– జిల్లా నాయకులు, కార్యకర్తలకు కేటీఆర్ అభినందనలు
– ఉత్సాహంగా ప్రజాక్షేత్రంలో పనిచేయాలి : కేటీఆర్
– కేటీఆర్‌ను కలిసిన జోగు రామన్న, జిల్లా నాయకులు
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 4: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు గర్జన కార్యక్రమం విజయవంతం కావడంతో పార్టీ జిల్లా నాయకులు, కార్యకర్తలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందించారు. రైతు గర్జన విజయంతో లభించిన స్ఫూర్తితో పార్టీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ప్రజాక్షేత్రంలో పనిచేయాలని, రైతాంగ సమస్యలపై నిరంతరం పోరాటం కొనసాగించాలని దిశానిర్దేశం చేశారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు జోగు రామన్న, భార్గవ్ దేశ్‌పాండే, యువ నాయకుడు జోగు మహేందర్‌తో పాటు పలువురు జిల్లా నాయకులు, కార్యకర్తలు హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో కేటీఆర్‌ను కలిశారు. రైతు గర్జన కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు కేటీఆర్ వారిని అభినందించారు. జిల్లా నలుమూలల నుంచి రైతులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా నాయకులు రైతు గర్జనకు సంబంధించిన వివరాలను కేటీఆర్‌కు వివరించారు. రైతాంగ సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ చేపట్టిన పోరాటానికి రైతుల నుంచి మంచి స్పందన లభించిందని తెలిపారు. రైతు గర్జన విజయం పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపిందని పేర్కొన్నారు.కేసీఆర్ నాయకత్వంలోని గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత విద్యుత్, సాగునీటి సదుపాయాలు వంటి పథకాలతో రైతాంగానికి భరోసా కల్పించామని నాయకులు గుర్తుచేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతుబంధు, రైతుబీమా అమలులో జాప్యం, రైతులకు ఇచ్చిన హామీల అమలులో వైఫల్యం కారణంగా అన్నదాతలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రైతు గర్జన విజయంతో ఆగిపోకుండా, అదే స్ఫూర్తితో పార్టీ నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై పనిచేయాలని కేటీఆర్ సూచించారు. రైతులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతరం పోరాడాలని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. కేటీఆర్ వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ బలోపేతానికి ప్రతి ఒక్కరూ సమష్టిగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





