– బీజేపీ పోరాటంతోనే విమోచన చరిత్రకు గుర్తింపు
– మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు
– మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 12 : తెలంగాణ విమోచన పోరాటంలో జాతీయవాద సంస్థల పాత్ర ఎంతో కీలకమైనదని మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్.విద్యాసాగర్ రావు అన్నారు. తెలంగాణ విమోచన చరిత్రలో జాతీయవాద సంస్థలు పోషించిన పాత్రపై ‘తెలంగాణ విమోచనం -జాతీయవాదుల పాత్ర’ అంశంపై తెలంగాణ విమోచన కమిటీ-బీజేపీ ఆధ్వర్యంలో కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ అబిడ్స్ మెథడిస్ట్ ఇంజనీరింగ్ కాలేజీలో శనివారం ప్రత్యేక మేధావుల సదస్సు జరిగింది. కార్యక్రమానికి విద్యాసాగర్ రావు ముఖ్య అతిథిగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ గౌరవ అతిథులుగా హాజరయ్యారు. విమోచన కమిటీ కన్వీనర్ నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. విద్యాసాగర్‌రావు మాట్లాడుతూ ఆర్య సమాజ్, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్, హిందూ మహాసభ వంటి సంస్థలు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి పోరాటాలు నిర్వహించాయని తెలిపారు. 1998 నుంచే బీజేపీ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలనే డిమాండ్‌తో పోరాటాన్ని ప్రారంభించిందని, ఆ పోరాటంలో తనను కూడా భాగస్వామిని చేసి అనేక కార్యక్రమాలు నిర్వహించారని గుర్తు చేశారు. ఏళ్లతరబడి బీజేపీ నిర్వహించిన పోరాటాలు, విమోచన దినోత్సవ కార్యక్రమాల ఫలితంగానే నేడు కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం ఆనందదాయకమన్నారు. సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రజల విమోచనకు సంబంధించిన చారిత్రక దినమని రామచందర్ రావు పేర్కొన్నారు. ఓట్ల కోసం, ఎంఐఎం రాజకీయ ఒత్తిళ్లకు అనుగుణంగా చరిత్రను వక్రీకరించడం సరికాదన్నారు. ఇది ఏ ఒక్క పార్టీ చేసిన పోరాటం కాదని, సామాన్య ప్రజలు, మహిళలు, యువత, రైతులు కలిసి చేసిన ప్రజా పోరాటమని స్పష్టం చేశారు. కేంద్రం ఇప్పటికే అధికారికంగా హైదరాబాద్ లిబరేషన్ డేగా నిర్వహిస్తోందన్నారు. రాష్ఠ్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. వాస్తవాలను భావితరాలకు అందించాలన్నారు. 17న ప్రతి ఒక్కరూ తమ పోలింగ్ బూత్ పరిధిలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాలని, అనంతరం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించే చారిత్రక తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలకు వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని రామచందర్ రావు కోరారు. డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ విమోచన పోరాటంలో బైరాన్‌పల్లి, పరకాల ఘటనలు నిజాం, రజాకార్ల దమనకాండకు నిదర్శనాలని అన్నారు. ప్రజలు ఎదుర్కొన్న అణచివేత, అమరవీరుల త్యాగాలను చరిత్ర నుంచి మరుగున పడనివ్వకూడదన్నారు. విమోచన పోరాటంలో జాతీయవాద సంస్థలు, దేశభక్తులు పోషించిన పాత్రను చరిత్రలో సముచితంగా గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. దేశ సమైక్యత, జాతీయ సమగ్రత కోసం జరిగిన ఈ పోరాటం భారత చరిత్రలో ఒక ముఖ్యమైన అధ్యాయమని పేర్కొన్నారు. నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ నిజాం పాలనలో ప్రజలు తీవ్ర దోపిడీకి, అణచివేతకు గురయ్యారన్నారు. నిజాం ప్రపంచంలోని అత్యంత ధనిక పాలకుల్లో ఒకరిగా ఎదిగిన సమయంలో ఆయన పాలలో సామాన్య ప్రజలు మాత్రం పేదరికంలో మగ్గాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రజల సంపద, వనరులను దోచుకోవడం ద్వారా నిజాం అపారమైన సంపదను కూడబెట్టుకున్నారని, కానీ ఆ సంపద సామాన్య ప్రజల జీవితాలను మార్చలేదని అన్నారు. ప్రజలకు కనీస హక్కులు, స్వేచ్ఛ లేకుండా నిరంకుశ పాలన కొనసాగిందని తెలిపారు. రజాకార్ల అరాచకాలు, నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సామాన్య ప్రజలు చేసిన పోరాటమే తెలంగాణ విమోచన పోరాటమని అన్నారు. విమోచన అమరవీరుల త్యాగాలను గుర్తుచేస్తూ, వాస్తవ చరిత్రను యువతకు అందించేందుకు విమోచన కమిటీ నిరంతరం కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలిపారు. శ్రీవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ విమోచన పోరాటంలో జాతీయవాదుల పాత్రను ప్రజలకు వివరించడంతోపాటు, వాస్తవ చరిత్రను భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో ఈ సదస్సును నిర్వహించామని తెలిపారు. విమోచన పోరాటంలో అమరులైన వీరుల త్యాగాలను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. సెప్టెంబర్ 17 చరిత్రను రాజకీయాలకతీతంగా ప్రజల చరిత్రగా గుర్తించి అధికారికంగా విమోచన దినోత్సవం నిర్వహించాలనే డిమాండ్‌తో బీజేపీ, విమోచన కమిటీ నిరంతరం పోరాడతాయని ఆయన స్పష్టం చేశారు. ఈ సదస్సులో మేధావులు, చరిత్రకారులు, కళాశాల, పాఠశాల యాజమాన్య ప్రతినిధులు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు, వైద్యులు, మాజీ సైనికులు, విద్యార్థులు, జాతీయవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గౌతమ్ రావు, అశోక్, విమోచన కమిటీ సభ్యులు బంగారు శృతి, డాక్టర్ ప్రకాష్ రెడ్డి, కప్పర ప్రసాద్, కిరణ్ గౌడ్, వెంకట్ రెడ్డి, సంజయ్ ఘనతే, సందీప్, సాయి, రవీందర్ రావు, రాష్ట్ర కార్యదర్శి తూటిపల్లి రవి, కళ్యాణ్ నాయక్, అధికార ప్రతినిధులు డాక్టర్ సమత, తాడూరి శ్రీనివాస్, సోలంకి శ్రీనివాస్ పాల్గొన్నారు.
——————————————————————————————————————————————————————
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





