“రాజులు పోయారు, రాజ్యాలు కనుమరుగయ్యాయి, రాచరికపు నీడలు తొలిగిపోయాయి. నేడు మిగిలింది, ఏలుతున్నది ప్రజాస్వామ్యం. ప్రజలే ఇక్కడ ప్రభువులు. ప్రజా ధనంతో, ప్రజా భూముల్లో, ప్రజల భవిష్యత్తు కోసం నిర్మిస్తున్న ఈ బృహత్తర ప్రాజెక్టుకు మళ్లీ భూస్వామ్య లేదా రాచరిక చిహ్నాల పేర్లు ఎందుకు?”

విశ్వ సమాజం వ్యవస్తాపకులు,
మొబైలు నం. 7793968907
తెలంగాణ నేలపై మరో చారిత్రక ఘట్టం సాకారమవబోతోంది. ఉత్తర తెలంగాణ గుండెకాయ వరంగల్ మామునూరులో రెండవ అంతర్జాతీయ విమానాశ్రయం రూపుదిద్దుకుంటున్న శుభతరుణమిది. ఈ సందర్భంగా ఎయిర్‌పోర్టుకు ఏ పేరు పెట్టాలనే చర్చ సహజంగానే ఊపందుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజల నుంచే సూచనలు కోరడం ప్రజాస్వామ్య పరిపక్వతకు నిదర్శనం. ప్రస్తుతం ‘కాకతీయ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్’, ‘రాణి రుద్రమదేవి’, ‘సమ్మక్క-సారలమ్మ’, ‘చాకలి ఐలమ్మ’ వంటి గొప్ప పేర్లు తెరపైకి వస్తున్నాయి. వారి పట్ల ప్రతి తెలంగాణ బిడ్డకూ అపారమైన గౌరవం, చారిత్రక స్పృహ ఉన్నది. కానీ, 21వ శతాబ్దపు ప్రపంచ పోటీలో నిలబడబోయే ఒక అంతర్జాతీయ ముఖద్వారానికి గత కాలపు రాజ వంశాల పేర్లు ఎంతవరకు సమంజసం? ఒక్క క్షణం నిర్మోహమాటంగా ఆలోచిద్దాం.
అంతేకాదు, ఏ ఒక్క మహనీయుడి పేరు పెట్టినా, నేటి రాజకీయ పరిధిలో అది వివాదంగా మారే ప్రమాదం ఉంది. కాకతీయ అంటే వరంగల్ చుట్టుపక్కల ప్రాంతానికే పరిమితం అంటారు, సమ్మక్క-సారక్క అంటే గిరిజన ప్రాంతాలకే పరిమితం అని వ్యాఖ్యానిస్తారు, చాకలి ఐలమ్మ అంటే కుల రాజకీయాల రంగు పులుముతారు. అందరినీ ఒక్కటి చేయాల్సిన విమానాశ్రయం, విభజన రేఖలకు వేదిక కాకూడదు. అందుకే ఈ వివాదాలన్నిటినీ దాటి నిలిచే ఏకైక శక్తివంతమైన పేరు “తెలంగాణ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ – వరంగల్” (TIA వరంగల్) (లేదా) “తెలంగాణ – ఓరుగల్లు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్” ఈ పేరులో ఒక మహాశక్తి ఉంది, నాలుగు కోట్ల మంది సమిష్టి గుండెచప్పుడు ఉంది. ఇందులో కులం లేదు, మతం లేదు, ప్రాంతీయ భేదం లేదు, రాజకీయ రంగు లేదు. ఆదిలాబాద్ అడవుల్లోని గిరిజన బిడ్డ నుంచి హైదరాబాద్‌లోని ఐటీ ఉద్యోగి వరకు ప్రతీ ఒక్కరూ “ఇది నా ఎయిర్పోర్ట్” అని గర్వంగా గుండెలపై చెయ్యి వేసుకొని చెప్పుకునే ఏకైక పేరు ఇది.
కాకతీయులు 300 ఏళ్లు పాలించి ఉండవచ్చు, కానీ ‘తెలంగాణ’ అనే పదం వెనుక 60 ఏళ్ల సుదీర్ఘ పోరాటం ఉంది, వందలాది మంది అమరుల త్యాగధనం ఉంది. ఏ రాజవంశం కంటే కూడా ఈ ప్రజా విప్లవ పోరాట చరిత్ర మహోన్నతమైనది. పైగా, లండన్లోనో, న్యూయార్క్‌లోనో విమానం ఎక్కే గ్లోబల్ ఇన్వెస్టర్‌కు ‘కాకతీయ’ అంటే అర్థం కాకపోవచ్చు, కానీ ‘తెలంగాణ’ అంటే సగర్వంగా తెలుస్తుంది. నేడు ప్రపంచ పటంలో తెలంగాణ ఐటీ, ఫార్మా, గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్‌కు ఒక తిరుగులేని బ్రాండ్. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి పోటీగా కాకుండా, దానికి తోడుగా వరంగల్‌లో తెలంగాణ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిలిస్తే రాష్ట్ర ప్రగతికి రెండు బలమైన రెక్కలు వచ్చినట్లే!
మరి మన చారిత్రక వారసత్వాన్ని ఎక్కడ నిలపాలి అంటే – అది ఆకారంలో ప్రతిబింబించాలి. ముఖ్యమంత్రి గారు సూచించినట్లు విమానాశ్రయ ప్రధాన ముఖద్వారం కాకతీయ తోరణంతో గంభీరంగా ఉండాలి. లోపల రుద్రమదేవి ప్రతిమ, సమ్మక్క-సారక్క జాతర సంస్కృతి తెలిపే చిత్రలేఖనాలు, చాకలి ఐలమ్మ పోరాట గాథల మ్యూజియం ఏర్పాటు చేయాలి. ఆకారం కాకతీయ ఆత్మను చాటాలి, నామం తెలంగాణ ఆకాంక్షను మోయాలి.
పేరు అనేది కేవలం ఒక గుర్తింపు మాత్రమే కాదు, అది మన దిశను నిర్దేశించే దిక్సూచి. మనం గతం వైపు చూస్తూ నిలబడిపోదామా? లేక భవిష్యత్తు ఆకాశంలోకి ఎగురుదామా? రాజుల కాలం చెల్లింది, ప్రజాస్వామ్య వెలుగులు నిండిన కాలం ఇది. ఆ ప్రజల సమిష్టి సంకల్పమే ‘తెలంగాణ’. వరంగల్ ఆకాశంలో రెపరెపలాడాల్సింది ఏ ఒక్క రాజవంశపు జెండా కాదు, 4 కోట్ల ప్రజల స్వేచ్ఛా సంకేతమైన తెలంగాణ జెండా! సగర్వంగా, నిర్మోహమాటంగా, ఏకకంఠంతో చాటి చెబుదాం – “తెలంగాణ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, వరంగల్”. ఇది కేవలం ఒక పేరు కాదు… మన భవిష్యత్తుపై మనం చేసుకుంటున్న ఆత్మగౌరవ ప్రకటన!





