– వారికి కనీసం రూపాయి కూడా పరిహారంగా ఇవ్వరా?
– కాంగ్రెస్ సర్కార్‌ను నిలదీసిన బిఆర్‌ఎస్ నేత కెటిఆర్
- పార్టీ తరఫున ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల సాయం అందచేత
ఆదిలాబాద్, ప్రజాతంత్ర, జూలై 21: తెచ్చిన ధాన్యం 30 రోజులు, 60 రోజులైనా కొనేటోడు లేడు.. సంచులు ఇచ్చేటోడు లేడు.. ఈ దిక్కు దివానం లేని ప్రభుత్వంలో పంటను కాపాడుకునే క్రమంలో కొనుగోలు కేంద్రం దగ్గరే కాపు కాసి ఉన్నప్పుడు గోడ కూలి నలుగురు రైతులు చనిపోయారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆవేదన వ్యక్తం చేశారు. మే 6న లక్షెట్టిపేట మండలంలో పంటలు కాపాడుకునేందుకు వెళ్లి మృత్యువాత పడిన నలుగురు రైతు కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ. 5 లక్షల చొప్పున మొత్తం రూ. 20 లక్షల ఆర్థికసాయాన్నిఆయన అందించారు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటకు మంగళవారం చేరకున్న కేటీఆర్ రైతు సదస్సులో మాట్లాడుతూ నలుగురు రైతులు చనిపోతే వారికి న్యాయం చేయాలని మా బీఆర్‌ఎస్ నాయకులు జీవన్ రెడ్డి, దివాకర్ రావు 8 గంటలు ధర్నా చేసినా దున్నపోతు మీద వాన పడ్డట్లు ప్రభుత్వం నుండి స్పందన రాలేదు. చివరికి ఏదో మొక్కుబడిగా ఒప్పుకున్నారు.. చూస్తాం.. చేస్తాం అని ఒప్పుకున్నరు.. కానీ ఈ రోజు వరకు దాదాపు 2 నెలలు గడిచిపోయినా స్పందన లేదు. కనీసం మానవత్వం అనే ఆలోచన కూడా లేదు. ఈ నలుగురు జీవితాలు అర్థాంతరంగా ముగిసిపోయిన తర్వాత నాకు దివాకర్‌రావు, జీవన్ రెడ్డి కలిసి ఫోన్ చేశారు. అన్నా పార్టీ తరపున మనమైనా ఏమన్నా చెప్పాలే.. ఎందుకంటే రైతులు ఇబ్బంది పడుతున్నారు.. వారికి అండగా నిలబడాలన్నారు. ఆ రోజు మేం వరంగల్‌లో ఉన్నం.. రైతు సంగ్రామ సదస్సు నిర్వహిస్తున్నాం. అదే రోజు ఈ బాధాకరమైన సంఘటన జరిగింది. వెంటనే కేసీఆర్‌ను అడిగినం. మంచిర్యాల జిల్లాలో జరిగిన ఈ విషాదానికి పార్టీ తరపున తప్పకుండా మనం అండగా నిలబడదాం.. ఒక్కో రైతుకు రూ.5 లక్షలు వెంటనే ప్రకటించాలని కేసీఆర్ చెప్పారన్నారు. ఇవాళ శోకసంద్రంలో ఉన్న రైతు కుటుంబాలను నేను అడిగిన. ప్రభుత్వం నుంచి ఏమన్నా వచ్చిందా అమ్మా అని అడిగిన. రెండున్నర నెలలు అయిపోయింది.. మంచిర్యాలలో ఉన్నది కాంగ్రెస్ ఎమ్మెల్యే.. రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. జరిగింది ఒక విషాదం.. ఏ రాజకీయ పరమైన హడావిడి లేదు.. ఏ ఆర్భాటం లేదు.. ఏ ఎన్నిక లేదు.. కానీ ప్రభుత్వం నుంచి స్పందన లేదు. నలుగురితో మాట్లాడుతుంటే ఒక్కొక్కరిది ఒక్కో బాధ. వాళ్లందరు చెప్పింది ఒక్కటే మాట.. ఇవాళ నలుగురు రైతులు చనిపోతే ఒక్క రైతుకు మాత్రమే రూ.5 లక్షలు వచ్చింది. అది కూడా ఎక్కడిది.. కేసీఆర్ పెట్టిన రైతు బీమా నుంచి రూ.5 లక్షలు ఇచ్చారు. కానీ మిగిలిన ముగ్గురికి రూ.5 లక్షలు కాదు కదా.. 5 పైసలు కూడా ప్రభుత్వం నుంచి సహాయం అందలేదని కేటీఆర్ మండిపడ్డారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





