హర్మూజ్‌పై మళ్లీ పీటముడి

– మూసేస్తున్నట్లు ఇరాన్ ప్రకటన
– మా నౌక‌ల‌పై అమెరికా నిర్బంధం కొన‌సాగుతున్నందుకే

టెహ్రాన్, ఏప్రిల్ 18: పశ్చిమాసియాలో పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారుతున్నాయి. హర్మూజ్ జలసంధి తెరుచుకుందనే ఆనందం 24 గంటలు కూడా నిలవలేదు. ఆ జలసంధిని మూసేస్తున్నట్టు ఇరాన్ శనివారం ప్రకటించింది. తమ నౌకలపై అమెరికా విధించిన సముద్ర నిర్బంధం కొనసాగుతుండడమే ఇందుకు కారణమని టెహ్రాన్ పేర్కొంది. హర్మూజ్‌పై కట్టుదిట్టమైన నియంత్రణ విధించినట్లు ప్రకటించింది. అమెరికా తన నిర్బంధాన్ని ఎత్తివేయకపోతే జలసంధి పూర్తిగా తెరవబోమని ఇరాన్ తేల్చిచెప్పింది. ఈ జలసంధిని తెరిచినప్పటికీ ఇరాన్ నౌకలపై తమ దిగ్బంధం కొనసాగుతుందని ట్రంప్ ప్రకటించడం ఉద్రిక్తతలను పెంచింది. ఈ జలసంధి గురించి, శాంతి ఒప్పందం గురించి ట్రంప్ సోషల్ మీడియాలో చేస్తున్న పోస్టులన్నీ అబద్దాలేనని, దౌత్య చర్చలపై ముందుకు సాగుతుండగా ఇలాంటి తప్పుడు సమచారాన్ని ఇరాన్ అంగీకరించదని ఆ దేశ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ ఘాలిబఫ్ పేర్కొన్నారు. కాగా, అమెరికా-ఇరాన్ మధ్య ఈనెల 20న రెండో దఫా శాంతి చర్చలు జరగబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇస్లామాబాద్ వేదికగానే ఇవి జరగబోతున్నట్టు ఇరాన్ మీడియా పేర్కొంటోంది. అయితే ఈ శాంతి చర్చలు వేదిక, తేదీ గురించి అమెరికా ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. ఇరాన్ ఓడరేవులపై అమెరికా దిగ్బంధం ఉన్నంత వరకు హర్మూజ్ జలసంధిని మూసివేసి రవాణాను అడ్డుకుంటామని ఇరాన్ అమెరికాను హెచ్చరించింది. తమతో ఇరాన్ అణు ఒప్పందానికి వచ్చేవరకు ఈ జలసంధి దిగ్బంధం కొనసాగుతుందని ట్రంప్ ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఇరాన్ హర్మూజ్‌ని మూసివేస్తున్నట్లు ప్రకటించింది. కాగా, కొన్ని మంచి వార్తలున్నాయని ట్రంప్ శనివారం ప్రకటించారు. బుధవారంలోగా ఒప్పందం కుదరకపోతే యుద్ధంలో కాల్పుల విరమణను పొడిగించకపోవచ్చన్నారు. ట్రంప్ వ్యాఖ్యల అనంతరం ఇరాన్ ఈ నిర్ణయం తీసుకుంది.

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు : వాణిజ్య నౌకలపై ఇరాన్ కాల్పులు

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. నౌకా దిగ్బంధం కొనసాగుతుందని ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో ఇరాన్ మళ్లీ హర్మూజ్ జలసంధిని మూసేసింది. తాజాగా ఈ జలసంధిలో ప్రయాణిస్తున్న రెండు వాణిజ్య నౌకలపై ఐఆర్‌జీసీకి చెందిన ఇరాన్ గన్‌బోట్లు కాల్పులకు పాల్పడినట్టు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. వాటిల్లో భారత జెండా ఉన్న ట్యాంకర్ ఒకటి ఉన్నట్టు సమాచారం. అయితే ట్యాంకర్లు, వాటిల్లోని సిబ్బంది సురక్షితంగానే ఉన్నారని సమాచారం. ఈ నేపథ్యంలో భారత్‌కు చెందిన మరో రెండు నౌకలను దారి మళ్లించినట్టు ‘ట్యాంకర్ ట్రాకర్స’ తెలిపింది. ఇరాక్ నుంచి రెండు మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును భారత్‌కు తీసుకొస్తున్న ట్యాంకర్లు హర్మూజ్ జలసంధి నుంచి వెనక్కి మళ్లినట్టు సమాచారం. అమెరికా ప్రకటనలతో హర్మూజ్ జలసంధిని మూసేసినట్టు ఇరాన్ ప్రకటించిన కొద్ది గంటల్లోనే ఈ కాల్పులు జరగడం గమనార్హం.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *