– కేంద్రం తక్షణ సహాయం అందించాలి
– సూక్ష్మ సేద్యం, మధ్యంతర పంటల విత్తనాలకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలి
– ‘ఖేత్ బచావో అభియాన’పై వీసీలో పాల్గొన్న మంత్రి తుమ్మల
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 17 : వర్షాభావ పరిస్థితులు, ఎల్నినో ప్రభావం కారణంగా రాష్ట్రంలోని 315 మండలాల్లో కరువు తరహా పరిస్థితులు నెలకొంటున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షతన శనివారం నిర్వహించిన ‘ఖేత్ బచావో అభియాన’ వీడియో కాన్ఫరెన్స్లో మంత్రి తుమ్మల పాల్గొన్నారు. ఎల్నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సూక్ష్మ సేద్యానికి, మధ్యంతర కాలంలో సాగు చేసే పంటలకు అవసరమైన విత్తనాల కోసం ప్రత్యేకంగా అదనపు బడ్జెట్ కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. వాతావరణ పరిస్థితుల వల్ల రైతులకు ఎదురయ్యే నష్టాలను తగ్గించేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఆర్థిక సహాయం అందించాలని కోరారు. తెలంగాణలో కూడా ఈ ఖేత్ బచావో అభియాన్ కార్యక్రమాన్ని ఈనెల 22 నుండి నవంబరు 30 వరకు నిర్వహిస్తామని, అఖిల భారత వ్యవసాయ సంస్థలు, విశ్వ విద్యాలయాల సిబ్బంది సహకారంతో వీటిని గ్రామాలలో నిర్వహిస్తామని తెలిపారు. పంటల పరిస్థితిని అంచనా వేయడం, అందుబాటులో ఉన్న నీటిని సంరక్షించడం, పంటలు కోతకు వచ్చే వరకు వాటిని కాపాడేందుకు అవసరమైన సాగునీరు, విద్యుత్ సరఫరా అందేలా చర్యలు తీసుకోవాలని తమ ప్రభుత్వం అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. ఎరువుల ధరలు, సబ్సిడీల అంశాన్ని ప్రస్తావిస్తూ యూరియాపై అధిక సబ్సిడీ కారణంగా ఇతర ఎరువులతో పోలిస్తే దాని ధర తక్కువగా ఉందని, దీనివల్ల యూరియా అధిక వినియోగం పెరిగి నేల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతోందని మంత్రి తెలిపారు. రైతులపై అదనపు ఆర్థిక భారం పడకుండా ఎరువుల ధరలు, సబ్సిడీలను హేతుబద్ధీకరించి, ఎరువుల సమతుల్య వినియోగాన్ని ప్రోత్సహించాలని కోరారు. రైతులు పంటల మార్పిడికి ముందుకు రావాలంటే పంటలకు కనీస మద్దతు ధరపై కొనుగోలు భరోసా కల్పించడం అత్యంత ముఖ్యమని మంత్రి పేర్కొన్నారు. మొక్కజొన్న, జొన్న, పప్పుధాన్యాలు, నూనె గింజలు సహా అన్ని ప్రధాన పంటలను కనీస మద్దతు ధరపై 100 శాతం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరారు. అలాగే ధరల మద్దతు పథకం (పీఎసఎస్) కింద ప్రస్తుతం అమలులో ఉన్న 25 శాతం కొనుగోలు పరిమితిని తొలగించాలని విజ్ఞప్తి చేశారు. కరువు పరిస్థితుల్లో వ్యవసాయ కూలీలకు ఉపాధి, ఆర్థిక భరోసా కల్పించాల్సిన అవసరం ఉందని మంత్రి తెలిపారు. వీబీ జీ రామ్జీ పŸథకం కింద నిధుల కేటాయింపును పెంచడంతోపాటు వ్యవసాయానికి సంబంధించిన పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ముఖ్యంగా పొలాల్లో ఫామ్ పాండ్ల నిర్మాణం, నీటి సంరక్షణ, భూమి అభివృద్ధి పనులను ప్రోత్సహించాలని సూచించారు. రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం మాత్రమే సరిపోదని, వారికి అవసరమైన ఆర్థిక సహాయం అందించడంతోపాటు పండించిన పంటలకు మార్కెట్లో కొనుగోలు భరోసా కల్పించాలని మంత్రి తుమ్మల కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





