ వీసా రద్దయింది. ఈమేరకు ఆమె తన ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతాలో ఒక వీడియోను పోస్ట్ చేస్తూ,హోం శాఖలో పైనుంచి వచ్చిన ఆదేశాల వల్లే తన వీసా రద్దయిందని పేర్కొన్నారు. ఈనెల 13, 14 తేదీల్లో హైదరాబాద్‌లో తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘భారత్ సమ్మిట్’లో పాల్గొనేందుకు ఆమెకు ఆహ్వానం అందింది. ఇందులో భాగంగా 14న మీడియా భవిష్యత్తు, పత్రికా స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం అనే అంశంపై జరగనున్న చర్చలో ఈమె ప్రసంగించాల్సి ఉంది. అయితే మరో పది నిముషాల్లో భారత్ వెళ్లేందుకు విమానాశ్రయానికి బయలుదేరతారనగా వీసా నిలిపేసినట్లు అక్కడి భారత రాయబార కార్యాలయం నుంచి ఫోన్ ద్వారా సమాచారం అందడంతో ఆమె ఆగిపోయారు. ఈమె నార్వే రాజధాని ఓస్లోకు చెందిన ‘డాగ్సావిసెన్’ దినపత్రికలో జర్నలిస్ట్‌గా పనిచేస్తున్నారు. మే 2026లో ప్రధాని నరేంద్ర మోదీ నార్వేలో పర్యటించినప్పుడు, ప్రపంచంలోనే అత్యంత స్వేచ్ఛాయుతమైన ప్రెస్ నుండి మీరు ఎందుకు ప్రశ్నలు తీసుకోవడం లేదు అని ఆయనను ప్రశ్నించడం ద్వారా వార్తల్లో నిలిచారు. ఈమె తన పాస్‌పోర్ట్, భారత వీసాతోపాటు విదేశాంగ మంత్రిత్వ శాఖ నుండి ‘పొలిటికల్ క్లియరెన్స్’ కూడా పొందారు. 11న భారత్‌కు బయలుదేరేందుకు సిద్ధమై విమానాశ్రయానికి వెళ్లడానికి సరిగ్గా పది నిమిషాల ముందు నార్వేలోని భారత రాయబార కార్యాలయం నుండి ఈమెకు ఫోన్ వచ్చింది. హోం మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు వీసా రద్దయిందని, కాబట్టి భారత్‌లోకి అనుమతి లేదని అధికారులు సమాచారం ఇచ్చారు. గతంలో ప్రధాని మోదీని ప్రశ్నించడం, ప్రభుత్వ విధానాలను విమర్శించడమే దీనికి కారణం కావచ్చని ఆమె అభిప్రాయపడ్డారు. విదేశాంగ శాఖ ఇచ్చిన పొలిటికల్ క్లియరెన్స్‌లో హోం మంత్రిత్వ శాఖ, ఇతర సంబంధిత అధికారుల అనుమతికి లోబడి అనే నిబంధన ఉంటుంది. వీసా రద్దుకు గల అధికారిక కారణాలపై భారత విదేశాంగ శాఖ గానీ, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గానీ ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





