ఏటీసీ విద్యార్థుల ఆవిష్క‌ర‌ణ‌లు స్ఫూర్తిదాయ‌కం

– టెక్నాల‌జీ సెంట‌ర్ల విద్యార్థ‌ల‌కు ఇన్నోవేష‌న్ పోటీలు
– ఉత్త‌మ ఆవిష్క‌ర‌ణ‌ల‌కు అవార్డులు, ఉద్యోగావ‌కాశాలు
– యువ‌రైతుల‌కోసం వ్య‌వ‌సాయ కోర్సులు
– మంత్రి వివేక్ వెంక‌ట‌స్వామి

మణుగూరు, ప్రజాతంత్ర , ఆగస్టు 18 : ప్రభుత్వ ఐటీఐ–అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్(ఏటీసీ) విద్యార్థులు రూపొందించిన నూతన ఆవిష్కరణలు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని కార్మిక, ఉపాధి కల్పన, గనులు, భూగర్భ శాఖల మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. మణుగూరు ప్రభుత్వ ఏటీసీ విద్యార్థుల నూతన ఆవిష్కరణల అభినందన సభకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి ముందుగా విద్యార్థులు రూపొందించిన నూతన ఎలక్ట్రిక్ వాహనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పార్థసారథి, స్ఫూర్తి రూపొందించిన ఎలక్ట్రిక్ వాహనాలను మంత్రి పరిశీలించారు. పాత వాహనాల నుంచి విడిభాగాలను సేకరించి వాటితో ఎలక్ట్రిక్ వాహనాలను ఏ విధంగా రూపొందించారు, తయారీలో ఉపయోగించిన సాంకేతిక విధానం, వాహనాల పనితీరు తదితర వివరాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అలాగే ఉమ్మడి ఖమ్మం జిల్లా, మహబూబాబాద్ జిల్లాలకు చెందిన ఐటీఐ–ఏటీసీ విద్యార్థులు స్ఫూర్తిదాయకంగా రూపొందించిన వివిధ నూతన పరికరాలను కూడా మంత్రి పరిశీలించి విద్యార్థులను అభినందించారు. మణుగూరు వంటి మారుమూల ఏజెన్సీ ప్రాంతానికి చెందిన విద్యార్థులు తమ సృజనాత్మకతతో నూతన ఆవిష్కరణలు చేయడం అభినందనీయమని అన్నారు. పార్థసారథి, స్ఫూర్తి రూపొందించిన ఎలక్ట్రిక్ వాహనాలు రాష్ట్రంలోని ఇతర ఏటీసీ విద్యార్థులకు రోల్ మోడల్‌గా నిలుస్తాయన్నారు. ఈ వాహనాలను మరింత సాంకేతికంగా అభివృద్ధి చేసి కమర్షియల్ వెహికల్స్‌గా రూపొందించేందుకు అవసరమైన సాంకేతిక, ఆర్థిక సహకారం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి తెలిపారు. విద్యార్థుల ఆవిష్కరణలు కేవలం ప్రాజెక్టులకే పరిమితం కాకుండా మార్కెట్‌లో ఉపయోగపడే ఉత్పత్తులుగా రూపుదిద్దుకునేలా పరిశ్రమల సహకారంతో అవసరమైన అవకాశాలను కల్పిస్తామని చెప్పారు. పాత ఐటీఐల్లో కొనసాగుతున్న సంప్రదాయ కోర్సులతోపాటు పరిశ్రమలకు అవసరమైన ఆధునిక సాంకేతిక కోర్సులను ఏటీసీల్లో ప్రవేశ పెడుతున్నామని చెప్పారు. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు కలిగిన విద్యార్థులకు శిక్షణ ఇచ్చి ఉద్యోగావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. మణుగూరు ఏటీసీలో శిక్షణ పొందుతున్న విద్యార్థులకు టాటా సంస్థ ద్వారా ఉద్యోగావకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. సుమారు 100 మంది విద్యార్థులకు నాణ్యమైన శిక్షణ అందిస్తే వారికి ఉద్యోగావకాశాలు కల్పించేందుకు టాటా సంస్థ ముందుకు వచ్చిందన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకుని తమ నైపుణ్యాలను మరింత పెంపొందించుకోవాలని సూచించారు. రాష్ట్రంలోని 119 అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ల విద్యార్థుల మధ్య ఇన్నోవేషన్ పోటీలు నిర్వహించనున్నట్లు మంత్రి ప్రకటించారు. అత్యుత్తమ ఆవిష్కరణలు చేసే విద్యార్థులను గుర్తించి రాష్ట్రస్థాయిలో పోటీ నిర్వహిస్తామని, అత్యుత్తమ ప్రతిభ కనబరిచే విద్యార్థులకు అవార్డులతోపాటు ఉద్యోగావకాశాలు కల్పించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మణుగూరు విద్యార్థులు రూపొందించిన ఎలక్ట్రిక్ వాహనాలు ఇలాంటి ఇన్నోవేషన్‌కు మంచి ఉదాహరణ అన్నారు. త్వరలోనే మారుమూల గిరిజన ప్రాంతాల్లో యువత, యువ రైతుల కోసం వ్యవసాయ రంగానికి సంబంధించిన ఆధునిక సాంకేతిక కోర్సులను కూడా ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి తెలిపారు. మంచి నైపుణ్యాలు కలిగి ఉంటే దేశంలోనే కాక విదేశాల్లో కూడా మెరుగైన ఉద్యోగావకాశాలు పొందవచ్చన్నారు. విదేశాల్లో తెలంగాణ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు టామ్‌కామ్ ద్వారా ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని మంత్రి తెలిపారు. జర్మన్, జపనీస్ వంటి విదేశీ భాషల్లో శిక్షణ అందించి జర్మనీ, జపాన్ వంటి దేశాల్లో ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. జర్మనీ పర్యటన సందర్భంగా అక్కడి ప్రతినిధులతో చర్చలు జరిపినప్పుడు తెలంగాణ నుంచి శిక్షణ పొందిన యువతను పంపిస్తే ఉద్యోగావకాశాలు కల్పించేందుకు వారు ముందుకు వచ్చినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటించిందని, ఇప్పటివరకు ఉపాధ్యాయులు, నర్సులు, సింగరేణి, ఇతర ప్రభుత్వ సంస్థల్లో చేపట్టిన నియామకాలు కలిపి సుమారు లక్ష ఉద్యోగాలు కల్పించినట్లు చెప్పారు. రాబోయే రెండున్నరేళ్ల‌లో మరో లక్ష ఉద్యోగాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. చెన్నూరులో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు చేసి ఐటీఐ ఉత్తీర్ణులైన సుమారు 100 మంది యువతకు జర్మన్ భాషలో శిక్షణ అందిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే వారు ఎ1, ఎ2 స్థాయిలను పూర్తి చేశారని, తదుపరి బి1, బి2 స్థాయిలను పూర్తి చేసిన అనంతరం విదేశాల్లో ఉద్యోగావకాశాలు పొందే అవకాశం ఉంటుందని చెప్పారు.

మణుగూరు ప్రాంతంలో కూడా ఇదే తరహాలో నైపుణ్య, విదేశీ భాషా శిక్షణ అందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ ప్రాంతంలో ఐటీసీ సంస్థతో సమన్వయం చేసుకుని సీఎస్‌ఆర్ నిధులతో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ను మంత్రి ఆదేశించారు. సుమారు 100 మంది యువతకు శిక్షణ అందించి ఉద్యోగాలు కల్పించేలా పరిశ్రమలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్ మాట్లాడుతూ మణుగూరు వంటి ఆదివాసీ ప్రాంతంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఏటీసీ ఏర్పాటు కావడం విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరమన్నారు. పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మణుగూరులో సింగరేణి బొగ్గు గనులు, బీటీపీఎస్, అశ్వాపురంలోని భారజల కర్మాగారం, బూర్గంపాడులో ఐటీసీ పేపర్ బోర్డు, పాల్వంచలో నవభారత్, కేటీపీఎస్ వంటి పరిశ్రమలు ఉన్నందున స్థానిక యువతకు పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్య శిక్షణ అందిస్తే విస్తృత ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. మణుగూరు ఏటీసీలో 244 మంది, ఐటీఐలో 168 మంది మొత్తం 412 మంది శిక్షణ పొందుతున్నారని ఎమ్మెల్యే తెలిపారు. ఏటీసీలో శిక్షణ పూర్తి చేసుకున్న 50మంది విద్యార్థులకు ఈ సందర్భంగా అభినందన పత్రాలు అందజేశారు. ఏజెన్సీ ప్రాంత విద్యార్థులకు వసతి సౌకర్యం కల్పించేందుకు మణుగూరు ఏటీసీ వద్ద హాస్టల్ ఏర్పాటు చేయాలని మంత్రి వెంకటస్వామిని కోరారు. ఇందుకు అవసరమైన స్థలాన్ని గుర్తించినట్లు తెలిపారు. కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ మెకానికల్, ఎలక్ట్రికల్ సంప్రదాయ కోర్సులతోపాటు రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సీఎన్‌సీ వంటి ఆధునిక సాంకేతిక కోర్సులకు మంచి డిమాండ్ ఉందని తెలిపారు. విద్యార్థులకు సాంకేతిక నైపుణ్యాలతోపాటు కమ్యూనికేషన్ స్కిల్స్‌ను కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. పరిశ్రమలతో సమన్వయం చేసుకుని ప్లేస్‌మెంట్ అవకాశాలను మరింత పెంచేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. కార్యక్రమంలో భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల శ్రేష్ట, ఎంప్లాయ్‌మెంట్, ట్రైనింగ్ సెంటర్స్ జాయింట్ డైరెక్టర్ నగేష్, టాంకాం ఈవో గౌస్ పాషా, రతన్ టాటా ఆర్డీడి కోటేశ్వరరావు, ఏటిసి ప్రిన్సిపాల్ సారంగపాణి, తహసిల్దార్ అద్దంకి నరేష్‌, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *