హైదరాబాద్ మహానగరం శరవేగంగా విస్తరిస్తున్నది . ఆకాశహర్మ్యాలు, ఐటీ కారిడార్లు, నిరంతర నిర్మాణాలతో నగరం గ్లోబల్ హబ్‌గా మారుతున్నది . అయితే, ఈ భౌతిక వృద్ధి వెనుక ఒక ప్రమాదకరమైన నీడ పొంచి ఉంది. అదే ‘జల సంక్షోభం’. ఈ పరిస్థితి రాబోయే వేసవి కాలానికి ఇప్పుడే తీవ్ర హెచ్చరికలను జారీ చేస్తున్నది . ఇటీవల వెలువడిన గణాంకాలు భాగ్యనగర నివాసులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. రాష్ట్రంలోని 70 శాతం మండలాల్లో వర్షపాత లోటు నమోదు కావడం ఒక ఎత్తయితే… నగరంలోని ప్రధాన పరిధి ‘క్యూర్’ ప్రాంతంలో భూగర్భ జలమట్టాలు రికార్డు స్థాయిలో పడిపోవడం మరో ముంచుకొస్తున్న ముప్పు. వర్షాకాలం ముగుస్తున్న నేపథ్యంలో నగరంలో సగటున 22.5 అడుగుల లోతుకు భూగర్భ నీటిమట్టం పడిపోయినట్టు తాజా నివేదిక వెల్లడిస్తున్నది.
ఎండా కాలం రాకముందే జారీ అవుతున్న ఈ హెచ్చరికలు, కాంక్రీట్ నగరానికి తక్షణ జల రక్షణ ప్రణాళికలు ఎంత అవసరమో స్పష్టం చేస్తున్నాయి.’క్యూర్’ ప్రాంతంలో ఈ దుర్భర పరిస్థితికి ప్రధాన కారణం కేవలం వర్షపాత లోటు మాత్రమే కాదు. కురిసిన కొద్దిపాటి వర్షపు నీటిని కూడా భూమిలోకి ఇంకించుకోలేని విధంగా నగరాన్ని కాంక్రీట్ మయం చేయడమే. వర్షపు నీరంతా వరద కాలువల ద్వారా మూసీ నదిలోకి వృథాగా పోతుందే తప్ప, భూగర్భంలోకి చేరడం లేదు. మరోవైపు బహుళ అంతస్తుల భవనాలు, ఎఫ్‌టీఎల్ పరిధిలోని జలాశయాల ఆక్రమణలు ఈ సంక్షోభాన్ని మరింత తీవ్రం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే స్పందించి, దీర్ఘకాలిక విధానపరమైన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని అవుతున్న ఈ హెచ్చరికలు, కాంక్రీట్ నగరానికి తక్షణ జల రక్షణ ప్రణాళికలు ఎంత అవసరమో స్పష్టం చేస్తున్నాయి.
‘క్యూర్’ పరిధిలో ముఖ్యంగా పట్టణీకరణ వేగంగా జరుగుతున్న ఉత్తర, వాయువ్య ప్రాంతాల్లో పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా మారింది. అధికారిక గణాంకాల ప్రకారం, కూకట్‌పల్లి మండలంలో భూగర్భ జలమట్టం సగటున 67.8 అడుగుల లోతుకు పడిపోగా, అక్కడి ఎమ్మార్వో ఆఫీస్ పర్యవేక్షణ కేంద్రం వద్ద ఏకంగా 155 అడుగుల లోతుకు జలాలు పడిపోయినట్లు నమోదైంది. ఇక కుత్బుల్లాపూర్ ప్రాంతంలో ఆగస్ట్ , సెప్టెంబర్ నాటికి నీటిమట్టం ఏకంగా 39.89 మీటర్ల (సుమారు 130 అడుగులు) లోతుకు చేరుకుంది. గతేడాది ఇదే సమయంలో అక్కడ కేవలం 14.15 మీటర్ల లోతులోనే నీరుండటం గమనార్హం. కేవలం ఏడాది వ్యవధిలోనే దాదాపు 27 మీటర్ల మేర నీటిమట్టం పడిపోవడం ఒక తీవ్రమైన హెచ్చరిక. ఈ దుర్భర పరిస్థితికి ప్రధాన కారణం కురిసిన కొద్దిపాటి వర్షపు నీటిని కూడా భూమిలోకి ఇంకించుకోలేని విధంగా నగరాన్ని కాంక్రీట్ మయం చేయడమే. ఇండస్ట్రియల్, ఐటీ కారిడార్లలో నిబంధనలకు విరుద్ధంగా తోడుతున్న అక్రమ బోరుబావులు భూగర్భ జలాల పునరుద్ధరణ సామర్థ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. మరోవైపు బహుళ అంతస్తుల భవనాలు, ఎఫ్‌టీఎల్ పరిధిలోని జలాశయాల ఆక్రమణలు ఈ సంక్షోభాన్ని మరింత తీవ్రం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే స్పందించి, దీర్ఘకాలిక విధానపరమైన చర్యలు చేపట్టాలి.
నగరంలో కొత్తగా నిర్మించే ప్రతి అపార్ట్‌మెంట్, వాణిజ్య సముదాయంలో ‘రెయిన్ వాటర్ హార్వెస్టింగ్’ (వర్షపు నీటి నిల్వ గుంతలు) కేవలం కాగితాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో అమలు చేయాలి. భవన నిర్మాణ అనుమతులు ఇచ్చే సమయంలోనే కాక, నిర్మాణం పూర్తయ్యాక ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ (ఓసీ) ఇచ్చే ముందు ఈ ఇంకుడు గుంతల నాణ్యతను అధికారులు స్వయంగా పరిశీలించాలి. ప్రతి పెద్ద భవనంలో ‘గ్రే వాటర్’ (స్నానాలు, పాత్రలు కడగడం ద్వారా వొచ్చే నీరు) పునర్వినియోగానికి వీలుగా విడిగా పైప్‌లైన్ల వ్యవస్థను ఏర్పాటు చేయడం తప్పనిసరి చేయాలి. నగర పరిధిలోని చెరువులు, కుంటల ఎఫ్‌టీఎల్ (గరిష్ట నీటి మట్టం) పరిధిని ఉపగ్రహ చిత్రాల సాయంతో డిజిటలైజ్ చేయాలి. ఎఫ్‌టీఎల్ , బఫర్ జోన్లలో ఎలాంటి అక్రమ నిర్మాణాలకు తావులేకుండా కూల్చివేతలతో పాటు, భవిష్యత్తులో ఆక్రమణలు జరగకుండా ‘జియో ఫెన్సింగ్’ ఏర్పాటు చేయాలి.
చెరువుల క్యాచ్‌మెంట్ ఏరియాలు (నీటి ప్రవాహ మార్గాలు) కాంక్రీట్ నిర్మాణాల వల్ల మూసుకుపోకుండా ప్రభుత్వం ప్రత్యేక గ్రీనరీ కారిడార్లను అభివృద్ధి చేయాలి. చెరువుల్లోకి మురుగునీరు చేరకుండా ఎస్టీపీల సామర్థ్యాన్ని పెంచి, నీటి వనరులను పునరుద్ధరించాలి. నగరంలోని ఎస్టీపీల ద్వారా శుద్ధి చేసిన నీటిని పరిశ్రమలకు, ఉద్యానవనాలకు, నిర్మాణ రంగ పనులకు మాత్రమే వాడేలా నిబంధనలు తేవాలి. తద్వారా తాగునీటిపై ఒత్తిడి తగ్గుతుంది. ఐటీ కారిడార్లు, పారిశ్రామిక ప్రాంతాల్లో రోడ్ల పక్కన ‘స్టార్మ్ వాటర్ డ్రెయిన్స్’ (వరద నీటి కాలువలు) ద్వారా వృథాగా పోయే నీటిని సమీపంలోని చెరువులకు లేదా పెద్ద ఇంకుడు బావులకు మళ్లించేలా మౌలిక వసతులు నిర్మించాలి. సొంతంగా నీటిని రీసైకిల్ చేసుకునే, వర్షపు నీటిని సమర్థవంతంగా వాడుకునే నివాస సముదాయాలకు ఆస్తి పన్నులో రాయితీలు (గ్రీన్ రిబేట్స్) ఇవ్వడం ద్వారా ప్రజల్లో బాధ్యతను పెంచవొచ్చు.
హైదరాబాద్‌కు ముంచుకొస్తున్న ఈ నీటి గండం నుంచి గట్టెక్కించాలంటే ప్రభుత్వం కేవలం తాత్కాలికంగా ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా పెంచడంపైనే కాకుండా, పైన పేర్కొన్న శాశ్వత జల సంరక్షణ చర్యలపై దృష్టి పెట్టాలి. ప్రకృతి ఇచ్చిన ఈ ఆఖరు హెచ్చరికను ఇప్పుడే అందిపుచ్చుకుని ‘స్మార్ట్ సిటీ’ని ‘వాటర్ స్మార్ట్ సిటీ’గా మార్చడానికి ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.





