ఎయిర్‌పోర్టుల పనులు వేగవంతం చేయాలి

– ఎయిర్‌పోర్టు అథారిటీ అధికారులతో మంత్రి పొంగులేటి సమీక్ష

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 18: రాష్ట్రాన్ని సమగ్ర అభివృద్ది దిశగా ముందుకు తీసుకువెళ్లాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోందని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ క్రమంలో వరంగల్, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి ప్రభుత్వం కార్యాచరణను సిద్దం చేసిందని చెప్పారు.  సచివాలయంలోని తన కార్యాలయంలో ఎయిర్‌పోర్టు అథారిటీ సదరన్ రీజియన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజ్ కిషోర్, ఏవియేషన్ డైరెక్టర్ భరత్‌రెడ్డి తదితరులతో వరంగల్, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో తలపెట్టిన ఎయిర్‌పోర్టులపై శనివారం సమీక్ష నిర్వహించారు. వీటి నిర్మాణాలను వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు అవసరమైన భూ సేకరణ, సాంకేతిక అనుమతులు, మౌలిక వసతుల ఏర్పాటుకు చర్యలు వేగవంతం చేస్తున్నట్లు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ పనులను త్వరితగతిన ముందుకు తీసుకువెళ్లాలని సూచించారు. వరంగల్ ఎయిర్‌పోర్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సుమారు 953 ఎకరాల భూమిని సేకరించి కేంద్రానికి అప్పగించిందని తెలిపారు. వీలైనంత త్వరలో శంకుస్ధాపన చేస్తామని వెల్లడించారు. అలాగే ఆదిలాబాద్ విమానాశ్రయాన్ని డిఫెన్స్ (రక్షణ శాఖ), సివిల్ ఏవియేషన్ (పౌర విమానయాన శాఖ), రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించాయని, ఇందుకు సంబంధించి మాస్టర్ ప్లాన్ తక్షణమే సిద్దం చేయాలని సూచించారు. అవసరమైన భూ సేకరణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఈ విమానాశ్రయం అందుబాటులోకి వస్తే ఉత్తర తెలంగాణలో రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గతంలో ప్రతిపాదించిన స్థలం విమానాశ్రయ నిర్మాణానికి అనుకూలంగా లేదని కేంద్ర పౌర విమానయాన శాఖ తెలిపిన నేపథ్యంలో దీనిపై మరింత లోతైన అధ్యయనం చేసి సాధ్యాసాధ్యాలపై ఒక నివేదిక రూపొందించాలని సూచించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *