– సమస్యల పరిష్కారానికి టోల్‌ఫ్రీ, వాట్సాప్ నంబర్లు
– పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క
ఏటూరునాగారం, ప్రజాతంత్ర, నవంబర్ 5 : గిరిజన విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క పేర్కొన్నారు. గిరిజన విద్యాసంస్థల్లో విద్యా ప్రమాణాల పెంపుపై ప్రత్యేక దృష్టి సారించి నాణ్యమైన విద్య అందించాలని సూచించారు. ఏటూరునాగారం ఐటీడీఏ పరిధిలోని విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాల కల్పన, విద్యా ప్రమాణాల పెంపు, విద్యార్థుల సంక్షేమం తదితర అంశాలపై ఐటీడీఏ కార్యాలయంలో ఐటీడీఏ పీవో లెనిన్ వత్సల్ టోప్పోతో కలిసి సంబంధిత అధికారులతో గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ గిరిజన విద్యార్థులు చదువులో రాణించి ఉన్నత ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేయాలని సూచించారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలన్నారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులతోపాటు వారి విజయానికి కృషి చేసిన ఉపాధ్యాయులనూ అభినందించి ప్రోత్సహించాలని చెప్పారు. విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించాలని, మౌలిక సదుపాయాల నిర్వహణపై అధికారులు నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. సమస్యలను సకాలంలో గుర్తించి పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. అనంతరం పీవో లెనిన్తో కలిసి విద్యార్థుల సమస్యలను తెలియజేసేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక టోల్ ఫ్రీ, వాట్సాప్ నంబర్ల సేవలను మంత్రి ప్రారంభించి పోస్టర్లను ఆవిష్కరించారు. గురుకులాలు, గిరిజన సంక్షేమ విద్యాసంస్థలు, వసతి గృహాల్లోని విద్యార్థులు తమ సమస్యలను 1800-425-3369 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి లేదా 9493368361 వాట్సాప్ నంబర్‌కు సందేశం పంపి తెలియజేయవచ్చని మంత్రి తెలిపారు. సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకునేందుకు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగా కళ్యాణి, డిప్యూటీ డైరెక్టర్లు, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారులు, డిప్యూటీ ఎడ్యుకేషన్ అధికారులు, సహాయ గిరిజన అభివృద్ధి అధికారులు, ప్రధానోపాధ్యాయులు, హాస్టల్ సంక్షేమ అధికారులు, ఐటీడీఏ వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





