బొగ్గు గని కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం

– దీపావళి శుభాకాంక్షలు తెలిపిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
– సింగరేణి కార్మికులకు రూ.1,10,250 పీఎలఆర్ బోనస్ చెల్లింపు

న్యూదిల్లీ, నవంబర్ 5 : సింగరేణి కార్మిక సోదర, సోదరీమణులకు, వారి కుటుంబ సభ్యులకు దీపావళి పండుగ సందర్భంగా కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. దీపావళి సందర్భంగా సింగరేణి కార్మికులకు ఒక్కొక్కరికి రూ.1,10,250 చొప్పున పర్ఫార్మెన్స్ లింక్డ్ రివార్డు (పీఎలఆర్) బోనస్ గురువారం అందుతుండటం సంతోషకరమన్నారు. కోల్‌కతాలోని కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్) ప్రధాన కార్యాలయంలో జాతీయ కార్మిక సంఘాలతో కూడిన కోలిండియా సంయుక్త సంప్రదింపుల కమిటీ సమావేశంలో 2025-26లో సంస్థల పనితీరును పరిగణనలోకి తీసుకుని అర్హులైన కార్మికులకు రూ.1,10,250 చొప్పున బోనస్ అందించాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. ఈమేరకు సింగరేణి కార్మికులకు దీపావళి సందర్భంగా ఈ బోనస్ అందనున్నదని అన్నారు. ఇప్పటికే దసరా సందర్భంగా కార్మికులకు సంస్థ లాభాల వాటా కింద ఒక్కొక్కరికి సగటున రూ.1,53,912 అందించారు. తాజాగా పీఎల్ఆర్ బోనస్ కూడా అందుతుండటంతో పండుగ వేళ కార్మికులకు, వారి కుటుంబాలకు మరింత ఆర్థిక ప్రయోజనం చేకూరనుంది. దేశ ఇంధన అవసరాలను తీర్చడంలో, పారిశ్రామికాభివృద్ధికి అవసరమైన బొగ్గును అందించడంలో సింగరేణి కార్మికుల కృషి ఎంతో విలువైనదని, ప్రతికూల పరిస్థితుల్లోనూ శ్రమిస్తున్న కార్మికులు దేశ ఇంధన భద్రతకు వెన్నెముకగా నిలుస్తున్నారని కిషన్‌రెడ్డి కొనియాడారు. వారి కష్టాన్ని, అంకితభావాన్ని అభినందించారు. సింగరేణి అభివృద్ధికి, కార్మికుల సంక్షేమం, వారి కుటుంబాల భద్రత, మెరుగైన జీవన ప్రమాణాలకు కేంద్రం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందన్నారు. దీపావళి పండుగ కార్మికుల కుటుంబాల్లో కొత్త వెలుగులు నింపాలని, అందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, ఆర్థికాభివృద్ధితో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *