– తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ను మరింత ఇనుమడింపజేసేందుకే సమ్మిట్
– కాంప్రహెన్సివ్ ఇండస్ట్రియల్ ఎకోసిస్టమ్ ను ప్రతిబింబించేలా ఎక్స్పో జోన్లు
– ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ పై క్షేత్రస్థాయి సమీక్షలో మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 24 : పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలకు రాష్ట్రంలో వివిధ రంగాల్లో ఉన్న అవకాశాలను పరిచయం చేసేలా ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026 ఏర్పాట్లు చేయాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న అనుకూలతలు, పారిశ్రామిక రంగంలో సాధించిన ప్రగతి, తెలంగాణ రైజింగ్-2047 లక్ష్యాలు, భవిష్యత్తు ప్రణాళికలపై జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులకు సమగ్ర అవగాహన కల్పించాలని సూచించారు. డిసెంబరు 7 నుంచి 9 వరకు భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026 ఏర్పాట్లను ఆయన క్షేత్రస్థాయిలో మంగళవారం పరిశీలించారు. అనంతరం సంబంధిత అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ను అంతర్జాతీయ స్థాయిలో మరింత ఇనుమడింపజేసేందుకు ఈ సమ్మిట్ ను నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను ఆకర్షించి ఇక్కడి యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించాలన్నదే ప్రభుత్వ సంకల్పమని స్పష్టం చేశారు. ఇందుకు గ్లోబల్ సమ్మిట్‌ను ఒక కీలక వేదికగా వినియోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. అందుకనుగుణంగా సదస్సుకు హాజరయ్యే ప్రతినిధులను ఆకట్టుకునేలా ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని అధికారులకు సూచించారు. పెండింగ్ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేసేలా నిర్దిష్ట కార్యాచరణతో ముందుకెళ్లాలని ఆదేశించారు. భద్రత, పార్కింగ్, హాస్పిటాలిటీ, కనెక్టివిటీ, ట్రాన్స్ పోర్ట్, ట్రాఫిక్ నియంత్రణ, విద్యుత్ సరఫరా, హైస్పీడ్ ఇంటర్నెట్, అత్యవసర వైద్య సేవలు తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఆతిథ్యం అందించాలని సూచించారు. అందుబాటులో ఉన్న కాంప్రహెన్సివ్ ఇండస్ట్రియల్ ఎకోసిస్టమ్, టాలెంట్ పూల్, స్కిల్ డెవలప్మెంట్ సామర్థ్యాన్ని ప్రతిబింబించేలా ఎక్స్పో జోన్లను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దాలని చెప్పారు. ముఖ్యంగా ఐటీ, ఫార్మా, డిఫెన్స్, ఏరోస్పేస్ తదితర కీలక రంగాలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





