– ప్రజలు స్వాగతిస్తుంటే వీరు విమర్శిస్తున్నారు
– నీట్‌పై కేంద్రం నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించింది
– మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 28: హైడ్రాపై బీజేపీ, బీఆర్‌ఎస్ కుట్రలు చేస్తున్నాయని, హైడ్రాపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతోందని, రాజకీయ ప్రయోజనాల కోసమే వ్యతిరేక ప్రచారం జరుగుతోందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ప్రజల ప్రయోజనాల కోసం పనిచేస్తున్న సంస్థ హైడ్రా అని, అందుకే సాధారణ ప్రజలు దీనిని స్వాగతిస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. హైడ్రాకు మద్దతుగా ప్రజలు స్వచ్ఛందంగా ర్యాలీలు నిర్వహించడం ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. ప్రభుత్వ చర్యలకు ప్రజల నుంచి వస్తున్న మద్దతును చూసి కొందరు రాజకీయ పార్టీలు అసహనం వ్యక్తం చేస్తున్నాయని విమర్శించారు. హైడ్రాను అడ్డుకునేందుకు రాజకీయ ప్రయోజనాల కోసమే కొందరు కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ, బీఆర్‌ఎస్ కలిసి హైడ్రాపై కుట్రలు చేస్తున్నాయన్నారు. కోర్టు వ్యవస్థపై ప్రభుత్వానికి పూర్తి గౌరవం ఉందని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. హైడ్రాకు సంబంధించిన పూర్తి తీర్పు ఇంకా వెలువడలేదని, తుది తీర్పు వచ్చిన తర్వాత ప్రభుత్వం చట్టపరంగా ముందుకు సాగుతుందని తెలిపారు. ప్రభుత్వం తరఫున చెప్పాల్సిన అన్ని అంశాలనూ కోర్టు ముందే వివరిస్తామని, న్యాయ పక్రియను పూర్తిగా గౌరవిస్తామని చెప్పారు. అయితే కోర్టు తీర్పు పూర్తిగా రాకముందే కొన్ని రాజకీయ పార్టీలు, ముఖ్యంగా బీఆర్‌ఎస్ సోషల్ మీడియా వేదికల ద్వారా తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. వాస్తవాలు బయటకు వచ్చే వరకూ ప్రజలు పుకార్లను నమ్మవద్దని, అధికారిక సమాచారం ఆధారంగానే స్పందించాలని మంత్రి శ్రీధర్ బాబు సూచించారు. నీట్ పరీక్ష అనేది కోట్లాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న అంశమని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. విద్యార్థుల నిరసనలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం వారి ఆకాంక్షలకు చెంపపెట్టులాంటిదని విమర్శించారు. ప్రధాని నివాసం ముందు రాహుల్ గాంధీ చేపట్టిన నిరసనతో ఈ ఉద్యమం మరింత ఉధృతమైందని చెప్పారు. కాంగ్రెస్ చేపట్టిన ఉద్యమాల వల్లే దేశవ్యాప్తంగా నిరసనలు విస్తరించాయని పేర్కొన్నారు. ఎన్‌ఎస్‌యూఐ, యూత్ కాంగ్రెస్ నాయకుల్లో 90 శాతం మంది జెన్-జీ యువతేనని శ్రీధర్‌బాబు తెలిపారు. యువత ఆలోచనలకు అనుగుణంగా పనిచేసే నాయకత్వం సీఎం రేవంత్ రెడ్డిదని కొనియాడారు. జెన్-జీతో పోటీ పడే ఆలోచనా విధానం ఆయనకు ఉందన్నారు. రాష్ట్రంలో ఎవరు మంత్రులు కావాలన్నది కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయిస్తుందని స్పష్టం చేశారు.
బీఆర్‌ఎస్ పాలనపై కవిత క్షమాపణలు స్వాగతిస్తున్నాం
బీఆర్‌ఎస్ పాలనపై టీఆర్‌ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత క్షమాపణలు చెప్పడాన్ని స్వాగతిస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. గత పాలకులు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయాలని కవితకు ఆయన స్పష్టం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాడారు. బీఆర్‌ఎస్ నేతలు డబుల్ 420 అని అభివర్ణించారు. బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి రావాలని తాము కోరుకుంటున్నామన్నారు. అసెంబ్లీకి వస్తే ఆయన మర్యాదకు ఇబ్బంది రానివ్వమని శ్రీధర్‌బాబు చెప్పారు. హైడ్రా మంచిదని సాధారణ ప్రజలు చెబుతున్నారని, హైడ్రాకు మద్దతుగా ప్రజలు ర్యాలీ తీస్తున్నారని అన్నారు. అయితే హైడ్రా విషయంలో హైకోర్టు తీర్పును గౌరవిస్తామని స్పష్టం చేశారు. తాము చెప్పాల్సింది కోర్టుకు చెబుతామన్నారు. రాజకీయం కోసమే హైడ్రాకు వ్యతిరేకమైన పిటిషన్లు వేస్తున్నారని ఆరోపించారు. హైడ్రాకి వ్యతిరేకంగా బీజేపీ, బీఆర్‌ఎస్ కలిసి కుట్రలు చేస్తున్నాయని విమర్శించారు. కోర్టు పూర్తి తీర్పు ఇంకా రాలేదన్నారు. మీడియాలో, సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని తీసుకెళ్తోందంటూ బీఆర్‌ఎస్‌పై మంత్రి శ్రీధర్‌బాబు నిప్పులు చెరిగారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





