– బీజేపీ చీఫ్ రామచందర్రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 17 : రాబోయే రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు సమాయత్తం కావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్రావు పిలుపునిచ్చారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన అధ్యక్షతన పట్టభద్రుల ఎమ్మెల్సీ వోటర్ల నమోదుపై కీలక సన్నాహక సమావేశం శనివారం జరిగింది. సమావేశంలో ఎమ్మెల్సీలు ఏవీఎన్ రెడ్డి, మల్క కొమురయ్యలతోపాటు రెండు ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు చెందిన పార్టీ ముఖ్య నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామచందర్ రావు మాట్లాడుతూ గతంలో హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని దివంగత నేత వి.రామారావు పలుమార్లు గెలుచుకున్నారని, ఇతర స్థానాల్లోనూ బీజేపీ అభ్యర్థులు ఘన విజయం సాధించిన చరిత్ర ఉందని గుర్తు చేశారు. అభ్యర్థులు ఎవరనే దానితో సంబంధం లేకుండా పార్టీ గెలుపే ధ్యేయంగా కార్యకర్తలంతా సమష్టిగా పనిచేయాలని స్పష్టం చేశారు. వోటర్ల నమోదు ప్రక్రియపై ప్రతి ఒక్కరూ ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అర్హులైన ప్రతి పట్టభద్రుడితో పాటు వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులకు ఓటరు నమోదుపై విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. విద్యావంతులను వోటర్లుగా నమోదు చేయించడంతోపాటు, పోలింగ్ రోజున వారు తమ వోటు హక్కును సద్వినియోగం చేసుకునేలా క్షేత్రస్థాయిలో కార్యకర్తలు చొరవ చూపాలని కోరారు. బీజేపీ పట్ల విద్యావంతులు, గ్రాడ్యుయేట్లలో బలమైన సానుకూలత ఉందని, కాంగ్రెస్, బీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల్లోకి వెళ్లాలని దిశానిర్దేశం చేశారు. ఇదే సమయంలో దేశ ప్రతిష్ఠను దిగజార్చేలా సాగుతున్న ‘వోట్ చోరీ’ ప్రచారం వెనుక విదేశీ శక్తుల ప్రమేయం దాగి ఉందని ఆయన హెచ్చరించారు. ఎమ్మెల్సీ ఎన్నికలను పార్టీ నేతలు, కార్యకర్తలు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని, ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు క్షేత్రస్థాయిలో తగిన సమయం కేటాయించి పార్టీని విజయ తీరాలకు చేర్చాలని రామచందర్ రావు పిలుపునిచ్చారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





