– భూ యజమానుల ప్రయోజనాలే సర్వేలో అత్యంత ప్రాధాన్యత
– చిన్న పొరపాటు కూడా భవిష్యత్తులో వివాదానికి కారణం కాకూడదు
– రెవెన్యూ, హౌసింగ్ శాఖల మంత్రి పొంగులేటి
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 10 : తరతరాల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారంతోపాటు ప్రతి భూ యజమానికి తన భూమిపై స్పష్టమైన హక్కులు, కచ్చితమైన సరిహద్దులు కల్పించడమే లక్ష్యంగా చేపట్టిన సమగ్ర భూ రీసర్వేను అత్యంత పారదర్శకంగా, శాస్త్రీయంగా నిర్వహించాలని రెవెన్యూ, హౌసింగ్ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ ప్రక్రియలో భూ యజమానుల ప్రయోజనాలు, వారి అభిప్రాయాలు, మనోభావాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న భూ సర్వే పురోగతిపై సచివాలయంలో రెవెన్యూ ఉన్నతాధికారులతో మంత్రి మంగళవారం సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలు, రైతుల నుంచి వస్తున్న స్పందన, సాంకేతిక అంశాలు, సర్వే సిబ్బందికి ఎదురవుతున్న పరిస్థితులపై సమగ్రంగా చర్చించారు. సిబ్బందితో ఫోన్లో మాట్లాడి క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకున్నారు. మొత్తం 10,954 రెవెన్యూ గ్రామాలు ఉండగా తొలి దశలో హైదరాబాద్ మినహా మిగిలిన 32 జిల్లాల్లో జిల్లాకు 70 గ్రామాల చొప్పున ఎంపిక చేసి నక్షాలు అందుబాటులో లేని గ్రామాలను కూడా కలుపుకొని మొత్తం 2,720 గ్రామాల్లో రీసర్వే నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఇప్పటివరకు వెయ్యి గ్రామాల్లో రీ సర్వే మైలు రాయిని దాటగా 416 గ్రామాల్లో సర్వే ప్రక్రియ పూర్తయిందని వెల్లడించారు. 125 సంవత్సరాల తర్వాత రాష్ట్రంలో సమగ్ర భూ సర్వేకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, ఈ చరిత్రాత్మక కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో అధికారులు అంకితభావంతో పనిచేయాలని సూచించారు. సర్వే ప్రక్రియను మరింత వేగవంతం చేయడంతోపాటు నాణ్యత, పారదర్శకత, కచ్చితత్వం విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని మంత్రి అధికారులకు సూచించారు.
రెవెన్యూ రికార్డుల ఆధారంగానే సర్వే ప్రారంభించాలి
భూ సర్వే ప్రారంభానికి ముందుగా ఆ గ్రామానికి సంబంధించిన రికార్డుల్లో ఉన్న వివరాలు, భూముల విస్తీర్ణం, హక్కులు, సరిహద్దులను సమగ్రంగా పరిశీలించిన తర్వాతే వాటి ఆధారంగా క్షేత్రస్థాయిలో సర్వే ప్రక్రియను ప్రారంభించాలని మంత్రి స్పష్టం చేశారు. సర్వే పూర్తయిన అనంతరం భూ యజమానులకు తప్పనిసరిగా నోటీసులు జారీ చేయాలని, సర్వేలో నమోదైన వివరాలను పరిశీలించుకునేందుకు, ఏవైనా అభ్యంతరాలు లేదా అభిప్రాయాలు ఉంటే తెలియజేసేందుకు వారికి తగిన అవకాశం కల్పించాలని ఆదేశించారు. భూ యజమానుల అభ్యంతరాలను స్వీకరించి, వాటిని క్షుణ్ణంగా పరిశీలించి నిబంధనల ప్రకారం పరిష్కరించాలన్నారు.
అభ్యంతరాల నమోదు, పరిష్కారంపై రైతులకు అవగాహన కల్పించాలి
సర్వే ప్రక్రియ ఎలా జరుగుతుంది, సర్వే అనంతరం భూ యజమానులకు ఎలాంటి నోటీసులు జారీ చేస్తారు, అభ్యంతరాలను ఎలా నమోదు చేయాలి, వాటిని ఏ విధంగా పరిష్కరిస్తారు అనే అంశాలపై గ్రామస్థాయిలో రైతులకు, భూ యజమానులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. సర్వే ప్రక్రియపై ఎలాంటి అపోహలు, అనుమానాలు లేకుండా పారదర్శకంగా వ్యవహరించాలని మంత్రి పేర్కొన్నారు.
భూ యజమానుల సంతృప్తే సర్వే విజయానికి ప్రామాణికం
సర్వే కేవలం ప్రభుత్వ రికార్డుల నవీకరణకే పరిమితం కాకూడదని, ప్రతి భూ యజమానికి తన భూమిపై స్పష్టమైన హక్కులు, కచ్చితమైన హద్దులు కల్పించే ప్రక్రియగా ఉండాలని చెప్పారు. రైతుల అభిప్రాయాలు, సూచనలు, అభ్యంతరాలను గౌరవిస్తూ వారికి పూర్తి సంతృప్తి కలిగేలా సర్వే నిర్వహించాలని, భూ యజమానులకు పూర్తి న్యాయం జరిగేలా అధికారులు బాధ్యతతో వ్యవహరించాలని స్పష్టం చేశారు. రీసర్వే ప్రారంభ దశలోనే ఉన్నందున క్షేత్రస్థాయిలో ఎక్కడైనా చిన్నచిన్న పొరపాట్లు, లోపాలు గుర్తించినట్లయితే వాటిని వెంటనే సరిదిద్దుకోవాలని మంత్రి పొంగులేటి సూచించారు. ఒక్క చిన్న తప్పిదం కూడా భవిష్యత్తులో మరో భూ వివాదానికి దారితీయకూడదన్నారు. సర్వేలో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ కచ్చితత్వానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు.
భూదార్ కేటాయింపు ప్రక్రియను వేగవంతం చేయాలి
రీ సర్వే పూర్తయిన గ్రామాల్లో ప్రతి భూమికి ఆధార్ నంబర్ తరహాలో ప్రత్యేక గుర్తింపునిచ్చే భూదార్ నంబర్ కేటాయింపు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని, భూముల వివరాలు, హక్కులు, సరిహద్దులకు సంబంధించి స్పష్టమైన రికార్డులు అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి ఆదేశించారు. భూముల హక్కులు, సరిహద్దులు, విస్తీర్ణాలకు సంబంధించి అనేక సమస్యలు తరతరాలుగా కొనసాగుతున్నాయని, తమ జీవితకాలంలో కూడా ఈ సమస్యలకు పరిష్కారం లభించదనే నిరాశలో ఎంతోమంది భూ యజమానులు ఉన్నారని తెలిపారు. ఒక తరం నుంచి మరో తరానికి బదిలీ అవుతున్న ఈ సమస్యలకు సమగ్ర భూ రీసర్వే ద్వారా శాశ్వత ముగింపు పలకాలని స్పష్టం చేశారు. భవిష్యత్తు తరాలకు భూ వివాదాలు లేని తెలంగాణను అందించడమే ఈ చరిత్రాత్మక కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని మంత్రి అన్నారు.
రేపు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్
భూ రీసర్వే పురోగతి, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలు, సర్వే నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, భూ యజమానులకు కల్పించాల్సిన అవకాశాలపై జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలు, సర్వే శాఖ అసిస్టెంట్ డైరెక్టర్లతో బుధవారం ప్రత్యేక వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని మంత్రి నిర్ణయించారు. జిల్లా వారీగా పురోగతిని సమీక్షించి అధికారులకు తదుపరి కార్యాచరణపై స్పష్టమైన ఆదేశాలు ఇవ్వనున్నారు. సమీక్షలో రెవెన్యూ శాఖ కార్యదర్శి డి.ఎస్.లోకేష్ కుమార్, సర్వే అండ్ ల్యాండ్ సెటిల్మెంట్ కమిషనర్ రాజీవ్ గాంధీ హనుమంతు, జాయింట్ డైరెక్టర్ ప్రసన్నలక్ష్మి తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





