– ఆగస్టు 9న హైదరాబాద్‌లో ఉచిత వైద్య శిబిరం
– రెస్‌ప్లైస్ ఆటిజం రీసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పరిశోధన
– అర్హులైన పిల్లలకు సమగ్ర వైద్య మూల్యాంకనం
అమీర్ పేట్, ప్రజాతంత్ర, జూలై 14 : తట్టు (మీజిల్స్) వైరస్ కారణంగా అరుదుగా సంభవించే ప్రాణాంతక నాడీ సంబంధిత వ్యాధి సబ్అక్యూట్ స్క్లెరోసింగ్ పాన్ఎన్‌సెఫలైటిస్ (ఎస్ ఎస్ పీఈ) పై పరిశోధన కార్యక్రమాన్ని రెస్‌ప్లైస్ ఆటిజం రీసెర్చ్ ఫౌండేషన్ అండ్ ఇన్‌స్టిట్యూట్ చేపట్టనున్నట్లు సంస్థ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్ తొడుపునూరి తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ పరిశోధనలో భాగంగా తట్టు వ్యాధి చరిత్ర ఉన్న పిల్లలు, ఎస్ ఎస్ పీఈ నిర్ధారణ అయిన వారు, తట్టు లేదా ఎంఎంఆర్ టీకా అనంతరం నాడీ సంబంధిత సమస్యలు ఎదుర్కొన్న పిల్లల కోసం ఆగస్టు 9, 2026 (ఆదివారం) మణికొండలోని రెస్‌ప్లైస్ కేంద్రంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు ప్రకటించారు. డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ… సహజంగా తట్టు సోకిన వారిలో కొద్దిమందికే ఎందుకు ఎస్ ఎస్ పీఈ వస్తుందో తెలుసుకునేందుకు జన్యు, రోగనిరోధక వ్యవస్థ, మైక్రోబయోమ్, ట్రాన్స్‌క్రిప్టోమిక్స్, ఎపిజెనెటిక్స్ తదితర అంశాలపై మల్టీ-ఓమిక్స్ విధానంలో పరిశోధనలు చేపడతామని తెలిపారు. ఈ అధ్యయనం ద్వారా ప్రమాదంలో ఉన్న పిల్లలను ముందుగానే గుర్తించి, నివారణ, ముందస్తు జోక్యానికి అవసరమైన శాస్త్రీయ ఆధారాలను అభివృద్ధి చేయడమే లక్ష్యమన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థప్రకారం, తీవ్రమైన మీజిల్స్ కేసుల్లో చాలా అరుదుగా ఎస్ ఎస్ పీఈ అభివృద్ధి చెందుతుందని, ముఖ్యంగా చిన్న వయసులో తట్టు సోకిన పిల్లల్లో ప్రమాదం ఎక్కువగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వ్యాధికి శాశ్వత చికిత్స లేదని, అందుకే పరిశోధనకు ప్రాధాన్యం పెరిగిందన్నారు. శిబిరంలో ఎంపికైన పిల్లలకు సమగ్ర వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ పరిశోధనలో శిశువైద్య నిపుణులు డాక్టర్ నితిన్ చావ్లా, డాక్టర్ విజయ్ ఆనంద్, డాక్టర్ నారాయణ పరిశోధకులుగా వ్యవహరించనున్నారు. ఉచిత వైద్య శిబిరం ఆగస్టు 9న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మణికొండలోని రెస్‌ప్లైస్ ఆటిజం రీసెర్చ్ ఫౌండేషన్‌లో నిర్వహించనున్నారు. నమోదు కోసం 9100065552, 8433529769 నంబర్లను సంప్రదించాలని నిర్వాహకులు కోరారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





