– 6,027 మీటర్ల ఎత్తైన పర్వతం అధిరోహణ
– విద్యార్థిని అభినందించిన మంత్రి అడ్లూరి
– విద్యార్థిని అభినందించిన మంత్రి అడ్లూరి
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబరు 3: సంకల్పం.. క్రమశిక్షణ.. పట్టుదల ఉంటే ఎంతటి లక్ష్యాన్నైనా చేరుకోవచ్చని గిరిజన గురుకుల విద్యార్థి ఇస్లావత్ బన్నీ నిరూపించాడు. హిమాచల్‌ప్రదేశ్‌లోని 6,027 మీటర్ల (19,774 అడుగుల) ఎత్తైన మౌంట్ తరంగ్-2 అధిరోహించి చారిత్రక ఘనత సాధించాడÁT. గిరిజన సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాల (టీజీటీడబ్ల్యూఆర్‌డీసీ), కామారెడ్డిలో బీకాం చివరి సంవత్సరం చదువుతున్న బన్నీ గత నెల 22న ఆ పర్వతాన్ని అధిరోహించి 30న తిరిగి వచ్చాడు. ఈ సందర్భంగా సచివాలయంలో సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ బన్నీని శాలువాతో శనివారం సత్కరించి అభినందించి విద్యార్థి సాధించిన ఘనతను ప్రశంసించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బన్నీ సాధించిన విజయం తన ఒక్కడి విజయమే కాదు.. రాష్ట్రంలోని ప్రతి గురుకుల విద్యార్థికి స్ఫూర్తినిచ్చే ఘనత అన్నారు. చదువుతోపాటు క్రీడలు, సాహస క్రీడలు, ఇతర రంగాల్లోనూ విద్యార్థులు తమ ప్రతిభను చాటుకోవాలని సూచించారు. లక్ష్యం ఎంత ఎత్తులో ఉన్నా దాన్ని చేరుకోవాలనే పట్టుదల, క్రమశిక్షణ, నిరంతర సాధన ఉంటే విజయాన్ని సాధించవచ్చని అన్నారు. ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు వెనక్కి తగ్గకుండా ముందుకు సాగడమే నిజమైన క్రీడాస్ఫూర్తి అని, గెలుపు మాత్రమే కాదు.. సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొనే మనస్తత్వాన్ని కూడా క్రీడలు, సాహస కార్యక్రమాలు పెంపొందిస్తాయని చెప్పారు. బన్నీ విజయాన్ని స్ఫూర్తిగా తీసుకుని మరింతమంది గురుకుల విద్యార్థులు క్రీడలు, సాహస రంగాల్లో ముందుకు రావాలని మంత్రి ఆకాంక్షించారు.
తొలి భారతీయ బృందంలో భాగస్వామ్యం
మౌంట్ తరంగ్-2 సముద్రమట్టానికి 6,027 మీటర్ల ఎత్తులో ఉంది. అత్యంత క్లిష్టమైన పర్వతా రోహణలో పాల్గొన్న భారతీయ బృందంలో బన్నీ భాగస్వామిగా నిలిచాడు. సెప్టెంబరు 22న శిఖరాన్ని అధిరోహించి భారతీయ పర్వతారోహణ రంగంలో తనదైన ముద్ర వేశాడు. టీజీటీడబ్ల్యూఆరఈఐఎస్ కార్యదర్శి కె.సీతాలక్ష్మి బన్నీని అభినందిస్తూ మౌంట్ తరంగ్-2ను అధిరోహించిన తొలి భారతీయ బృందంలో బన్నీ భాగస్వామిగా నిలవడం గిరిజన గురుకుల సొసైటీకి గర్వకారణమన్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా, సాహస ప్రతిభను వెలికితీసేందుకు సొసైటీ నుంచి అవసరమైన ప్రోత్సాహం, సహకారం అందిస్తామని తెలిపారు. బన్నీ విజయంపై అధికారులు, కళాశాల సిబ్బంది, తోటి విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, సాహస స్ఫూర్తిని పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. అదనపు కార్యదర్శి నటరాజ్, జాయింట్ సెక్రటరీ డి.ఎస్. వెంకన్న, డిప్యూటీ సెక్రటరీలు వేణుగోపాల్‌రావు, సూర్యప్రకాశ్‌రెడ్డి, స్పోర్ట్స్ ఆఫీసర్ రవికుమార్ తదితరులు బన్నీని అభినందించారు.
—————————————————————————————————————————————————–
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





