నిరుద్యోగులను నిండా ముంచిన ప్రభుత్వం

– 25వేల పోలీసు ఉద్యోగాలు ఖాలీ
– కేవలం 7వేల పోస్టుల భర్తీకే నోటిఫికేషన్
– ఆరకొర పోస్టుల భర్తీ నోటిఫికేషన్తో ఏం ప్రయోజనం
– బీఆర్ఎస్ నేత‌ హరీష్‌రావు విమర్శ

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 17: కాంగ్రెస్ ప్రభుత్వం తమను నిలువునా ముంచిందని, తమ ఆశలపై నీళ్లు చల్లిందని పోలీసు ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న లక్షలాదిమంది నిరుద్యోగ యువత ఆవేదన వ్యక్తం చేస్తుంటే ఈ ప్రభుత్వానికి కనీసం చలనం లేకపోవడం సిగ్గుచేటని హరీష్రావు విమర్శించారు. హైదరాబాద్ లోని తన నివాసంలో శనివారం కలిసి వినతి పత్రం అందించిన పోలీస్ ఉద్యోగ అభ్యర్థులు, నిరుద్యోగులనుంచి వినతిపత్రం స్వీకరించిన అనంతరం మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఉద్యోగాల జాతర అంటూ నిరుద్యోగుల్లో ఆశలు రేపి ఓట్లు వేయించుకుని ఇప్పుడు నామమాత్రంగా పోస్టులు ప్రకటించడం అంటే యువతకు ద్రోహం చేయడమేనన్నారు. కేవలం ఏడు వేల పోస్టులతో కూడిన నోటిఫికేషన్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పోలీసు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న లక్షలాదిమంది ఉద్యోగ అభ్యర్థులకు ఏ విధంగా న్యాయం చేస్తారు? జాబ్ క్యాలెండర్‌ను జాబ్‌లెస్ క్యాలెండర్‌గా మార్చేశారు. అరకొర పోస్టులతో కూడిన నోటిఫికేషన్లు ఇచ్చి నిరుద్యోగ యువతను మభ్యపెడుతున్నారు.తాజా కానిస్టేబుల్ నోటిఫికేషన్‌లో హైదరాబాద్, సైబరాబాద్, మేడ్చల్‌-మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల అభ్యర్థులకు సివిల్, ఏఆర్ కానిస్టేబుల్ పోస్టులు ఒక్కటి కూడా కేటాయించలేదు.చార్మినార్ జోన్ పరిధిలో సబ్‌-ఇన్‌స్పెక్టర్ పోస్టులు తగిన సంఖ్యలో లేకపోవడం వల్ల అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నారు.పెరుగుతున్న నగర జనాభా, విస్తరిస్తున్న ఐటీ కారిడార్లు, పారిశ్రామిక ప్రాంతాల అభివృద్ధికి అనుగుణంగా శాంతిభద్రతల పరిరక్షణకు అదనపు పోలీసు బలగాలు అత్యవసరం. అయినా ప్రభుత్వం ఈ అంశాన్ని పట్టించుకోకపోవడం తీవ్ర నిర్లక్ష్యానికి నిదర్శనం. మూడేళ్ల కాంగ్రెస్ పాలనలో ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయకపోవడంతో నిరుద్యోగ యువత తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ హామీని విస్మరించి నిరుద్యోగులను మోసం చేసింద అరకొర పోస్టులతో కూడిన నోటిఫికేషన్ నిరుద్యోగుల ఆకాంక్షలను ఏమాత్రం నెరవేర్చలేదు అన్నది సుస్పష్టం. హోంమంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. పోలీస్ ఉద్యోగాల అభ్యర్థుల అవేదన అర్థం చేసుకోవాలన్నారు. పోలీసు ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో వేలాది మంది యువత తమ సమయాన్ని, శ్రమను, ఆర్థిక వనరులను వెచ్చిస్తున్నారు. వారి ఆశలను, ఆకాంక్షలను గౌరవించండి.పోలీసు ఉద్యోగ నోటిఫికేషన్‌లో పోస్టుల సంఖ్యను 25 వేలకు పెంచాలని, హైదరాబాద్, సైబరాబాద్, మేడ్చల్‌-మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి, ఫ్యూచర్ సిటీ, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలకు పోస్టులు కేటాయించి నియామకాలు చేపట్టాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *