యువతనూ వెంటాడుతున్న బ్రెయిన్‌ స్ట్రోక్

– దేశంలో ఏటా 12.5 లక్షల కొత్త కేసులు
– పక్షవాతం వచ్చాకే హాస్పిట‌ల్స్‌కు వ‌స్తున్న‌ రోగులు
– ఆలస్యంగా వస్తే శాశ్వత వైకల్యమే: కేర్ వైద్యులు
– రేపు ‘వరల్డ్  బ్రెయిన్ డే’

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జూలై 21: ఒకప్పుడు వృద్ధుల్లో ఎక్కువగా కనిపించే  బ్రెయిన్ స్ట్రోక్ ఇప్పుడు యువతనూ వెంటాడుతోంది. దేశంలో ఏటా సుమారు 12.5 లక్షల కొత్త స్ట్రోక్ కేసులు నమోదవుతున్నాయి. అయితే పక్షవాతం వచ్చాకే ఆస్పత్రికి వస్తున్నారు. దీంతో చికిత్సకు అత్యంత కీలకమైన సమయం కోల్పోయి చాలామంది శాశ్వత వైకల్యానికి గురవుతున్నారని కేర్ హాస్పిటల్స్ న్యూరో నిపుణులు హెచ్చరించారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా 340 కోట్ల మందికిపైగా నాడీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. ప్రతి ఏడాది 1.1 కోట్లకుపైగా మరణాలకు ఇవే కారణమవుతున్నాయి. వైకల్యాలకు కూడా ఇవే ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి. “అందరికీ మెదడు ఆరోగ్యం అందుబాటులోకి” అనే అంశంతో ప్రపంచ మెదడు దినోత్సవాన్ని పురస్కరించుకుని కేర్ హాస్పిటల్స్ న్యూరో నిపుణులు ప్రజల్లో అవగాహన పెరగాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. న్యూరాలజీ, న్యూరోసర్జరీ చికిత్సల్లో గణనీయమైన పురోగతి సాధించినప్పటికీ, లక్షణాలను గుర్తించడంలో నిర్లక్ష్యం, సరైన సమయంలో అధునాతన వైద్యం అందించే ఆస్పత్రులకు చేరుకోకపోవడం వల్ల చాలామంది విలువైన సమయాన్ని కోల్పోతున్నారని పేర్కొన్నారు. మెదడు హెచ్చరికలను నిర్లక్ష్యం చేస్తే వైకల్యం తప్పదు. చాలామంది తలనొప్పి, చేతులు లేదా కాళ్లలో బలహీనత, మాట తడబడటం, తల తిరగడం, చూపులో మార్పులు, మూర్ఛలు వంటి ప్రారంభ లక్షణాలను సాధారణ సమస్యలుగా భావించి నిర్లక్ష్యం చేస్తున్నారు. పరిస్థితి విషమించి పక్షవాతం వచ్చిన తర్వాతే అత్యవసర విభాగానికి చేరుతున్నారు. మరికొందరు పలు చిన్న ఆస్పత్రులు, క్లినిక్‌లలో సమయం వృథా చేసుకుని చివరకు అధునాతన న్యూరోసైన్స్ కేంద్రాలకు చేరుకునే సరికి విలువైన సమయం దాటిపోతుందని తెలిపారు.

ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆస్పత్రికి వెళ్లాలి  

• ముఖం, చేయి లేదా కాలులో అకస్మాత్తుగా బలహీనత లేదా తిమ్మిరి
• మాట తడబడటం లేదా ఇతరులు మాట్లాడేది అర్థం కాకపోవడం
• అకస్మాత్తుగా చూపు తగ్గిపోవడం లేదా రెండుగా కనిపించడం
• ఇంతకు ముందెన్నడూ లేని విధంగా తీవ్రమైన తలనొప్పి
• నడవడంలో ఇబ్బంది లేదా సమతుల్యత కోల్పోవడం
• కారణం లేకుండా మూర్ఛలు రావడం
• వాంతులు లేదా చూపు సమస్యలతో పాటు రోజుల తరబడి కొనసాగే తలనొప్పి
• అకస్మాత్తుగా అయోమయం లేదా జ్ఞాపకశక్తిలో మార్పులు

ప్రపంచ మెదడు దినోత్సవం సందర్భంగా గుండె ఆరోగ్యానికి ఎంత ప్రాధాన్యం ఇస్తామో, మెదడు ఆరోగ్యానికీ అంతే ప్రాధాన్యం ఇవ్వాలని కేర్ హాస్పిటల్స్ వైద్యులు పిలుపునిచ్చారు. పక్షవాతం తర్వాత కాదు.. తొలి లక్షణాలకే వైద్యం అవసరమని, యువతలో పెరుగుతున్న స్ట్రోక్… గుర్తించడంలోనే ఆలస్యం జరుగుతోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల్లో అవగాహన పెరగడం, ఆలస్యం చేయకుండా అధునాతన న్యూరోసైన్స్ కేంద్రానికి చేరుకోవడమే స్ట్రోక్ వల్ల వచ్చే శాశ్వత వైకల్యాలను తగ్గించే మార్గమని సూచించారు.

తలనొప్పి, మాట తడబడటం స్ట్రోక్ సంకేతాలే : డాక్ట‌ర్‌ జైస్వాల్ 

కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్‌లోని క్లినికల్ డైరెక్టర్ & హెచ్‌వోడి – న్యూరాలజీ డాక్ట‌ర్‌ ఎస్.కె.జైస్వాల్ మాట్లాడుతూ “తలనొప్పి, మాట తడబడటం… ఇవి స్ట్రోక్ సంకేతాలే. అకస్మాత్తుగా ఒకవైపు చేయి లేదా కాలు బలహీనంగా అనిపించడం, తిమ్మిరి, మాట సరిగా రాకపోవడం, చూపు తగ్గిపోవడం, కారణం లేకుండా మూర్ఛలు రావడం వంటి లక్షణాలను అసలు నిర్లక్ష్యం చేయకూడదు. ఇటీవలి కాలంలో యువతలోనూ స్ట్రోక్ కేసులు పెరుగుతున్నాయి. చాలామంది పక్షవాతం వచ్చిన తర్వాత లేదా మాట్లాడలేని, నడవలేని స్థితికి చేరుకున్న తర్వాతే వస్తున్నారు. మరికొందరు ఒక ఆస్పత్రి నుంచి మరో ఆస్పత్రికి మారుతూ స్ట్రోక్‌కు గోల్డెన్ టైమ్ కోల్పోతున్నారు. స్ట్రోక్‌లో ప్రతి నిమిషం ఎంతో విలువైనది” అని తెలిపారు. అధిక రక్తపోటు, మధుమేహం, కొలెస్ట్రాల్‌ను నియంత్రణలో ఉంచుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, సరిపడా నిద్ర, ఒత్తిడి నియంత్రణ, పొగాకు, మద్యం అలవాట్లకు దూరంగా ఉండడం ద్వారా స్ట్రోక్ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చని డా. జైస్వాల్ సూచించారు.

సకాలంలో హాస్పిట‌ల్‌కు చేరితేనే ప్రయోజనం : డాక్ట‌ర్‌ ఇమ్రాన్ 

కేర్ హాస్పిటల్స్, నాంపల్లిలోని సీనియర్ కన్సల్టెంట్ – న్యూరో అండ్‌ స్పైన్ సర్జరీ డాక్ట‌ర్‌ మహమ్మద్ ఇమ్రాన్  మాట్లాడుతూ అధునాతన ఎంఆర్‌ఐ, న్యూరోనావిగేషన్, ఆపరేటింగ్ మైక్రోస్కోపులు, మినిమల్లీ ఇన్వేసివ్ న్యూరోసర్జరీ వంటి ఆధునిక సాంకేతికతతో మెదడు కణితులు, తలకు గాయాలు, హైడ్రోసెఫాలస్ వంటి క్లిష్ట సమస్యలను విజయవంతంగా చికిత్స చేస్తున్నాం. అయితే రోగులు సకాలంలో సరైన ఆస్పత్రికి చేరితేనే ఈ సాంకేతికతల ప్రయోజనం పూర్తిగా అందుతుంది” అని చెప్పారు. ప్రతి నిమిషం ఆలస్యం… మెదడుకు శాశ్వత నష్టం. చికిత్స అందని ప్రతి నిమిషానికి దాదాపు 19 లక్షల మెదడు కణాలు దెబ్బతింటాయి. స్ట్రోక్ వచ్చిన తొలి నాలుగున్నర గంటలు (గోల్డెన్ విండో) అత్యంత కీలకం. ఈ సమయంలో చికిత్స అందితే ప్రాణాలను కాపాడడంతో పాటు శాశ్వత వైకల్యాన్ని నివారించే అవకాశం ఉంటుంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *