– ఈలోగా ఎమ్మెల్సీగా గవర్నర్ ఆమోదించాలి
– సీఎం వినతితో గవర్నర్ ఆమోదిస్తారా అన్న ఉత్కంఠ
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 20: నిబంధనల ప్రకారం చట్టసభల్లో సభ్యుడు కాని వ్యక్తి మంత్రి పదవి చేపడితే ఆరు నెలల్లో ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీగా ఎన్నిక కావాల్సి ఉంటుంది. అదే విషయం మైనారిటీ శాఖ మంత్రి అజారుద్దీన్‌కూ వర్తిస్తుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ముందు హడావుడిగా ఆయనను కేబినెట్‌లోకి తీసుకోగా గతేడాది అక్టోబర్ 31న మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నెల 30తో ఆరు నెలల గడువు ముగుస్తుంది. ఈలోగా ఆయన ఎమ్మెల్సీ కాకపోతే మంత్రి పదవికి రాజీనామా చేయక తప్పదు. ప్రస్తుతం గవర్నర్ కోటాలో రెండు ఎమ్మెల్సీ పదవులు ఖాళీగా ఉన్నాయి. వీటిపై బీఆరఎస్ హయాం నుంచి వివాదాలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకొచ్చాక కోదండరాం, అర్.అలీఖాన్ పేర్లను మంత్రివర్గం సిఫారసు చేసింది. దీన్ని బీఆరఎస్ నేతలు న్యాయస్థానంలో సవాల్ చేశారు. ఇద్దరి ఎమ్మెల్సీ పదవులను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఆ తర్వాత అలీఖాన్ స్థానంలో అజారుద్దీన్ పేరును చేర్చి మళ్లీ కోదండరాం, అజారుద్దీన్ పేర్లను మంత్రివర్గం సిఫారసు చేసింది కానీ, విషయం న్యాయస్థానంలో ఉండటంతో వారు ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేయలేదు. ఎమ్మెల్సీల ఎంపికకు తమ ఉత్తర్వులు అడ్డుకావని ఇటీవల సుప్రీంకోర్టు చెప్పిన నేపథ్యంలో గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్న ఎమ్మెల్సీ ఫైల్ క్లియరెన్స్ కోసం సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్‌ను కలిసినట్టు సమాచారం. వీరిద్దరి అభ్యర్థిత్వాలను ఆమోదించాలని కోరారు. వారం, పది రోజుల్లో గవర్నర్ ఆమోదిస్తే అజారుద్దీన్ మంత్రిగా ఉంటారు. లేదంటే మళ్లీ మాజీ కాక తప్పదు. బంతి ఇపుడు గవర్నర్ కోర్టులో ఉంది. కోదండరాం పేరును ఆమోదించేందుకు గవర్నర్ సానుకూలత వ్యక్తం చేసినట్టు తెలిసింది. అజారుద్దీన్ విషయంలో సందిగ్ధంలో ఉన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో జరిగిన ఆర్థిక అవకతవకలపై ఏసీబీ కేసు నమోదైందని, మూడు ఎఫఐఆర్‌లు ఉన్నాయని గవర్నర్ కార్యాలయం గుర్తించినట్టు తెలిసింది. రూ.3.8 కోట్ల ఆర్థిక అవకతవకలపై ఈడీ విచారణ ఎదుర్కొన్నారని, ఈ కేసులో ఆయనపై చార్జ్‌షీట్ ఉన్నదని గుర్తించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ఫైల్‌ను న్యాయ సమీక్షకు పంపినట్టు తెలిసింది. న్యాయనిపుణుల సలహా మేరకు తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు సమాచారం. గవర్నర్ నిర్ణయంపై కోదండరాం, అజారుద్దీన్‌ల భవితవ్యం ఆధారపడి ఉంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





