– ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించేందుకు చర్యలు
– సత్తుపల్లి ట్రంక్‌కు గోదావరి జలాలు అందించడమే లక్ష్యం
– వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల
– కమలాపురం నుంచి అన్నదైవం ప్రాజెక్టుకు నీరు విడుదల
దమ్మపేట, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 21 : శ్రీ సీతారామ ప్రాజెక్టు ద్వారా సత్తుపల్లి ట్రంక్‌కు గోదావరి జలాలను అందించి రైతులకు సాగునీటి భరోసా కల్పించేందుకు పనులను వేగవంతం చేస్తున్నామని వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సత్తుపల్లి మండలం యాతాలకుంట వద్ద సీతారామ ప్రాజెక్టు టన్నెల్ పనులను అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, జిల్లా కలెక్టర్ అంకిత్‌లతో కలిసి ఆయన సోమవారం పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. టన్నెల్ కింది భాగంలో ఉన్న ఖాళీలను కాంక్రీట్‌తో పటిష్టంగా నింపాలని, గ్రౌటింగ్, ప్యాకింగ్, కాంక్రీట్ పనులను సాంకేతిక ప్రమాణాలకు అనుగుణంగా పూర్తి చేయాలని సూచించారు. నాణ్యత, భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ఎలాంటి జాప్యానికి తావులేకుండా పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. టన్నెల్ పనులను 25 రోజుల్లో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని అధికారులు మంత్రికి వివరించారు. అక్టోబరులో పనులు పూర్తి చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేలా అవసరమైన చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు. టన్నెల్ లైనింగ్, కెనాల్ లైనింగ్, రోడ్ క్రాసింగ్స్ తదితర మిగిలిన పనులను సమన్వయంతో వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. అనంతరం ములకలపల్లి మండలం కుమ్మరిపాడులో ఎస్‌టీఎస్‌డీఎఫ్ నిధులు రూ.4.63 కోట్ల అంచనాతో నిర్మించిన హై లెవల్ బ్రిడ్జి, బీటీ రోడ్డును మంత్రి తుమ్మల ప్రారంభించారు. గ్రామీణ ప్రజలకు రాకపోకలు సులభతరం చేయడంతోపాటు అన్ని కాలాల్లో రవాణా సౌకర్యం అందుబాటులో ఉండేలా మౌలిక వసతులను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. తదుపరి ములకలపల్లి మండలం కమలాపురంలో సీతారామ ఎత్తిపోతల పథకంలోని మూడో పంప్‌హౌస్‌ను ఎమ్మెల్యే ఆదినారాయణ, జిల్లా కలెక్టర్ అంకిత్‌తో కలిసి పరిశీలించి మోటార్‌ను ఆన్ చేసి అన్నదైవం ప్రాజెక్టుకు నీటిని విడుదల చేశారు. సాగు అవసరాలకు అనుగుణంగా నీటిని సమర్థవంతంగా వినియోగించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీతారామ ద్వారా సత్తుపల్లి ట్రంక్‌కు గోదావరి జలాలను అందించాలన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిల లక్ష్యమని తెలిపారు. పనుల్లో తొందరపాటు కంటే నాణ్యత, భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పటిష్టంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. టన్నెల్ లైనింగ్, కెనాల్ లైనింగ్, రోడ్ క్రాసింగ్స్ తదితర పనులను వేగవంతం చేసి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించామని తెలిపారు. భూసేకరణ సమస్యలను దాదాపుగా పరిష్కరించామని ఆయన తెలిపారు. భూసేకరణ కోసం ఇటీవల రూ.48 కోట్లు విడుదల చేశామని, ఇంకా అవసరమైన భూముల కోసం కలెక్టర్ ప్రతిపాదనలు పంపితే నిధులను సమకూర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. వర్షాలు లేకపోవడం వల్ల భూగర్భ జలాలు కూడా తగ్గుతున్నాయని, ఈ పరిస్థితుల్లో ఖరీఫ్ పంటలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. సాగు చేసిన పంటలకు అవసరమైన సమయంలో నీటిని అందించేందుకు గోదావరి జలాలను సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. నీటి లభ్యతను ముందుగానే అంచనా వేసుకుని ఏ ప్రాంతానికి ఎంత నీరు అవసరమో ప్రణాళిక రూపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నీటి నిల్వలు తగ్గితే జలవిద్యుత్ ఉత్పత్తి తగ్గే అవకాశం ఉంటుందని, అదే సమయంలో వ్యవసాయం, పరిశ్రమలు, గృహా వసరాల కోసం విద్యుత్ డిమాండ్ పెరుగుతుందని చెప్పారు. జలవిద్యుత్ ఉత్పత్తి తగ్గినప్పుడు థర్మల్ విద్యుత్‌పై ఎక్కువగా ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. సీతారామ ద్వారా ములకలపల్లి, డమ్మపేట, అశ్వారావుపేట ప్రాంతాల్లో కూడా సాగునీటి అవసరాలను తీర్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని మంత్రి తెలిపారు. ముఖ్యంగా దమ్మపేట, అశ్వారావుపేట ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఆయిల్‌పామ్ సాగు జరుగుతున్నందున సాగునీటి సౌకర్యం మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉందన్నారు. నాలుగో పంప్‌హౌస్ ద్వారా అవసరమైన ప్రాంతాలకు నీటిని తీసుకెళ్లేలా పనులను వేగవంతం చేయాలని మంత్రి తెలిపారు. ప్రధాన కాల్వలతోపాటు అవసరమైనచోట్ల పైప్‌లైన్ వ్యవస్థను ఏర్పాటు చేస్తే భూసేకరణ సమస్యలు తగ్గుతాయని, నీటిని నేరుగా రైతుల పొలాలకు తీసుకెళ్లే అవకాశం ఉంటుందని చెప్పారు. పైప్‌లైన్‌తోపాటు డ్రిప్, స్ప్రింక్లర్ విధానాలను ప్రోత్సహించడం ద్వారా నీటి వినియోగాన్ని తగ్గించవచ్చని, తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. సీతారామ పనులపై కలెక్టర్, స్థానిక ప్రజాప్రతినిధులు వారానికోసారి సమీక్ష నిర్వహించాలని, ఎక్కడా పనులు నిలిచిపోకూడదని, ఏదైనా సమస్య తలెత్తితే వెంటనే జిల్లా స్థాయిలో పరిష్కరించాలని మంత్రి సూచించారు. అవసరమైన అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తే వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ములకలపల్లి ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం
ములకలపల్లి ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలిపారు. రహదారులు, మండల కార్యాలయాలు, గురుకులాలు, ఏకలవ్య పాఠశాలలు, విద్యుత్ సబ్‌స్టేషన్లు, ఎంపీడీవో కార్యాలయం, పోలీస్ స్టేషన్ తదితర మౌలిక వసతుల అభివృద్ధికి చర్యలు తీసుకున్నామని చెప్పారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలిపారు. అన్నదైవం ప్రాజెక్టుకు నీటిని విడుదల ద్వారా ఈ ప్రాంత రైతులకు సాగునీటి ప్రయోజనం కల్పించే దిశగా మరో అడుగు ముందుకు వేసినట్లు మంత్రి తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు మెరుగైన రవాణా సౌకర్యాలు, పారిశ్రామిక, వ్యవసాయ అభివృద్ధికి విమానాశ్రయం, రైల్వే అనుసంధానం వంటి మౌలిక వసతులు అవసరమని అన్నారు. విమానాశ్రయానికి సంబంధించి సాధ్యాసాధ్యాల నివేదిక సిద్ధమైన అనంతరం తదుపరి చర్యలు చేపడతామని చెప్పారు. రైల్వే అనుసంధానానికి సంబంధించి పాండురంగాపురం-మణుగూరు మార్గం, భద్రాచలం వైపు రైల్వే విస్తరణ అంశాలపై కూడా కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. కార్యక్రమాల్లో ఇంజినీరింగ్, రెవెన్యూ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





