ఖేలో తెలంగాణ బంధన్‌కు పెరుగుతున్న ఆదరణ

– ప్రజలు, క్రీడాకారుల నుంచి విశేష స్పందన
– ప్రభుత్వ సలహాదారు జితేందర్ రెడ్డి

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 17 : రాష్ట్ర క్రీడా శాఖ చేపట్టిన ఖేలో తెలంగాణ బంధన్ కార్యక్రమానికి రోజురోజుకూ ఆదరణ పెరుగుతోందని, ప్రజలు, క్రీడాకారుల నుంచి విశేష స్పందన లభిస్తోందని ప్రభుత్వ క్రీడల సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి అన్నారు. శనివారం నిర్వహించిన ఖేలో తెలంగాణ ఫిట్‌నెస్ ఛాలెంజ్‌లో పాల్గొన్న ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ, కేంద్ర క్రీడల శాఖ సహాయ మంత్రి రక్షా నిఖిల్ ఖడ్సే, రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ వైస్ చైర్‌పర్సన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఎ.సోనిబాలాదేవి, మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్‌తోపాటు పలువురు అధికారులకు ఫిట్‌నెస్ ఛాలెంజ్ విసిరారు.

ప్రతి ఒక్కరూ క్రీడల్లో భాగస్వాములు కావాలి

చిన్నా పెద్దా తేడా లేకుండా, వయస్సుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరూ క్రీడలను తమ దైనందిన జీవితంలో భాగంగా మార్చుకోవాలని జితేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. క్రమం తప్పకుండా వ్యాయామం, నడక, పరుగు, యోగా వంటి శారీరక దృఢత్వ కార్యకలాపాలను అలవర్చుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలిని సొంతం చేసుకోవచ్చన్నారు. గత మూడేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ఇస్తున్న ప్రాధాన్యతతో సమాజంలో క్రీడల పట్ల సానుకూల వాతావరణం ఏర్పడుతోందన్నారు. ప్రజలను ఆరోగ్యం, ఫిట్‌నెస్ దిశగా ప్రోత్సహించడంతోపాటు క్రీడా స్ఫూర్తిని ప్రతి ఒక్కరిలో పెంపొందించేందుకు ఖేలో తెలంగాణ బంధన్ దోహదపడుతుందని తెలిపారు.

నిరంతర ఉద్యమంగా ఖేలో తెలంగాణ

ఖేలో తెలంగాణ కార్యక్రమం నిరంతర ఉద్యమంలా కొనసాగాలని, ప్రజల భాగస్వామ్యంతో ఆరోగ్యవంతమైన తెలంగాణ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జితేందర్ రెడ్డి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి విస్తృత ప్రచారం కల్పించి ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలని మీడియాకు విజ్ఞప్తి చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *