– తొమ్మిది రోజుల పాటు ప్రకృతి ఆరాధనగా పూల పండుగ
– రాష్ట్రవ్యాప్తంగా ఆధ్యాత్మిక, సాంస్కృతిక శోభ
– ఉత్సవాల నిర్వహణకు రూ.10 కోట్లు కేటాయించిన ప్రభుత్వం

                                         
                                                     (మండువ రవీందర్‌రావు, ప్ర‌జాతంత్ర‌, ప్ర‌త్యేక ప్ర‌తినిధి)
బతుకమ్మ సంబరాలు శ‌నివారం నుంచి ప్రారంభంకానున్నాయి. మహాలయ అమావాస్య మొదలు తొమ్మిది రోజులపాటు ఈ వేడుకలను ఘనంగా నిర్వహించే సంప్రదాయానికి యావత్‌ ‌తెలంగాణ సిద్దమైంది. సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా జరుపుకునే ఈ వేడుకలతో పాటు దేవీ నవరాత్రి ఉత్సవాలనుకూడా అత్యంత వైభవోపేతంగా జరుపుకోవడం ఇక్కడ ఆనవాయితీగా వస్తున్నది. ఈ వేడుకలకుగాను రాష్ట్రవ్యాప్తంగా పలు దేవాలయాలను సుందరంగా అలంకరించారు. ఈ సందర్భంగా ఆద్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదిలాఉంటే ఆబాలగోపాలం ఎంతో శ్రద్ధతో జరుపుకునే బతుకమ్మ పండుగ ఏర్పాట్లకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.10 కోట్ల నిధులను కేటాయించింది. గ్రామీణ ప్రాంతాలు మొదలు పట్టణాలు, నగరాల్లో బతుకమ్మను ఆడుకునే స్థలాలను తీర్చిదిద్దటం, తొమ్మిదవ రోజు నిమజ్జనం కోసం ప్రత్యేక ఏర్పాట్లకు ఈ నిధులను వెచ్చిస్తున్నారు. సుమారు వెయ్యి సంవత్సరాలుగా తెలంగాణ ప్రాంత ప్రజలు బతుకమ్మ ఉత్సవాలను జరుపుకుంటున్నట్లు చరిత్రకారులు చెబుతున్నారు. సీమాంధ్ర పాలకుల ఏలుబడిలో ఈ ఉత్సవాలకు అధికారికంగా పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వకపోయినా ప్రజలు తమ సంప్రదాయం ప్రకారం ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగిస్తూనేఉన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత దీన్ని రాష్ట్ర పండుగగా గుర్తించి ఏటా దీని కోసం ప్రత్యేక నిధులను రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తున్నది. చల్లని బతుకునిచ్చే తల్లిగా కొలువబడుతున్న బతుకమ్మను గౌరీదేవిగా ఆరాదిస్తారు. ఇది ప్రకృతిని ఆరాదించే వేడుకగా ప్రపంచ ప్రసిద్ధిగాంచింది.  ప్రకృతిసిద్దంగా లభించే పూలను ఆరాదించడమన్నది తెలంగాణ ప్రాంతంలో తప్ప ప్రపంచంలో మరెక్కడా కనిపంచదు. అదికూడా అడవిలో పూచే పూలతో కొలవడమన్నది ఇక్కడ ప్రత్యేకత. తంగేడు, గునుగు పూలు లేకుండా బతుకమ్మను పేర్వరు. వాస్తవానికి ఈ పండుగకూడా పూలు వికసించే కాలంలోనే వస్తుండడంతో సహజసిద్దమైన పూలకు కొదువ వుండదు. అయితే పూర్వం విస్తారంగాఉన్న అడవులు తగ్గి కాంక్రీట్‌ ‌జంగల్‌లుగా మారటంతో తంగేడు, గునుగు పూల లభ్యత తగ్గింది. దీంతో మార్కెట్‌లో లభించే పూలతోనే సంతృప్తి చెందాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే ఈ పండుగ ప్రాశస్తం గురించి అనేక కథలు వెలుగులో ఉన్నప్పటికీ, మన సంప్రదాయాలు, కట్టుబాట్లు, భక్తి శ్రద్ధలు, ఆద్యాత్మికత తదితర అంశాలు కథాంశంగా ఎంతో లయబద్దంగా పాటల రూపంలో రానున్న తరాలకు తెలియచెప్పటం ఇందులోని ప్రధానాంశం. ముఖ్యంగా సామూహికంగా  జరుపుకునే ఉత్సవం కావటంవల్ల ఇక్కడ చిన్న పెద్ద, పేద ధనిక అన్న బేదాలే కనిపించవు. శంఖు ఆకారంలో ఎంత వీలైతే అంత ఎత్తున రంగురంగుల పూలతో ఎంతో అందంగా అలంకరించి, చివరన మధ్యలో పసుపుతోచేసిన గౌరమ్మను పెట్టి పూజించడం,  దాన్ని విశాల ప్రదేశంలోపెట్టి చుట్టూ చిన్నారులతోపాటు వృద్దులైన మహిళలు చప్పట్లతో పాటలుపాడుతూ తిరగడమన్నది ఒక అనిర్వచనీయమైన ఆనందాన్ని కలిగించే అంశం. తెలంగాణ ఉద్యమకాలంలో ఈ వేడుక ఈ ప్రాంతాన్ని దాటి అనేక దేశాలకు విస్తరించింది. తెలంగాణేతరులు కూడా ఈ వేడుకల్లో ఇప్పుడు బాగస్వాములవుతున్నారు. ఇంతగొప్ప వేడుకకు 2018లో గిన్నీస్‌ ‌బుక్‌ ఆఫ్‌ ‌రికార్డులో చోటు లభించింది. ఆ సంవత్సరం సెప్టెంబర్‌ 19‌న సుమారు పదివేలమంది మహిళలు బతుకమ్మ కార్నివాల్‌ ‌నిర్వహించారు. ఇందుకుగాను హైదరాబాద్‌ ‌సరూర్‌నగర్‌ ‌స్టేడియంలో 63 అడుగుల ఎత్తు, 11 అడుగుల వెడల్పు, ఏడుటన్నుల పూలతో ఇక్కడ బతుకమ్మను ఏర్పాటు చేయడం విశేషం. అంతకు ముందు 2018లో తెలంగాణ పర్యాటక శాఖ, తెలంగాణ భాషా సాంస్కృతికశాఖ అద్వర్యంలో అక్టోబర్‌ 19‌న ఆకాశంలో బతుకమ్మ కార్యక్రమాన్ని నిర్వహించడంద్వారా ఆ వేడుకలకు ఆకాశానికి ఎత్తినట్లైంది. హైదారాబాద్‌ ‌బైసన్‌పోలోగ్రౌండ్‌లో పలువురు మహిళలు బతుకమ్మను చేతపట్టుకుని పారామోటర్‌లో అయిదు నిమిషాలపాటు గగన విహారం చేశారు. ఈసారికూడా ఈనెల 18న చివరి రోజున రాష్ట్ర రాజధానిలో అత్యంత ఘనంగా నిర్వహించేందుకు  ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తున్నది.
————————————————————————————————————————————————————

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు