– అర్ధరాత్రి ఆఫ్‌లైన్‌లోకి 36 మానిటరింగ్ కేంద్రాలు!
– డేటా మాయంపై నిపుణుల అనుమానాలు
– ‘డేటా ఫ్రాడ’ అంటూ విపక్షాల ఆగ్రహం
న్యూదిల్లీ, నవంబర్ 9 : దేశ రాజధాని దిల్లీలో ఐదేళ్లలోనే అత్యంత దారుణమైన కాలుష్య దీపావళి నమోదైంది. పటాకుల ధాటికి గాలి నాణ్యత సూచీ (ఏక్యూఐ) ప్రమాదకర స్థాయికి పడిపోగా అదే సమయంలో నగరంలోని వాయు నాణ్యత పర్యవేక్షణ వ్యవస్థలో తీవ్ర లోపాలు బయటపడ్డాయి. కాలుష్య స్థాయిలు అత్యధికంగా ఉన్న ఆదివారం అర్ధరాత్రి (దీపావళి రాత్రి) సమయంలో దిల్లీలోని మొత్తం 59 పర్యవేక్షణ కేంద్రాలలో ఏకంగా 36 కేంద్రాలు పనిచేయడం ఆగిపోయాయి(ఆఫ్‌లైన్‌లోకి వెళ్లిపోయాయి). సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ విశ్లేషణ ప్రకారం దీపావళి రాత్రి 7 గంటలకు కేవలం ఒకే ఒక్క కేంద్రం డేటా నిలిచిపోగా రాత్రి 11 గంటలకు ఆ సంఖ్య 23కి, అర్ధరాత్రి 12 గంటలకు 29కి చేరింది. సోమవారం తెల్లవారుజామున ఒంటి గంట సమయానికి ఏకంగా 36 కేంద్రాల నుంచి రీడింగులు రావడం పూర్తిగా ఆగిపోయింది. అంటే నగరంలో కేవలం 23 కేంద్రాలు మాత్రమే పనిచేసాయి.
డేటా దాచేందుకేనా?
అధికారికంగా కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) డ్యాష్‌బోర్డ్ దిల్లీ సగటు ఏక్యూఐ 376గా చూపిస్తుండగా ప్రైవేట్ యాప్‌లు మాత్రం 637 నుండి 1,000 దాటిపోయినట్లు, కొన్నిచోట్ల గరిష్టంగా 2,283 మార్కును తాకినట్లు నివేదించాయి. కాలుష్య తీవ్రతను తక్కువ చేసి చూపించడానికే ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా మానిటర్లను నిలిపివేసిందా అనే అనుమానాలను పర్యావరణ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. అయితే గాలిలో ప్రమాదకర పీఎం 2.5 కణాలు 1,000 మైక్రోగ్రాముల గరిష్ట పరిమితిని దాటడం వల్లే యంత్రాలు మొరాయించి ఉండవచ్చని కొందరు భావిస్తున్నారు.
రాజకీయ దుమారం
ఈ మానిటర్లు నిలిచిపోవడంపై రాజకీయ దుమారం రేగింది. ప్రజల ప్రాణాలతో ఆటలాడుతూ కాలుష్య తీవ్రతను దాచేందుకు ప్రభుత్వం ‘డేటా ఫ్రాడ’ (సమాచార మోసం)కు పాల్పడుతోందని ఆమ్ ఆద్మీ పార్టీ నేత సౌరభ్ భరద్వాజ్ తీవ్ర ఆరోపణ చేశారు. అత్యవసర సమయంలో ప్రజలకు ఖచ్చితమైన సమాచారం అందించడంలో వైఫల్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




