అయ్యప్ప సొసైటీని చెరబట్టి సీఎం సోదరులు

– టీఆర్‌ఎస్ చీఫ్ కవిత సంచలన ఆరోపణలు
– నెల రోజుల్లో చర్యలు తీసుకోకపోతే ‘రెడ్ మార్క్‌’ వేస్తాం

హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 5 : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని అయ్యప్ప సొసైటీని చెరబట్టి అక్రమాలకు పాల్పడుతున్నారని తెలంగాణ రక్షణ సేన(టీఆర్‌ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.  బంజారాహిల్స్‌లోని పార్టీ కార్యాలయంలో గురువారంమీడియాతో మాట్లాడిన ఆమె గ్రౌండ్ వాటర్ లేని ఆ ప్రాంతంలో ఒక్క ఇటుక కూడా పేర్చవద్దని హైకోర్టు స్పష్టమైన ఆర్డర్లు ఉన్నప్పటికీ ప్రభుత్వం దగ్గరుండి మరీ అక్రమ పర్మిషన్లు ఇప్పిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అయ్యప్ప సొసైటీ ఖానామెట్ ప్రాంతంలోని గురుకుల ట్రస్ట్ భూముల్లో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సొసైటీలో 500 నుంచి 700 వరకు అక్రమ నిర్మాణాలు వెలిశాయని, ప్రస్తుతం కొత్తగా మరో 80 భవనాలు నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి సోదరులే స్వయంగా ఇవి ఇప్పిస్తూ కమీషన్లు దండుకుంటున్నారని విమర్శించారు. నగర ప్రజలు సరైన రోడ్లు, నీళ్లు లేక ఇబ్బందులు పడుతుంటే ఆ సమస్యలను పట్టించుకోకుండా..అక్రమ సంపాదనపైనే దృష్టి పెట్టారన్నారు. సొసైటీ భూముల్లో చట్టపరమైన రిజిస్ట్రేషన్లకు అవకాశం లేకపోవడంతో నోటరీల ద్వారా ప్లాట్లు విక్రయిస్తున్నారని, పది అంతస్తుల భవనాలు నిర్మించి పీజీ హాస్టల్స్, కాలేజీలు నడుపుతున్నారని ఆరోపిించారు. భవనాల మధ్య కనీస స్థలం కూడా లేదని, ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిదని నిలదీశారు. మూసీ గర్భంలో ఆదిత్య బిల్డర్స్ నిర్మిస్తున్న ప్రాజెక్టులను ప్రస్తావిస్తూ సీఎం సోదరులకు విల్లాలు ఇస్తారనే వారికి అనుమతులు ఇస్తున్నారని ఆరోపించారు. ఈ అక్రమ దోపిడీని ప్రకృతి కూడా క్షమించదని హెచ్చరించారు. అయ్యప్ప సొసైటీలో సమగ్ర సర్వే నిర్వహించి అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇందుకోసం ప్రభుత్వానికి నెల రోజుల గడువు ఇస్తున్నామని, లేనిపక్షంలో తామే స్వయంగా అక్రమ భవనాల వద్దకు వెళ్లి రెడ్ మార్క్ వేస్తామని హెచ్చరించారు. ఇక్కడ ప్రజలు ఎలాంటి ఇళ్లు, భూములు కొనుగోలు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. మున్సిపల్ శాఖ మంత్రిగా కూడా ఉన్న ముఖ్యమంత్రే పెద్దపెద్ద బిల్డర్లకు సహకరిస్తున్నారని ఆరోపించారు. మూసీ గర్భంలో నిర్మాణాలు చేపట్టిన ఆదిత్య బిల్డర్స్‌కు అదే మూసీలో మరో మూడు ప్రాజెక్టులు చేపట్టినా పట్టించుకోవటం లేదన్నారు. మూసీలో ఆదిత్య బిల్డర్స్ నిర్మాణాలకు వ్యతిరేకంగా తాము ధర్నా చేసిన తర్వాత మూడు ప్రాజెక్టులు కొత్తగా అదే మూసీలో నిర్మిస్తున్నారంటే ఎంతకు తెగించారో అర్థం చేసుకోవాలన్నారు. ఆదిత్య బిల్డర్స్ వాళ్లు ముఖ్యమంత్రి ఇద్దరు సోదరులకు చెరొక విల్లా ఇవ్వటంతోనే వారికి పర్మిషన్లు ఇచ్చారన్నారు. సమావేశంలో ఆర్టీఐ దరఖాస్తుల పెండింగ్, రాష్ట్రంలో విద్యుత్ కోతలు, కరువు పరిస్థితులు, కేంద్ర-రాష్ట్ర రాజకీయాలపై కూడా కవిత పలు విమర్శలు చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *