ఇమ్రాన్ పదవీచ్యుతిలో అమెరికా పాత్ర?

సంచలనం కలిగిస్తున్న తాజా వార్తలు

ఇస్లామాబాద్, మే 18: ప్రపంచ దేశాలపై తన పట్టును కొనసాగించేందుకు అమెరికా చేయని పనులు లేవు. దానికి సలాం అనకుంటే ఆయా దేశాలను అతలాకుతలం చేస్తుంది. శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్ వంటి దేశాలు ఇలా విలవిల్లాడినవే. మన దేశంలోనూ వేలు పెట్టబోయి చేతులు కాల్చుకుందని చెబుతారు. తాజాగా పాక్‌లోనూ ఇలాంటి చర్యలకు దిగినట్లు తాజా వార్తలు రుజువు చేస్తున్నాయి. పాక్ ప్రధాని పదవి నుంచి ఇమ్రాన్ ఖాన్‌ను తొలగించడం వెనుక అమెరికా హస్తం ఉందని వెల్లడించే తాజాగా రహస్య దౌత్య సమాచారం లీక్ అయింది. దీనికి సంబంధించిన అసలు పత్రాన్ని ఇన్వెస్టిగేటివ్ పత్రిక డ్రాప్ సైట్ ప్రచురించింది. ఇందులో వెల్లడించిన వివరాల ప్రకారం.. 2022 ఏప్రిల్‌లో ఇమ్రాన్‌ఖాన్‌కు వ్యతిరేకంగా పాకిస్థాన్ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. అంతకుముందు అమెరికాలోని పాకిస్థాన్ రాయబారి అసద్ మజీద్ ఖాన్‌తో అమెరికా హోం శాఖలోని దక్షిణ- మధ్య ఆసియా వ్యవహారాల సహాయ కార్యదర్శి డోనాల్డ్ లూ సమావేశమయ్యారు. అందులో వారు ఇమ్రాన్‌ను పదవి నుంచి తొలగించి జైలులో పెట్టాలని, అప్పుడే అమెరికా-పాక్ బంధం మరింత బలపడుతుందని చర్చించున్నట్లు తెలుస్తోంది. అనంతరం ఇమ్రాన్ ఖాన్ ప్రధాని పదవి నుంచి వైదొలగడంతో షెహబాజ్ షరీఫ్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం విషయంలో ఇమ్రాన్‌ఖాన్ తటస్థ వైఖరి కారణంగానే ఆయన్ను ప్రధాని పదవి నుంచి తప్పించాలని అమెరికా నిర్ణయించినట్లు పాకిస్థాన్‌లో లీకైన దౌత్య సమాచారం వెల్లడించింది. పాక్ రాయబారి, అమెరికా ప్రభుత్వాధికారుల మధ్య భేటీకి ముందు ఇమ్రాన్ ఖాన్ పాకిస్థాన్‌లో భారీ ర్యాలీ చేపట్టారు. తనను పదవి నుంచి తొలగించడానికి స్థానిక పార్టీలు, అధికారులతో కలిసి అమెరికా కుట్ర పన్నుతోందని ఆరోపించారు. ఆయన వ్యాఖ్యలను పాక్ ప్రభుత్వం, అమెరికా ఖండించాయి. అనంతరం తోషాఖానా కేసులో ఆయనకు జైలు శిక్ష పడింది. నాటినుంచి ఇమ్రాన్ జైల్లోనే ఉన్నారు. ఇటీవల ఆయనపై హత్యాయత్నం కూడా జరిగిందని వార్తలు వచ్చాయి.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 


 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *