\హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 6 : ప్రజాకవి గద్దర్ వర్ధంతి సందర్భంగా జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూలమాలులు వేసి నివాళులర్పించారు. గద్దర్ ఆట-పాట తెలంగాణ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు. తన పాటల ద్వారా ప్రజల్లో సామాజిక చైతన్యాన్ని నింపారని కొనియాడారు. అణగారిన వర్గాల హక్కుల కోసం జీవితాంతం తన గళాన్ని వినిపించిన మహోన్నత వ్యక్తి గద్దర్ అని ముఖ్యమంత్రి అన్నారు. తెలంగాణ ఉద్యమంలో గద్దర్ పాటలు ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని రగిలించాయన్నారు. పాటను ప్రజా ఉద్యమానికి ఆయుధంగా మార్చిన అరుదైన వ్యక్తిత్వం గద్దర్‌ది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. 
అలాగే తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూల మాలలు వేసి నివాళులర్పించారు. సిద్ధాంతకర్తగా తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర అత్యంత కీలకమైనదని అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం జీవితాంతం అహర్నిశలు శ్రమించిన ఆయన మహనీయుడని కొనియాడారు. ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాల సాధనకు ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.
డీజీపీ కార్యాలయంలో జయశంకర్ జయంతి వేడుకలు
తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా గురువారం తెలంగాణ డీజీపీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి డీజీపీ సి.వి. ఆనంద్ పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో డీజీ మహేష్ భగవత్ (లా & ఆర్డర్) , డీఐజీ నారాయణ నాయక్ తో పాటు పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొని ఆయన సేవలను స్మరించుకున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





