బిల్లు ప్రవేశపెట్టిన వైద్య ఆరోగ్యశాఖ మంత్రి
అవయవ దానంలో సమూల మార్పులు
అవయవాల అక్రమ రవాణాపై కఠిన చర్యలు
ఆర్గాన్ డోనర్ల కుటుంబాలను ఆదుకునేందుకు పాలసీ
మంత్రి దామోదర రాజనర్సింహ
అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా చివరి రోజు అవయవ దానం బిల్లును ప్రవేశపెట్టారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అనుమతితో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. అవయవ దానానికి సంబంధించి గతంలో ఉన్న విధానాన్ని సవరిస్తూ, 2025 తెలంగాణ మానవ అవయవాల మార్పిడి బిల్లును శాసనసభ చర్చకు చేపట్టింది. ఈ బిల్లును అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బిఆర్ఎస్ సమర్ధించాయి. బిల్లును ప్రవేశపెడుతూ, కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేసేందుకు ప్రతిపాదిస్తునట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ.. అవయవ దానానికి సంబంధించి 1994లో కేంద్ర ప్రభుత్వం టీహెచ్ఓఏ (తోవ) (ట్రాన్స్ ప్లాంటేషన్ ఆఫ్ హుమన్ ఆర్గన్ 42) చట్టం చేసింది. 1994లో చేసిన టీహెచ్ఓఏ చట్టానికి, 2011లో కేంద్ర ప్రభుత్వం సవరణలు చేసింది. దీన్నే టీహెచ్ఓటిఏ (తోటా చట్టంగా పిలుస్తున్నారు. అవయవాల మార్పిడితో పాటు, కణజాలల మార్పిడిని కూడా తోట యాక్ట్ అనుమతించింది. తోట యాక్ట్‌కు సంబంధించిన నిబంధనలను 2014లో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. దేశంలోని 24 రాష్ట్రాల్లో తోట చట్టం, ఆ చట్ట ప్రకారం 2014లో చేసిన నిబంధనలే అమలులో ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం తోవ–1991 (తోట–2011) చట్టాన్ని, నిబంధనలను అడాప్ట్ చేసుకుంటున్నది. గుండె, కిడ్నీ, కాలేయం వంటి అవయవాలతో పాటు చర్మం, ఎముక మజ్జ , రక్త నాళాలు, హార్ట్ వాల్వ్ మార్పిడి వంటివి కూడా చట్ట పరిధిలోకి వస్తాయి. బ్రెయిన్ డెత్ డోనర్ల నుంచి వీటిని సేకరించి, అవసరమైన వారికి మార్పిడి చేయడానికి వీలుపడుతుంది. అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలు వారి మనవళ్లు, మనవరాళ్లకు అవయవ దానం చేయడానికి చట్టం అనుమతి ఇస్తుంది. కొన్ని రకాల జన్యుపరమైన సమస్యల వల్ల పిల్లలకు కాలేయ మార్పిడి చేయాల్సి వస్తుంది. ఇలాంటి పిల్లలకు, వారి గ్రాండ్ పేరెంట్స్ కాలెయ దానం చేయడానికి అవకాశం కలుగుతుంది. పిల్లల ప్రాణాలు కాపాడడానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే, మనవళ్లు, మనవరాళ్లు కూడా వారి వారి తాతలకు అవయవ దానం చేయవచ్చని మంత్రి దామోదర వెల్లడించారు.





