– ఇందిరమ్మ కుట్టు మిషన్లు పథకం దరఖాస్తులు, పథకం అమలుపై చర్చ
– బీసీ సంక్షేమ శాఖపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష
– బీసీ గురుకులాలు, హాస్టల్స్ పనితీరుపైనా చర్చ
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 21 : దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఈనెల 30తో ముగియనున్నందున అర్హులైన బీసీ మహిళలకు ఇంటింటా కుట్టు మిషన్ల పథకం ప్రయోజనం అందేలా ఆ ప్రక్రియను సమర్థవంతంగా పూర్తి చేయాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న వివిధ సంక్షేమ, విద్యా కార్యక్రమాలపై ఉన్నతాధికారులతో సోమవారం సమీక్ష నిర్వహించారు. బీసీ మహిళలకు అందిస్తున్న ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు పథకం దరఖాస్తుల ప్రక్రియ, పథకం అమలు, బీసీ గురుకులాలు, హాస్టళ్ల పనితీరు, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు తదితర అంశాలపైనా విస్తృతంగా చర్చించారు. ఇందిరమ్మ కుట్టు మిషన్లు పథకానికి ఇప్పటివరకు 4.06 లక్షల దరఖాస్తులు అందినట్లు అధికారులు మంత్రికి వివరించారు. మంత్రి అధికారులను ఆదేశించారు.
గురుకులాలు, హాస్టళ్లలో నాణ్యమైన విద్య, పౌష్టికాహారం
మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ సంక్షేమ గురుకుల విద్యా సంస్థలు, బీసీ హాస్టళ్ల పనితీరుపై మంత్రి ఆరా తీశారు. విద్యార్థులకు నిర్దేశించిన మెనూ ప్రకారం నాణ్యమైన, పౌష్టికాహారం అందించాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు పాఠ్యప్రణాళికతోపాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. గత ఏడాది కంటే ఈ సంవత్సరం మరింత మెరుగైన ఉత్తీర్ణత సాధించేలా విద్యార్థులు, ఉపాధ్యాయులు సమన్వయంతో కృషి చేయాలని మంత్రి సూచించారు. గురుకులాలు, హాస్టళ్లలో విద్యా ప్రమాణాల మెరుగుదల, మౌలిక వసతుల కల్పన, క్రీడలకు ప్రాధాన్యం, సిబ్బంది నియామకాలు, డిజిటల్ విద్య, ఉన్నత విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, కుల సంఘాలతో సమన్వయం తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు.
బీసీల ఆర్థికాభివృద్ధికి చర్యలు
బీసీల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని మంత్రి పొన్నం తెలిపారు. బీసీ స్టడీ సర్కిల్ ద్వారా నైపుణ్యాభివృద్ధితోపాటు పోటీ పరీక్షలకు శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు చదువుతోపాటు వివిధ రంగాల్లో ప్రతిభను అభివృద్ధి చేసుకునేలా అవసరమైన అవకాశాలు కల్పించాలని అధికారులకు సూచించారు.
గురుకులాలకు సొంత భవనాల నిర్మాణంపై దృష్టి
రాష్ట్రంలో మొత్తం 327 బీసీ గురుకుల పాఠశాలలు ఉండగా ప్రస్తుతం 21 పాఠశాలలకు మాత్రమే సొంత భవనాలున్నాయని అధికారులు మంత్రికి వివరించారు. మిగిలిన గురుకుల పాఠశాలలకు సొంత భవనాల నిర్మాణం కోసం జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకుని స్థల సేకరణ చేపట్టాలని మంత్రి ఆదేశించారు. ఇప్పటికే స్థలం అందుబాటులో ఉన్న పాఠశాలలకు భవనాల నిర్మాణం చేపట్టేందుకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో చర్చించి అవసరమైన నిధులు మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే బీసీ గురుకులాలు, హాస్టళ్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, విద్యార్థులకు ఆహ్లాదకరమైన, ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించాలని అధికారులను ఆదేశించారు. బీసీ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి ప్రŸభాకర్ సూచించారు. సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బాల మాయాదేవి, బీసీ సంక్షేమ శాఖ అధికారులు మల్లయ్య బట్టు, అలోక్ కుమార్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





