యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలే శ్రేయస్కరం

– వ్య‌వ‌ సాయ శాఖ మంత్రి తుమ్మల
– తక్కువ నీటితో పండే పప్పు ధాన్యాలు, నూనె గింజల వైపు మళ్లాలి
– ‘రైతు నేస్తం’ 109వ ఎపిసోడ్‌లో రబీ విత్తన పంపిణీ ప్రారంభం
– 50% నుంచి 100% సబ్సిడీపై విత్తనాలు

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, అక్టోబర్ 3 : ఎల్‌నినో ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగానే కాకుండా ప్రాజెక్టుల్లో నీటి కొరత నెలకొన్న నేపథ్యంలో, రాబోయే యాసంగి (రబీ) సీజన్‌లో రైతులు తక్కువ నీటితో, స్వల్పకాలంలో పండే ప్రత్యామ్నాయ పంటల సాగు చేపట్టాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. శనివారం ఉదయం ప్రసారమైన ‘రైతు నేస్తం’ 109వ ఎపిసోడ్‌లో పాల్గొన్న ఆయన, జాతీయ ఆహార భద్రతా మిషన్  జాతీయ నూనె గింజల మిషన్ పప్పుధాన్యాల మిషన్ కింద రబీ 2026-27 సీజన్‌కు సంబంధించిన పప్పుధాన్యాలు, నూనె గింజల సబ్సిడీ విత్తనాల పంపిణీని లాంఛనంగా ప్రారంభించారు.

ప్రాజెక్టుల నీటి నిల్వల ఆధారంగా సాగు ప్రణాళికలు

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడూ నీటి కొరత తీవ్రతను దృష్ట్యా రైతులు ఎక్కువ నీరు అవసరమయ్యే పంటల జోలికి వెళ్లకుండా, తక్కువ పెట్టుబడితో మార్కెట్‌లో అధిక డిమాండ్ ఉన్న వేరుశనగ, కుసుమ, పొద్దుతిరుగుడు, నువ్వులు, శనగలు, మినుములు, పెసలు వంటి పంటలను ఎంచుకోవాలని కోరారు. జిల్లాల వారీగా ఉన్న ప్రాజెక్టుల నీటి నిల్వల ఆధారంగా కలెక్టర్ల ఆధ్వర్యంలో పటిష్టమైన నీటి పారుదల ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా రైతుల అభ్యర్థన మేరకు ఇతర పంటలకు సబ్సిడీపై స్ప్రింక్లర్లను అందిస్తామని హామీ ఇచ్చారు. అలాగే, ఆయిల్‌పామ్ గెలల కోత అనంతరం వేగంగా ఫ్యాక్టరీలకు తరలించి, రైతులకు త్వరితగతిన బిల్లుల చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

భారీ సబ్సిడీతో విత్తన పంపిణీ వివరాలు

రైతులకు విత్తన రకం, మార్కెట్ విడుదల కాలం, నిబంధనల ఆధారంగా 50% నుంచి 75% వరకు, కొన్ని ప్రత్యేక రకాలకు 100% సబ్సిడీపై విత్తనాలు అందించబడుతున్నాయి. నూనె గింజల పంపిణీ పథకానికి రూ. 49.35 కోట్లు కేటాయించగా రూ. 34.55 కోట్లు విడుదలయ్యాయి. 52,425 ఎకరాల్లో సాగు కోసం 29,375 క్వింటాళ్ల విత్తనాలను రూ.36.76 కోట్ల సబ్సిడీతో అందిస్తున్నారు. వేరుశనగ: గిర్నార్-4, గిర్నార్-5, కదిరి లేపాక్షి, TCGS 894 (35,325 ఎకరాలు – రూ. 35.33 కోట్లు) కుసుమ ISF 764 /లక్ష్మీప్రియ (4,000 ఎకరాలు – రూ. 16.80 లక్షలు) పొద్దుతిరుగుడు SUNH-1, KBSH 85 (4,500 ఎకరాలు – రూ. 53.32 లక్షలు) నువ్వులు JCS 1020 (7,400 ఎకరాలు – రూ.29.16 లక్షలు)

పప్పు ధాన్యాల పంపిణీ 

పప్పుధాన్యాల సాగు విస్తీర్ణం పెంచేందుకు రూ. 34.60 కోట్లు కేటాయించగా, 21 జిల్లాల్లో 29,008 క్వింటాళ్ల విత్తనాలను రూ. 15.25 కోట్ల సబ్సిడీపై పంపిణీ చేస్తున్నారు.శనగలు NBeG-452, NBeG-47, NBeG-49 (83,053 ఎకరాలు) మినుములు VBN-8, VBN-10 (16,958 ఎకరాలు) పెసలు MGG-385 (9,801 ఎకరాలు)

రైతులకు అధికారుల విజ్ఞప్తి

యాసంగిలో తక్కువ నీటితో లాభదాయక పంటలు సాగు చేసి ప్రభుత్వ ప్రోత్సాహకాలను పొందేందుకు రైతులు వెంటనే తమ పరిధిలోని రైతు సేవా కేంద్రాలు లేదా మండల వ్యవసాయ అధికారులను సంప్రదించి విత్తనాలు పొందాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *