– సింగరేణి-జెన్కో సమన్వయ సమావేశంలో సింగరేణి సీఎండీ
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబరు 10 : రానున్న రోజుల్లో ఎల్నినో ప్రభావంతో విద్యుత్ అవసరాలు మరింత పెరిగే అవకాశం ఉన్నందున తెలంగాణ జెన్కో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు రోజుకు 75 వేల టన్నుల బొగ్గు సరఫరా చేయాలని సింగరేణి నిర్ణయించింది. ఒడిశాలోని నైనీ బొగ్గు గని నుంచి యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రానికి రోజుకు కనీసం 16 వేల టన్నుల బొగ్గు రవాణా జరిపేందుకు తగు ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్లోని సింగరేణి భవన్ నుంచి సింగరేణి సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి, తెలంగాణ జెన్కో సీఎండీ డాక్టర్ హరీష్ అధ్యక్షతన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంగళవారం జరిగిన ఉన్నతస్థాయి సమన్వయ సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు జెన్కో కేంద్రాలకు బొగ్గు సరఫరాపై సమన్వయ సమావేశాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. తాజా సమావేశంలో జెన్కోకు జరుగుతున్న సరఫరాను మరింత పెంచాలని నిర్ణయించారు. జెన్కో థర్మల్ కేంద్రాలకు బొగ్గు రవాణాలో ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని, ఆ తర్వాతే ఇతర రాష్ట్రాల విద్యుత్ కేంద్రాలకు సరఫరా చేయాలని సింగరేణి సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాష్ సంస్థ డైరెక్టర్లు, ఏరియా జనరల్ మేనేజర్లకు సూచించారు. గత మూడు నాలుగేళ్లతో పోల్చి చూసినా సరే ఈ ఏడాది తెలంగాణ జెన్కోకు ఎక్కువ బొగ్గు సరఫరా చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్ అవసరాలు పెరిగితే సింగరేణి తన సామర్థ్యం మేరకు మరింత బొగ్గు అందించేందుకు సిద్ధంగా ఉందన్నారు. నైనీ గనిలో ప్రస్తుతం రోజుకు సుమారు 20 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్నామని, ప్రస్తుతం మÖడు లక్షల టన్నుల బొగ్గు నిల్వ ఉందని సీఎండీ తెలిపారు. ఈ నేపథ్యంలో యాదాద్రికి బొగ్గు రవాణాను పెంచడానికి చర్యలు తీసుకోవాలని జెన్కోకు సూచించారు. ఒడిశాలో స్థానికంగా రవాణా సమస్యల వల్ల రవాణాలో జాప్యం జరుగుతోందని, ఈ నెలాఖరు నుంచి 16 వేల టన్నులు తరలించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు జెన్కో సీఎండీ డాక్టర్ హరీష్ వివరించారు. గని నుంచి సమీప రైల్వే సైడింగ్ వరకు రోడ్డు మార్గంలో జరుగుతున్న బొగ్గు రవాణాను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. గత సమావేశాల తర్వాత బొగ్గు రవాణా పెరిగిందని సంతృప్తి వ్యక్తం చేశారు. ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు జెన్కోలు సహా స్థానికంగా ఉండే పలు ప్రైవేట్ సంస్థలు కూడా నైనీ బొగ్గు కోసం విజ్ఞప్తి చేస్తున్న విషయాన్ని నైనీ జీఎం ప్రస్తావించారు. నైనీలో ఉత్పత్తి అవుతున్న బొగ్గులో మొదటి ప్రాధాన్యంగా తెలంగాణ జెన్కోకు సరఫరా చేయాలని, మిగిలిన బొగ్గును కూడా ఇతర సంస్థల అవసరాల కోసం రవాణా చేసేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని సింగరేణి సీఎండీ మార్కెటింగ్ శాఖ అధికారులను ఆదేశించారు. రోజూ నైనీ బొగ్గు రవాణా విషయంలో జెన్కో అధికారులతో సమన్వయం చేసుకోవాలని స్పష్టం చేశారు. సమావేశానికి సింగరేణి డైరెక్టర్లు ఎల్.వి.సూర్యనారాయణ, కె.వెంకటేశ్వర్లు, గౌతమ్ పోట్రు, తిరుమలరావు, ఈడీ(కోల్ మూవ్మెంట్) బి.వెంకన్న, జనరల్ మేనేజర్(కోఆర్డినేషన్ అండ్ మార్కెటింగ్) టి.శ్రీనివాస్ పాల్గొన్నారు. జెన్కో డైరెక్టర్(కోల్ అండ్ లాజిస్టిక్స్) నాగ్యతోపాటు రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాల చీఫ్ ఇంజినీర్లు, ఇతర అధికారులు హాజరయ్యారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





