కొడంగల్‌లో 7 నుంచి మెగా రైతు మేలా

– ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం
– శాస్త్రవేత్తలు, ప్రగతిశీల రైతులతో సమావేశాలు
– వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 4 : రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులు, అధిక ఆదాయం అందించే ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కల్పించడంతోపాటు వ్యవసాయ రంగంలో సాధించిన పురోగతిని ప్రదర్శించే లక్ష్యంతో ఈ నెల 7 నుంచి 9వ తేదీ వరకు కొడంగల్‌లో మూడు రోజులపాటు మెగా రైతు మేలాను నిర్వహించనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. 7న ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఈ మేలాను ప్రారంభిస్తారన్నారు. ఈ మేలాలో వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ, ఆయిల్‌ఫెడ్, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, పశుసంవర్ధక శాఖ, బ్యాంకింగ్ సంస్థలు, విత్తన పరిశ్రమ, వాలంతరి, క్రిడా, కేంద్ర ప్రభుత్వ సంస్థలు సహా మొత్తం 26 ప్రభుత్వ శాఖలు, అనుబంధ సంస్థల భాగస్వామ్యంతో సుమారు 150 ఎగ్జిబిషన్ స్టాల్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వ్యవసాయ ఇన్‌పుట్స్, నూతన తరం రసాయనాలు, నాణ్యమైన విత్తనాలు, ఆధునిక వ్యవసాయ పరికరాలు, యంత్రాలు, వ్యవసాయ డ్రోన్లు, వివిధ శాఖల సాంకేతిక పరిజ్ఞానం, ప్రభుత్వ కార్యక్రమాలను ఈ స్టాల్స్‌లో ప్రదర్శిస్తారన్నారు. వివిధ ప్రభుత్వ శాఖలు, జాతీయ, అంతర్జాతీయ సంస్థలు, ప్రైవేటురంగ సంస్థలు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, ఇతర భాగస్వామ్య సంస్థల ఆధ్వర్యంలో ప్రదర్శనలు, ప్రత్యక్ష అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులు, పంటల విలువ ఆధారిత ఉత్పత్తులు, మార్కెట్ అవకాశాలు, వినూత్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం ద్వారా రైతుల ఆదాయాన్ని పెంపొందించుకునే మార్గాలను వివరిస్తారు. మొదటి రోజు కొడంగల్ నియోజకవర్గ పరిధిలోని వికారాబాద్, నారాయణపేట జిల్లాల నుంచి సుమారు 7,500 మంది రైతులు పాల్గొననున్నారు. వ్యవసాయ, ఉద్యాన వర్సిటీల శాస్త్రవేత్తలు, వివిధ అనుబంధ శాఖల అధికారులు, వ్యవసాయరంగ నిపుణులు, ప్రగతిశీల రైతులు, అవార్డు గ్రహీతలైన రైతులు తమ అనుభవాలు, పరిజ్ఞానం, విజయగాథలను రైతులతో పంచుకునేలా సమావేశాలు ఏర్పాటు చేశామన్నారు. ఎల్‌నినో వాతావరణ పరిస్థితులు, వ్యవసాయ రంగంపై ప్రభావం, రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రత్యామ్నాయ సాగు విధానాలపై జరిగే చర్చలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వనున్నారు. విజయవంతమైన రైతుల అనుభవాలు, విజయగాథలను తెలియజేసే డాక్యుమెంటరీలు, వీడియోలను కూడా ప్రదర్శిస్తారు. వైవిధ్యభరితమైన, అధిక ఆదాయం అందించే పంటల సాగును ప్రోత్సహించడం, సంప్రదాయ పంటలపై ఆధారపడటాన్ని తగ్గించడం, వ్యవసాయ ఆదాయాన్ని పెంచడం, సుస్థిర వ్యవసాయ పద్ధతులను అవలంబించడం, వ్యవసాయం, అనుబంధ రంగాల్లో నూతన అవకాశాలను అన్వేషించడం ఈ కార్యక్రమాల ప్రధాన లక్ష్యమని మంత్రి వివరించారు.
రైతులకు వ్యవసాయ పరికరాలు, యంత్రాల పంపిణీ
మొదటి రోజు ముఖ్యమంత్రి, ఇతర ప్రముఖుల సమక్షంలో కస్టమ్ హైరింగ్ సెంటర్లు, పప్పుధాన్యాల మిల్లులు, నూనె గానుగ యూనిట్లు, భూసార పరీక్ష కార్డులు, బయో రిసోర్స్ ఇన్‌పుట్ సెంటర్లు, ఉద్యానవన శాఖకు సంబంధించిన డ్రిప్ సిస్టమ్స్ తదితర వ్యవసాయ పరికరాలు, యంత్రాలు, యూనిట్లను రైతులకు అందించనున్నారు.
రెండో రోజు మహిళా రైతులకు ప్రత్యేక ప్రాధాన్యత
రెండో రోజు కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో మహిళా రైతులు పాల్గొనేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వ్యవసాయం, అనుబంధ రంగాల్లో మహిళా రైతుల పాత్ర, ఆదాయాన్ని పెంపొందించుకునే అవకాశాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై వారికి అవగాహన కల్పించనున్నారు. మూడో రోజు 10 జిల్లాల నుంచి 50 వేల మంది రైతుల హాజరవుతారని అంచనా. చివరి రోజు సాయంత్రం ముఖ్యమంత్రి ప్రసంగంతో మేలా ముగియనుంది. రాష్ట్రంలోని రైతులందరూ ఈ మెగా రైతు మేలాలో పాల్గొని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.
———————————————————————————————————————————————————

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *