ప్రభుత్వ హాస్పిటల్స్‌లో అత్యాధునిక నేత్ర వైద్య సేవలు

-ఎల్‌వీ ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్‌తో భాగస్వామ్యం
– ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ వెల్లడి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 28 : ప్రజలకు నాణ్యమైన కంటి వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. రాష్ట్రంలోని 35 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో నేత్ర వైద్య విభాగాలు ప్రజలకు ప్రత్యేక వైద్య సేవలను అందిస్తున్నాయన్నారు. ప్రభుత్వ హాస్పిటల్స్‌లో నేత్ర వైద్య సేవల బలోపేతానికి ఎల్‌వీ ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్ భాగస్వామ్యంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎల్‌వీ ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్ సహకారంతో అమలు చేస్తున్న నవజాత శిశువుల కంటి పరీక్షల పైలట్ కార్యక్రమాన్ని దశలవారీగా ఇతర జిల్లాలకు విస్తరించడంపై మంగళవారం చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ హాస్పిటల్స్‌లో కంటి పరీక్షలు, ఆప్టోమెట్రీ సేవలు, శుక్లాల(క్యాటరాక్ట్) శస్త్రచికిత్సలు క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారని తెలిపారు. హైదరాబాద్‌లోని సరోజిని దేవి కంటి ఆసుపత్రి రాష్ట్రంలో నేత్ర వైద్యానికి అత్యున్నత కేంద్రంగా సేవలందిస్తోందన్నారు. రెటీనా శస్త్రచికిత్సలు, లేజర్ చికిత్సలు, మెల్ల కన్ను(స్క్వింట్) శస్త్రచికిత్సలు, కార్నియా మార్పిడి, కంటి క్యాన్సర్‌కు సంబంధించిన చికిత్సలు, ప్లాస్టిక్ సర్జరీలు, గ్లాకోమా చికిత్సలు వంటి అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని మంత్రి చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా కంటి వైద్య సేవల రిఫరల్ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో జిల్లాస్థాయి ప్రభుత్వ బోధన హాస్పిటల్స్‌లో ప్రత్యేక నేత్ర శస్త్రచికిత్స ఆపరేషన్ థియేటర్లు, అవసరమైన వైద్య పరికరాలను ఏర్పాటు చేయడానికి ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ ఇప్పటికే అవసరమైన ప్రణాళికలను (గ్యాప్ అసెస్‌మెంట్) రూపొందించినట్లు తెలిపారు. ఎల్‌వీ ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్ అందిస్తున్న సేవలను రాజనర్సింహ అభినందించారు. కార్నియా దానాలను ప్రోత్సహించేందుకు ప్రాంతీయ కార్నియా సేకరణ కేంద్రాలు(ఐ బ్యాంకులు) ఏర్పాటు చేసే అంశాన్ని ఎల్‌వీ ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్‌తో కలిసి పరిశీలించడం, ఆర్‌బీఎస్‌కే సిబ్బందికి శిక్షణ అందించడం ద్వారా ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల విద్యార్థులకు మెరుగైన కంటి పరీక్షలు, ఆప్టోమెట్రీ సేవలు అందించడం, ప్రభుత్వ బోధన హాస్పిటల్స్, ఎల్‌వీ ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్ మధ్య భాగస్వామ్య అవకాశాలను గుర్తించేందుకు ఆగస్టులో ప్రత్యేక వర్క్‌షాప్ నిర్వహిస్తున్నట్లు మంత్రి దామోదర్ వెల్లడించారు. సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా జెడ్ చొంగ్తు, డీఎంఈ డాక్టర్ నరేంద్ర కుమార్, డైరెక్టర్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ రవీందర్ నాయక్, ఎల్‌వీ ప్రసాద్ కంటి హాస్పిటల్ ప్రతినిధులు పాల్గొన్నారు.
—————————————————————————————————————————————————————-

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *